ష్‌.. గప్‌చుప్‌!

ABN , First Publish Date - 2022-08-10T05:52:40+05:30 IST

పశ్చిమప్రాంతంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోయాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ఈ భూబాగోతాలు మార్కాపురం డివిజన్‌లోని మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాల్లో ఎక్కువయ్యాయి.

ష్‌.. గప్‌చుప్‌!
రాజంపల్లిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వైసీపీ నేత వేసిన కంచె

భూఅక్రమాలపై చర్యలు శూన్యం

విచారణల పేరుతో తీవ్రజాప్యం

ఆక్రమించిన భూములను  అమ్ముకుంటున్న  అధికారపార్టీ నేతలు

మంత్రి సురేష్‌ సిఫార్సులను పట్టించుకోని అధికారులు

కాచే వారే సహకరిస్తున్నారు. అమ్యామ్యాలకు, ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. దీంతో పెద్దారవీడు మండలంలో అధికారపార్టీకి చెందిన నేతల భూకబ్జాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు కరువయ్యాయి. ఇష్టారీతిన చేపట్టిన ఆక్రమణలపై విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా రాష్ట్ర మంత్రి సురేష్‌ చేసిన సిఫార్సులను అధికారులు పక్కనపెట్టారు. విచారణల పేరుతో చేస్తున్న జాప్యం కారణంగా అక్రమార్కులు తమ పని చక్కబెట్టుకుంటున్నారు. భూములను కబ్జా చేసిన వారు రెవెన్యూ రికార్డులను మార్చి, వాటిని అమ్మేస్తున్నారు. వారికి అధికారుల సహకారం మెండుగా లభిస్తోంది.

మార్కాపురం, ఆగస్టు 9: పశ్చిమప్రాంతంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోయాయి.  ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ఈ భూబాగోతాలు మార్కాపురం డివిజన్‌లోని మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాల్లో ఎక్కువయ్యాయి. ప్రధానంగా పెద్దారవీడు మండలంలో అయితే ఆక్రమించుకోవడమే కాదు వాటి రికార్డులను సైతం మార్చి అమ్మేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దారవీడు మండలంలోని వైసీపీ నేతల భూఅక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ కార్యాలయంలో 2021 డిసెంబర్‌ 28న రెవెన్యూ సమస్యలపై ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక స్పందన నిర్వహించారు. ఈ  సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి భూవివాదాలు, తహసీల్దార్‌ కార్యాలయంలో పనుల జాప్యం, సిబ్బంది చేసిన అక్రమాలపై సుమారు 50కిపైగా అర్జీలు వచ్చాయి. అందులో అధికారపార్టీ నాయకుడు చేసిన భూఅక్రమాలూ ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి స్థానిక అధికారులను ఆదేశించారు. 


వైసీపీ నేత ఆగడాలపై అధికంగా ఫిర్యాదులు

చట్లమిట్లకు చెందిన ప్రస్తుత అధికార పార్టీ నాయకుడు యేరువ చిన్న కోటిరెడ్డి భారీ ఎత్తున ప్రభుత్వ భూములను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అన్యాక్రాంతం చేశాడని సర్పంచ్‌ అల్లూరమ్మ కుమారుడు, వైసీపీ యువ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి ఆధారాలతో కూడిన అర్జీని ఆర్డీవోకు అందజేశారు. వాటిని ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణలు వచ్చిన నేత గత పర్యాయం మండలాధ్యక్ష పదవిని అలంకరించిన యేరువ భాగ్యలక్ష్మి భర్త. ఈక్రమంలోనే ఆయన భార్య, బంధువులు, ఇంట్లో పనిచేసే వారి పేర్లతో చట్లమిట్ల, తోకపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూమిని రికార్డుల్లో మార్చినట్లు వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. చిన్నకోటిరెడ్డి ఆయన పేరుతో 13.10 ఎకరాలు, భార్య భాగ్యలక్ష్మి పేరుతో 6.97 ఎకరాలు, కోడలు లక్ష్మీదేవి పేరుతో 20.32 ఎకరాలు, కుమారుడు యేరువ శేషశయనారెడ్డి పేరుతో 21ఎకరాలు, బంధువులు కుందురు అనంతలక్షమ్మ పేరుతో 4.12 ఎకరాలు, కుందురు వెంకటనారాయణరెడ్డి పేరుతో 7.61 ఎకరాలు, కుందురు వెంకటరంగలక్షమ్మ పేరుతో 5.5 ఎకరాలు, మాదిరెడ్డి వీరమ్మ పేరుతో 2 ఎకరాలు, యేరువ వెంకటలక్షమ్మ పేరుతో 2 ఎకరాలు, దొడ్డా సుబ్బారెడ్డి పేరుతో 1.04 ఎకరాలు, పనిమనిషి కర్రోల అల్లూరయ్య పేరుతో 5.08 ఎకరాలు రికార్డుల్లో మార్చి భూమిని కైవసం చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని మంత్రి సురేష్‌ సైతం వెంకటేశ్వరరెడ్డికి సిఫార్సు లెటర్‌ ఇచ్చారు. 


విచారణ పేరుతో జాప్యం...

గతంలో చేసిన భూఆక్రమణలపై అధికారులు విచారణల పేరుతో జాప్యం చేస్తున్నారు. చిన్నకోటిరెడ్డి తన కుటుంబ సభ్యులు, ఇంట్లో పనివారి పేర్లతో భూములను ఆక్రమించి రెవెన్యూ రికార్డులను సైతం అప్పటి అధికారులపై సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించి మార్చేశాడు. వాటిపై ఆర్డీవో నిర్వహించిన ప్రత్యేక స్పందనలో ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీంతో మండలంలో యథేచ్ఛగా భూఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి.


శ్మశాన స్థలం, రామన్నకుంట ఆక్రమణ

రాజంపల్లి ఇలాకాలో సర్వే నెంబర్‌ 534లో 6.87ఎకరాల భూమి ఉంది. అందులో 3.87ఎకరాలు ప్రైవేటు వ్యక్తులది కాగా మిగిలిన 3ఎకరాలు రామన్నకుంట. అందులో ఒక ఎకరా భూమిని గ్రామస్థులు శ్మశానంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సదరు నాయకుని కన్ను ఆ మూడు ఎకరాలపై పడింది. దీంతో ఆ స్థలంలో రాత్రికి రాత్రి బోరు వేశాడు. అక్కడ ఉన్న సమాధులను తొలగించాడు. 


ఇతర ప్రాంతాల వారికి విక్రయం

రాజంపల్లి ఇలాకాలో సర్వే నెంబర్లు: 583, 584, 585లో సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వాటికి సంబంధించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన వైసీపీ నాయకుడు కొంత తన కుటుంబసభ్యుల పేరుతో చేయించుకున్నాడు. మిగిలిన భూములను ఇతర ప్రాంతాల వారికి విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.  


విచారించి చర్యలు తీసుకుంటాం

కృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌

రాజంపల్లిలో జరిగిన భూఅక్రమాలకు సంబంధించి కొన్ని సర్వే నెంబర్లపై జాయింట్‌ కలెక్టర్‌ పరిధిలో విచారణ జరుగుతోంది. ఇంకా ఏమైనా భూ ఆక్రమణలు జరిగి ఉంటే విచారించి చర్యలు తీసుకుంటాం.




Updated Date - 2022-08-10T05:52:40+05:30 IST