దోపిడీ ముఠాలపై అప్రమత్తం

ABN , First Publish Date - 2021-12-08T06:27:12+05:30 IST

నరహంతక దోపిడీ ముఠాల సంచారంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.

దోపిడీ ముఠాలపై అప్రమత్తం
ఒంగోలు శివారున గుడారాల్లో ఉంటున్న వారిని విచారిస్తున్న పోలీసులు

వరుస ఘటనలతో పోలీసుల ప్రత్యేక చర్యలు

కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా

గుడారాల్లో నివాసముంటున్న వారిపై దృష్టి

జిల్లావ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

అనుమానితులు కనిపిస్తే 100కు కాల్‌ చేయండి 

ఒంగోలు(క్రైం) డిసెంబరు 7: నరహంతక దోపిడీ ముఠాల సంచారంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో హత్యనేరాలతో పాటు జిల్లాలోని పూసపాడు, టంగుటూరుల్లో దారుణ హత్యలు చోటుచేసుకోవడంతో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలోకి చొరబడి హత్యలు చేసి దోపిడీలకు పాల్పడే ముఠాలు రాష్ట్రంలోకి ప్రవేశించనట్లు అనుమానిస్తున్న పోలీసులు నిఘా పెంచారు. అదేక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్ల ద్వారా మెసేజ్‌లు పంపించారు. మంగళవారం వేకువజామున 5 నుంచి ఉదయం 8 గంటల వరకూ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల్లో గుడారాలు వేసుకొని నివసిస్తున్న వారి సమాచారం సేకరించారు. ఈవిధంగా వివిధ ప్రాంతాల్లో వెయ్యి మంది ఉంటున్నట్లు గుర్తించి నాన్‌లోకల్‌ యాప్‌లో వారి సమాచారం పొందుపరిచారు. మరోవైపు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ మలిక గర్గ్‌ పోలీసు అధికారులతోపాటు మహిళా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అపార్ట్‌మెంట్లు, శివారు ప్రాంతంలో నివాసం ఉండే వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవా లని ఆమె సూచించారు. నరహంతక దోపిడీ ముఠాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. 


నేరాలకు పాల్పడే దోపిడీ ముఠాలు

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి పార్థీ, భవార్య, ఇరానీ, చెడ్డీ గ్యాంగ్‌లు ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించాయన్న సమాచారంతో ఎస్పీ పోలీసు యత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటుగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆ ముఠాలు పగలు రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు దోపిడీలకు పాల్పడుతుంటాయని వివరించారు. ఆ సమయంలో కత్తులు, ఇనుపరాడ్లతో దారుణంగా హత్యలు చేయడానికి వెనుకాడారని ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. అనుమానితులు వేలిముద్రల సేకరణతోపాటు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. రాత్రుళ్లు గస్తీ పెంచాలని సూచించారు. అనుమానాస్పదంగా తిరిగే వారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే 100కు కాల్‌ చేయాలని పోలీసులు కోరారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేవారు, లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) సేవలను వినియోగించుకోవాలన్నారు. 


గుడారాల్లో నివాసముంటున్న వారి వివరాల సేకరణ

శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారి సమగ్ర సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఎక్కడ నుంచి వచ్చారు. ఆధార్‌కార్డుల ప్రకారం వారి చిరునామా, ఎందుకు వచ్చారు అనే సమగ్రమైన వివరాలను సేకరించారు. ఒంగోలులో గాంధీనగర్‌, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఫ్లైఓవర్‌ కింద నివాసం ఉండేవారిని పోలీసులు విచారించారు. వారి జీవన విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా వారి వివరాలను నాన్‌లోకల్‌ యాప్‌లో నిక్షిప్తం చేశారు.




Updated Date - 2021-12-08T06:27:12+05:30 IST