మా దగ్గర ఇలాంటి షాకులుండవ్‌

Published: Sat, 01 Feb 2020 20:10:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మా దగ్గర ఇలాంటి షాకులుండవ్‌

  • రాజధాని మార్పు.. షాకింగ్‌ నిర్ణయం
  • ప్రజలకు ముందు చెప్పకుండా ఏదీ నిర్ణయించం.. 
  • చేసేది మేనిఫెస్టోలో చెప్తాం... చెప్పిందే చేస్తాం
  • ఎన్నికల హామీలకు భిన్నంగా ఏమీ చేపట్టబోం..
  •  ప్రజా ప్రతినిధుల పనితీరు నచ్చకుంటే రీకాల్‌
  • పెట్టుబడులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం..
  •  ‘ఆంధ్రజ్యోతి’తో అల్బెర్టా మంత్రి ప్రసాద్‌ పాండా

 

మా దగ్గర ఒకటే సూత్రం. చేసేది చెప్తాం.. చెప్పిందే చేస్తాం. ప్రభుత్వ పాలనాకాలం నాలుగేళ్లలో ఏం చేస్తామో ఎన్నికల ముందు ఇచ్చే హామీల్లోనే చెప్తాం. దానికి భిన్నంగా ఏదీ చేసే సమస్యే ఉండదు. ప్రజలకు షాక్‌ కొట్టే ఎలాంటి నిర్ణయాలు ఉండవు. ఇప్పుడిక్కడ రాజధాని అంశం నడుస్తోంది. ఇలాంటి షాకింగ్‌ నిర్ణయాలు ముందుగా చెప్పకుండా తీసుకోం.

- కెనడాలోని అల్బెర్టా రాష్ట్రం మౌలిక సదుపాయాల శాఖమంత్రి ప్రసాద్‌ పాండా

 

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ‘‘మా దగ్గర ఒకటే సూత్రం. చేసేది చెప్తాం.. చెప్పిందే చేస్తాం. ప్రభుత్వ పాలనాకాలం నాలుగేళ్లలో ఏం చేస్తామో ఎన్నికల ముందు ఇచ్చే హామీల్లోనే చెప్తాం. దానికి భిన్నంగా ఏదీ చేసే సమస్యే ఉండదు. ప్రజలకు షాక్‌ కొట్టే ఎలాంటి నిర్ణయాలు ఉండవు. ఇప్పుడిక్కడ రాజధాని అంశం నడుస్తోంది. ఇలాంటి షాకింగ్‌ నిర్ణయాలు ముందుగా చెప్పకుండా తీసుకోం’’ అని కెనడాలోని అల్బర్టా రాష్ట్రం మౌలిక సదుపాయాల శాఖమంత్రి ప్రసాద్‌ పాండా పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో పుట్టి, ముంబైలో ఉద్యోగం చేసిన ఆయన అల్బర్టా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడి రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రి పదవిని చేపట్టారు. అక్కడి పాలన, శాసనవ్యవస్థ, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అనుసరించే పద్ధతి, ఉద్యోగుల పనితీరు తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి నుంచి అల్బర్టాకు మీ ప్రస్థానం ఎలా సాగింది?

సంగం జాగర్లమూడిలో పుట్టి, అక్కడే పదో తరగతి, ఉయ్యూరులో ఇంటర్‌, విజయవాడ వెలగపూడి సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివాను. తర్వాత ఏపీ స్కూటర్స్‌ లిమిటెడ్‌లో తొలి ఉద్యోగం చేశాను. అదే సమయంలో అమ్మకు కేన్సర్‌ రావడంతో 18నెలలు ఉద్యోగానికి బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత ముంబై వెళ్లి రిలయన్స్‌లో చేరి, 16ఏళ్ల పాటు మహారాష్ట్రలోనే ఉన్నాం. మా అబ్బాయి భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న సమయంలో అల్బర్టాలో ఒక కీలక అంశం నన్ను ఆకర్షించింది. ఆ రాష్ట్రం అప్పురహితం. అంటే వారికి పైసా అప్పు లేదు. అలాంటి చోటికి వెళ్తే మా అబ్బాయి భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో అల్బర్టాకు వెళ్లి స్థిరపడ్డాం.

 

అక్కడి రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు?

నేను అల్బర్టా వెళ్లేనాటికి ఆ రాష్ట్రానికి అప్పులేదు. 2005 తర్వాత ప్రభుత్వాలు అప్పులు తేవడం ప్రారంభించాయి. దీనికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి 2015లో కాల్గరి నియోజకవర్గం నుంచి గెలిచా. 2019లో రెండోసారి గెలిచి ప్రస్తుతం మంత్రిగా చేస్తున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో అల్బర్టాను అప్పురహిత రాష్ట్రంగా చేస్తామని హామీ ఇచ్చాం. అక్కడ మా బడ్జెట్‌తో పోలిస్తే అప్పు తక్కువే. రాష్ట్ర జనాభా 45 లక్షలు. కానీ వార్షిక బడ్జెట్‌ సుమారు రూ.2.75 లక్షల కోట్లు. జీడీపీ-అప్పు నిష్పత్తి తక్కువే. కానీ అప్పు ఉండకూడదన్నది మా లక్ష్యం.

 

ఇప్పుడిక్కడ రాజధాని మార్పు వేడి పుట్టిస్తోంది.

రాజధాని మార్పు లాంటి షాకింగ్‌ నిర్ణయాలు అక్కడ ముందుగా చెప్పకుండా తీసుకోం. ఏదైనా ఉంటే ఎన్నికల హామీల్లోనే చెప్తాం. అంతే తప్ప అధికారంలోకి వచ్చాక రహస్య అజెండాతో ఏమీ చేయం. గత ఎన్నికల సమయంలో మేం 375 హామీలు ఇచ్చాం. వాటిలో ఈ ఆరునెలల్లోనే 160 వరకూ అమలు చేసేశాం. ఎన్నికల హామీల్లో చెప్పని కీలక నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే. దానిపై రిఫరెండం నిర్వహించేలా చట్టం తెస్తామనేది మేమిచ్చిన హామీల్లో ఒకటి. ఓటరు రిఫరెండం పేరుతో ఈ ఏడాదే ఆ చట్టం తేబోతున్నాం. ప్రజాప్రతినిధుల పనితీరు నచ్చకుంటే వారిని రీకాల్‌ చేసే అవకాశాన్ని ఓటర్లకు ఇచ్చే చట్టాన్ని కూడా తీసుకువస్తున్నాం.

 

చట్టసభల పనితీరు ఎలా ఉంటుంది?

వ్యక్తిగత దూషణలు ఉండవు. చర్చంతా విధానంపైనే ఉంటుంది. అయితే ప్రతిపక్షం తన పాత్ర పోషిస్తుంది. చట్టాల్లో ఏమైనా సహేతుక సవరణలు ప్రతిపాదించి దానిపై చర్చ చేస్తుంది. అందులో మంచి ఉంటే అంగీకరిస్తాం. రాజకీయంగా, ఉద్యోగుల పరంగా కూడా అవినీతి అనే మాటే ఉండదు. ఉద్యోగులకు స్వేచ్ఛ ఉంటుంది.

 

ఏపీతో పరస్పర పెట్టుబడుల అవకాశాలు..!

అల్బర్టా మంత్రిగా అక్కడున్న అవకాశాలు భారత్‌లో నాకు పరిచయం ఉన్న రాష్ట్రాలకు వివరించేందుకు వచ్చా. దేశంలోని మూడో అతిపెద్ద చమురు నిల్వలు, ఐదో అతిపెద్ద గ్యాస్‌ నిల్వలు అక్కడున్నాయి. వంటగ్యాస్‌ అక్కడ పూర్తిగా ఉచితం. విద్యుత్‌ ఉత్పాదనకు, పరిశ్రమల్లో కూడా గ్యాస్‌ వాడతారు. వాటికి అత్యంత చవగ్గా గ్యాస్‌ సరఫరా చేస్తాం. భారత్‌లో ఎనర్జీ పావర్టీ(ఇంధన కరవు)ని నేనూ చూశా. కట్టెల పొయ్యిలు, పిడకలు వంటకు ఉపయోగించడం ఇప్పటికీ ఉంది. దీనివల్ల కేన్సర్‌ లాంటి వ్యాధులు వస్తాయి. అల్బర్టాలో ఉన్న అపార గ్యాస్‌ నిక్షేపాల్ని భారత్‌లోని రాష్ట్రాలకు లిక్విఫైడ్‌ గ్యాస్‌ రూపంలో సరఫరా చేయవచ్చు. అక్కడ తక్కువ ధరకే ఇవ్వడం వల్ల రవాణా చార్జీలు పడినా పెద్దగా భారం ఉండదు.

 

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే, తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చించా. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీతో ముంబైలో భేటీ అయ్యా. మా ప్రీమియర్‌ జేసన్‌ కెన్నీతో కలిసి నవంబరులో మళ్లీ వస్తాం. పారిశ్రామిక బృందం కూడా వస్తుంది. అప్పుడు ఒప్పందాలు జరుగుతాయి. ఏపీ ప్రభుత్వం చర్చించాలనుకుంటే అందుబాటులోనే ఉంటా. నన్ను సంప్రదించడానికి అవసరమైన సమాచారం వారివద్ద ఉంది. మాట్లాడాలనుకుంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా నేను సిద్ధంగానే ఉన్నా.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

విదేశీ విన్నర్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.