యంత్ర మానవుడు

ABN , First Publish Date - 2021-03-07T18:58:10+05:30 IST

గ్లూకోజ్‌ బాటిల్‌ సూదిని చేతి నరాలకు గుచ్చితేనే విలవిల్లాడతామే...

యంత్ర మానవుడు

గ్లూకోజ్‌ బాటిల్‌ సూదిని చేతి నరాలకు గుచ్చితేనే విలవిల్లాడతామే... అలాంటిది, అరవై ఏళ్లుగా ఈ ఇనుప యంత్రం ఆధారంగా జీవిస్తున్న ఇతని గురించి తెలుసుకుంటే మాటలు రావు...  


ఐరన్‌లంగ్‌ సహాయంతోనే పాల్‌ అరవై ఏళ్ల నుంచి బతుకుతున్నాడు. ఇది వరకు అమెరికాకు చెందిన మార్తా మసన్‌ అనే మహిళ ఐరన్‌లంగ్‌ సహాయంతో 71 ఏళ్లు జీవించింది. 2003లో వాయిస్‌ యాక్టివేటెడ్‌ కంప్యూటర్‌ ద్వారా తన జీవితాన్ని రికార్డు చేసింది. అది ‘బ్రీత్‌’ అనే పుస్తకంగా వచ్చింది. ఇప్పుడు పాల్‌ పుస్తకం బాగా పాపులర్‌ అయ్యింది. 


అమెరికాలోని డల్లాస్‌కు చెందిన పాల్‌ అలెగ్జాండర్‌కు ఇప్పుడు 72 ఏళ్లు. ఆరేళ్ల వయసులో సోకిన వింత పోలియో అతని జీవితాన్ని ఇలా ఇనుప చట్రంలో బంధించింది. 1952 అమెరికాకు పీడకలలాంటి సంవత్సరం. వాస్తవానికి 1916 నుంచీ ఏటా ఎండాకాలం పిల్లలపై మహమ్మారిలా దాడి చేసి కనీసం యాభైమందిని పొట్టనపెట్టుకునేదీ వ్యాధి. ఆ ఏడాది మరింత విజృంభించింది. ఏకంగా 58 వేల కేసులు నమోదయ్యాయి. అందులో 31 వేల మంది చనిపోయారు. మరో 21 వేల మంది చిన్నారులకు పక్షవాతం వచ్చింది. అందులో ఒకరు పాల్‌ అలెగ్జాండర్‌. 


ఆ రోజు బయటికి వెళ్లి ఆడుకుని ఇంటికి వచ్చిన పాల్‌ తలుపు కొట్టాడు. అప్పటికే తూలుతున్నాడు. ఆ శబ్దానికి వంటగదిలో నుంచి పరిగెత్తుకొచ్చింది అతని తల్లి. బూట్లు విప్పకుండానే ఇంటిలోపలికి వచ్చి కూలబడ్డ పాల్‌ను పలకరించింది. అవేవీ పట్టించుకోని అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళితే - ఆ పిల్లాడు అప్పటికే చనిపోయాడన్నాడు ఒక డాక్టర్‌. మరో ఆస్పత్రికి వెళితే రెస్పిరేటరీ సిలిండర్‌లో పడుకోబెట్టాడు వైద్యుడు. కొద్దికొద్దిగా గాలిని పీల్చమని శిక్షణ ఇచ్చాడతను. తాను పీలుస్తున్న గాలి ఒక కొలిమి తిత్తిలాంటి దాని ద్వారా బయటికి నెట్టబడుతున్న విషయాన్ని పాల్‌ గ్రహించాడు. అయితే లోపల ఒక్కటే ఉక్కపోత. కాస్త కోలుకున్నాక తల తిప్పి అటూఇటూ చూస్తే... తనలాగే ఒక పెద్ద సిలిండర్‌లో పడుకున్న పిల్లలే కనిపిస్తున్నారు. యంత్రం ఒత్తిడికో, వేడికో పిల్లలంతా ఏడుస్తున్నారు. పలకరింపులతో పరిచయమైన పిల్లలు రెండు మూడు రోజులకే మాయమైపోతున్నారు. ఏమయ్యారని నర్సును అడిగితే... చనిపోయారని చెప్పేది. ‘ఈ పిల్లాడికి ఇదే చివరి రోజు. ఇతను బతకడం కష్టం. ఏ క్షణంలోనైనా ఊపిరి ఆగిపోవచ్చు..’ అనేవారు డాక్టర్లు. ఆస్పత్రిలో 18 నెలలు గడిపిన తరువాత యంత్రంలో ఉన్న పాల్‌ను తల్లిదండ్రులు అలాగే ఇంటికి తీసుకెళ్లారు. కరెంటు పోయినప్పుడు తల్లిదండ్రులిద్దరూ పెడల్‌ తొక్కుతూ యంత్రం నడిచేలా చూసేవారు. 



ఇక బతికినన్నాళ్లు ఇలా సిలిండర్‌లోనే బతకాల్సి వస్తుందని అర్థమైంది పాల్‌కు. నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ, నర్సుల సేవలు తప్పలేదు. ఎన్నాళ్లయినా తను ఈ యంత్ర సహాయంతోనే జీవించాలి. ధైర్యం కోల్పోలేదు పాల్‌. యంత్రంలోనే స్కూలుకు వెళ్లాడు. దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాడు. 1984లో టెక్సాస్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడీ యంత్ర మానవుడు. అంతటితో ఊరుకోలేదు. ఆస్టిన్‌ ట్రేడ్‌ స్కూల్‌లో రెండేళ్ల పాటు లీగల్‌ టెర్మినాలజీపై విద్యార్థులకు క్లాసులు తీసుకున్నాడు. ఆ తరువాత డల్లాస్‌, ఫోర్ట్‌ వర్త్‌ కోర్టుల్లో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశాడు. మూడు ముక్కలుగా చక్రాల కుర్చీలా మారే యంత్రాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు పాల్‌. అందులోనే కోర్టుకు హాజరయ్యేవాడు. 


తనను కలవడానికి ఇంటికి వచ్చిన వారు.. మొదట్లో చూడగానే బాత్‌టబ్‌లో ఉన్నాడనుకునేవారు. ‘మీరు అనుకున్నట్లు ఇది టబ్‌ కాదు. ఐరన్‌ లంగ్‌. చిన్నప్పుడు నాకు సోకిన పోలియో వల్ల ఇలా బతకాల్సి వచ్చింది’ అని వివరంగా చెప్పాల్సి వచ్చేది. ఆ రోజుల్లో ఇలాంటి యంత్రాలతో జీవించేవారిని జనం వింతగా చూస్తారనే భయంతో బయటికి వచ్చేవారు కాదు బాధితులు. అయితే పాల్‌ మాత్రం దేన్నీ లెక్కచేయలేదు. యంత్రంతోనే చర్చికి, సముద్రతీరానికి తరచూ వెళ్లేవాడు. రైలులో కూడా ప్రయాణించేవాడంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణ జీవితంలోని ఏ సరదానూ అతను వదులుకోలేదు. తన జీవితాన్ని అక్షరబద్ధం చేశాడు. అందుకోసం ఒక అడుగు పొడవున్న ప్లాస్టిక్‌ పుల్లను నోట్లో పెట్టుకుని... దాని కొసకు ముడేసిన పెన్సిల్‌తో లాప్‌టాప్‌ కీ బోర్డును తాకుతూ.. టైప్‌ చేసేవాడు. ఇలా ఎనిమిదేళ్లు కష్టపడాల్సి వచ్చింది. అంతకాలం మధ్య పుల్లను గట్టిగా పట్టుకోవడం వల్ల దంతాలు అరిగిపోయేవి. అలా తను రాసిన పుస్తకం పేరు ‘త్రి మినిట్స్‌ ఫర్‌ ఎ డాగ్‌’, మై లైఫ్‌ ఇన్‌ యాన్‌ ఐరన్‌ లంగ్‌... సుమారు 132 పేజీలున్న ఈ పుస్తకం గత ఏడాది మార్కెట్‌లోకి వచ్చింది. పాల్‌ జీవితాన్ని చదివిన కొందరు వెంటిలేటర్‌లాంటి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూరుస్తామని ముందుకొచ్చారు. అయితే వారి సహాయాన్ని పాల్‌ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం తాను ఉన్న ఇనుప యంత్రంలోనే సుఖంగా ఉన్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు.

జీవితంపై నీకున్న సంకల్పబలం ముందు సాధారణ మనుషుల కష్టాలు ఏపాటివి పాల్‌. నీకు హ్యాట్సాఫ్‌.

- బి.నర్సన్‌, 

94401 28169

Updated Date - 2021-03-07T18:58:10+05:30 IST