ఆలేరు Congressలో మూడుముక్కలాట.. రోజు రోజుకు పెరుగుతున్న వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2022-07-19T02:48:32+05:30 IST

ఆలేరు (Aleru) నియోజకవర్గానికి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఇన్‌చార్జి లేరు. అక్కడి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ....

ఆలేరు Congressలో మూడుముక్కలాట.. రోజు రోజుకు పెరుగుతున్న వర్గ విభేదాలు

యాదాద్రి-భువనగిరి (Yadadri Bhuvanagiri):  ఆలేరు (Aleru) నియోజకవర్గానికి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఇన్‌చార్జి లేరు. అక్కడి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Mp Komatireddy Venkat Reddy) కాంగ్రెస్ పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన అనుచరుడు బీర్ల అయిలయ్య పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నియోజకవర్గ సీనియర్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ (Ex Mla Kududhula nagesh), మరో నేత కల్లూరి రామచంద్రారెడ్డి, మరికొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. దీంతో వారి మధ్య విభేదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయట. 


ఇటీవల యాదాద్రి-భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనీల్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భువనగిరిలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆలేరు కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఆలేరు కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే  కుడుదుల నగేష్, బీర్ల అయిలయ్య మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నగేష్ పై  అయిలయ్య తీవ్ర విమర్శలు చేశారు. మధ్యలో కలుగజేసుకున్న డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని టీపీసీసీ దృష్టికి తీసుకెళతానని సర్దిచెప్పారట. 


ఇక ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు టీపీసీసీ (Tpcc) నుంచి అధికారికంగా ఎవరికీ ఇవ్వలేదు. అయినా తానే ఇన్‌చార్జ్‌నంటూ మూడేళ్ళుగా  బీర్ల అయిలయ్య సొంత డబ్బా కొట్టుకుంటున్నారని మిగతా నేతలు ఆరోపిస్తున్నారు. అయిలయ్య  బీర్ల ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఆయన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో కలిసి సీలింగ్ భూముల కబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేష్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నారు. తనలాంటి వారికి గుర్తింపు ఎక్కడని ఆయన పార్టీ అధిష్టానం దగ్గర వాపోయారట. నియోజకవర్గంలో ఉన్న పాత పరిచయాలతో నగేష్‌ ప్రజల్లోకి వెళ్తున్నారట. తనకు మళ్లీ ఒకసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారట.


ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించిన కల్లూరి రామచంద్రా రెడ్డి బీఎస్పీ (Bsp) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారైనా అవకాశం వస్తుందని ఆశతో ఉన్నారట. దీంతో ఆలేరులో కాంగ్రెస్‌ నేతల వ్యవహారం మూడు ముక్కలాటగా మారింది. అయిలయ్య ఎంపీ కోమటిరెడ్డి అనుచరుడిగా ఉండగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్, రామచంద్రారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) కోటరీలోకి వెళ్లినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆలేరు కాంగ్రెస్ నాయకుల్లో గుబులు మొదలైందట. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నా నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి కష్టాలు తప్పేలా లేవన్న ప్రచారం సాగుతోంది. మరి కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ నాయకులను ఎలా సమన్వయం చేస్తారో చూడాల్సి ఉంది.




Updated Date - 2022-07-19T02:48:32+05:30 IST