అగ్నిపథ్‌ ఆందోళనలతో అప్రమత్తం

ABN , First Publish Date - 2022-06-18T07:29:36+05:30 IST

దేశ వ్యాప్తంగా అగ్నిపఽథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

అగ్నిపథ్‌ ఆందోళనలతో అప్రమత్తం
ఒగోలు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను విచారిస్తున్న ఏఆర్‌ ఏఎస్పీ అశోక్‌బాబు

రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో పోలీసు పికెట్లు

హింసాత్మక ఘటనలకు పాల్పడితే  క్రిమినల్‌ కేసులు

ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు(క్రైం), జూన్‌ 17 : దేశ వ్యాప్తంగా అగ్నిపఽథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.  రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లతోపాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పికెట్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మలికగర్గ్‌ ఆదేశాలు జారీచేశారు. అగ్నిపథ్‌ ఆందోళనలో సంఘవిద్రోహశక్తులు చేరే అవకాశం ఉండటంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్లు వద్ద అనుమానిత వ్యక్తులు, విద్యార్థుల కదలికలపై ఆరా తీస్తున్నారు. పాత నేరస్థులు, రౌడీషీటర్స్‌పై నిఘా ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హింసాత్మక ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని కోరారు.  శాంత భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ అశోక్‌బాబుతోపాటు ఎస్‌బీ డీఎస్పీ మరియదాసు తదితరులు శుక్రవారం రాత్రి ఒంగోలు రైల్వే పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు  సిబ్బందికి పలు సూచనలు చేశారు.

 

విద్యార్థి నాయకులపై నిఘా

 అగ్నిపథ్‌ ఆందోళనతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులతోపాటు రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. అదేవిధంగా విద్యార్థి నేతలకు  ముందస్తు నోటీసులు ఇచ్చారు. అదేక్రమంలో రౌడీషీటర్లను పోలీసు స్టేషన్లకు పిలిపించి హెచ్చరికలు జారీచేశారు. ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠినచర్యలు తీసుకుం టామని పోలీసు అధికారులు హెచ్చరించారు. నగరంలో పోలీసులు విద్యార్థుల ఇళ్లపై నిఘా ఉంచారు. కొందరు నాయకులు ఇళ్ల వద్ద లేకపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు.




Updated Date - 2022-06-18T07:29:36+05:30 IST