సరిహద్దులు దాటుతున్న మద్యం

Jun 16 2021 @ 23:07PM
బెల్ట్‌షాపులో మద్యాన్ని విక్రయిస్తున్న దుకాణదారుడు

- తెలంగాణ టు మహారాష్ట్ర వయా జుక్కల్‌, మద్నూర్‌
- బెల్టుషాపు నిర్వాహకుల కనుసన్నల్లోనే అక్రమ మద్యం రవాణా?
- జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్టుషాపులు
- మద్యం మత్తులో ఊగుతున్న పల్లె ప్రజలు
- పెద్ద దిక్కు కోల్పోతున్న పేద కుటుంబాలు
- ఎక్సైజ్‌ శాఖాధికారులు దాడులు చేసినా ఫలితం శూన్యం


బాన్సువాడ, జూన్‌ 16: తెలంగాణ మద్యం సరిహద్దులు దాటుతోంది. కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన జుక్కల్‌, మద్నూర్‌, పెద్ద కొడప్‌గల్‌ మండలాల నుంచి భారీగా మద్యం మహారాష్ట్ర ప్రాంతానికి తరలిపోతోంది. మహారాష్ట్రలో మద్యానికి భలే డిమాండ్‌ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలోని జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్యం వ్యాపారులు కొంత మంది మహారాష్ట్రకు మద్యాన్ని సరఫరా చేస్తూ పెద్ద సంఖ్యలో దండుకుంటున్నారనే ఆరోపణులున్నాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గం సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ర్టాలకు దగ్గరలో ఉంటుంది. జుక్కల్‌, మద్నూర్‌ మండలాల్లోని వైన్సు దుకాణాలకు టెండర్లు వేసే సమయంలో భారీగా టెండర్లు వచ్చి పడతాయి. ఎందుకంటే మహారాష్ట్ర ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో మద్యాన్ని అక్రమంగా సరఫరా చేయవద్దనే ఉద్దేశ్యంతో ఈ ప్రాంత వ్యాపారులు ఎక్కువగా పాల్గొంటారు. అంతేకాకుండా మహారాష్ట్రలో బీరు ధర 180 నుంచి 200 రూపాయలు, క్వాటర్‌ ధర 180 పలుకుతోంది. అయితే కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలో బీరు ధర 160 రూపాయలు, క్వాటర్‌ ధర 170 రూపాయలు ఉంటుంది. అయితే వ్యాపారులు కొంతమంది మహారాష్ట్రలోని వ్యాపారులతో మిలాఖత్‌ అయి భారీగానే మద్యాన్ని అక్రమ మార్గంలో సరఫరా చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా ప్రతీ వారానికి ఒక డీసీఎం వ్యానులో భారీగా మద్యం తరలిపోతుందని అక్కడి ప్రజల ఆరోపణలున్నాయి. అయితే బెల్టుషాపు నిర్వాహకులు మద్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు అక్కడి ప్రజల ఆరోపణలు. అదేవిధంగా జుక్కల్‌, మద్నూర్‌ మండలంలోని కొంతమంది బెల్టుషాపు నిర్వాహకులు మహారాష్ట్రలోని వ్యాపారులతో కుమ్మక్కై భారీగా అక్రమ మద్యం అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జుక్కల్‌ మండలంలోని హనేగాం, మారేగాం గ్రామాల నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. అదేవిధంగా మద్నూర్‌ మండలానికి దగ్గరలో దెగ్లూర్‌ ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు మహారాష్ట్రకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇదే అదనుగా చేసుకున్న కొంతమంది బెల్టుషాపు నిర్వాహకులు ఈ తతంగం నడుపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డివిజన్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి డివిజన్లలోని అన్ని గ్రామాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లా వెలిశాయి. పల్లె ప్రజలు మద్యం మత్తులో జోగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నపాటి కూలి పనులు చేసుకుని వచ్చిన డబ్బులతో బెల్టు షాపుల్లో తగిలేస్తూ మద్యానికి బానీస అవుతున్నారు. ఒకవైపు ఆరోగ్యం క్షీణిస్తూ, మరోవైపు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పేద కుటుంబాలన్నీ పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నారు. గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేకున్నా పుట్ట గొడుగుల్లా బెల్టుషాపులు పుట్టుకొస్తున్నాయి. బెల్టుషాపులను నివారించాలని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ లైసెన్సులను పొందిన మద్యం షాపుల నిర్వాహకులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గ్రామాలపై కన్నేశారు. గ్రామాల్లో ఒకరిద్దరిని ప్రోత్సహిస్తూ గ్రామాల్లో బెల్టుషాపులను ఏర్పాటు చేయించి, తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. చేసిన కష్టానికి వచ్చిన డబ్బులను మధ్య తరగతి కుటుంబాలు బెల్టుషాపుల్లో ఖర్చు చేస్తూ మద్యం మత్తులో తూగుతున్నారు. రైతులు వ్యవసాయ పనుల కోసం కూలీలకు డిమాండ్‌ పెరగడంతో కూలీలకు రెండు చేతుల డబ్బులు అందుతున్నాయి. దీంతో సాయంత్రం కాగానే బెల్టుషాపుల్లో ఖర్చు చేస్తూ వొల్లుగుల్ల చేసుకుంటున్నారు. బెల్టుషాపు నిర్వాహకులు ఒక్కొక్క బాటిల్‌పై 20 నుంచి 40 రూపాయలు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇంటి పెద్ద దిక్కు మద్యానికి బానీసై ఇష్టారీతిన వ్యవహరించడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు కుటుంబం నడుపడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గ్రామాన వీధి వీధిన బెల్టుషాపులు కొనసాగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని పల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతూ మద్యం మత్తులో పల్లె ప్రజలు జోగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కొంతమంది ఎక్సైజ్‌ శాఖలోని సిబ్బంది, ఉన్నతాధికారులు ఎవరైనా దాడులు చేసేందుకు వచ్చిన సమయంలో బెల్టుషాపు నిర్వాహకులకు, వైన్సు షాపు యజమానులకు సమాచారం ముందుగానే అందిస్తారు. దీంతో బెల్టుషాపు వ్యాపారులు అప్రమత్తమై మద్యాన్ని దాచి పెడతారు. ఎక్సైజ్‌ అధికారుల దాడిలో ఎలాంటి మద్యం దొరుకక తిరిగి వెళ్లిపోతారు. ఇది ఉమ్మడి జిల్లాలోని బెల్టుషాపుల్లో వ్యాపారులు చేస్తున్న నిర్వాహకం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా పల్లెల్లో బెల్టుషాపులను నియంత్రించి పేద కుటుంబాలు వీధిన పడకుండా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.

Follow Us on: