పక్కాగా లెక్క

ABN , First Publish Date - 2020-09-23T08:21:16+05:30 IST

రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్‌ ఫ్లాట్లు, వ్యవసాయేతర భూముల ..

పక్కాగా లెక్క

ఆస్తుల వివరాలన్నీ పక్షం రోజుల్లోగా ఆన్‌లైన్‌లోకి

ఆస్తి పన్ను బాకీ వివరాలు అందులోనే

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి వివరాలు నమోదు

ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, భూములన్నీ కూడా

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

ప్రజలు కూడా సహకరించాలని వినతి

నేడు మార్గదర్శకాలు విడుదల

కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం


పల్లెల్లో ఇళ్లు, భూముల నుంచి.. పట్నాల్లో ప్లాట్లు, ఫ్లాట్ల దాకా.. రాష్ట్రంలో ఆస్తుల లెక్కలన్నీ పదిహేను రోజుల్లోగా పక్కాగా ఆన్‌లైన్‌కెక్కనున్నాయి! ప్రతి ఆస్తికి సంబంధించి పన్ను వివరాలు, నల్లా బిల్లులు, యజమాని ఆధార్‌ నంబరు.. అన్నీ అందులో ఉండనున్నాయి. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌ మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. 


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్‌ ఫ్లాట్లు, వ్యవసాయేతర భూముల వివరాలన్నీ 15 రోజుల్లోగా సమగ్ర వివరాలతో ఆన్‌లైన్‌లో చేర్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చే లోపే మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన అన్ని స్థాయుల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి దాకా నమోదు కాని ఆస్తుల వివరాలను 100ు వెంటనే ఆన్‌లైన్‌లో చేర్చడానికి వీలుగా కసరత్తు చేయాలని స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలు, గ్రామ పంచాయతీలు, పురపాలికలు, పురపాలక సంస్థల ఆస్తుల వారీగా వివరాలను యంత్రాంగం సేకరించాలన్నారు. ప్రతి ఆస్తికీ పన్ను వివరాలతోపాటు నల్లా బిల్లు, యజమాని ఆధార్‌ కార్డు వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియను మునిసిపల్‌ అధికారులు, జిల్లా, మండల, పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలు కూడా ఇందుకు ముందుకు రావాలని, అధికారులకు పూర్తి వివరాలు అందించాలనిచెప్పారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నామని, లక్ష్య సాధనకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


వెబ్‌సైట్‌ను ఒక్కసారి ప్రారంభించాకా ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని రోజులు ఆలస్యమైనా పరవాలేదని, లోపాల్లేకుండా చూడాలని సూచించారు. ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, డంప్‌ యార్డుల ఏర్పాటు, ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం, చెత్త తరలింపు తదితర అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


నేడు సీఎస్‌ వీడి యో కాన్ఫరెన్స్‌

ధరణితోపాటు వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చే ప్రక్రియ, రిజిస్ట్రేషన్ల సన్నాహకాలపై బుధవారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్లు చేయడానికి అదనంగా తహసీల్దార్‌ కార్యాలయానికి ఏయే మౌలిక సదుపాయాలు అవసరం వంటివాటిపై జిల్లాల వారీగా ఆరా తీయడంతోపాటు తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇక వ్యవసాయేతర భూములు, ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో చే ర్చి, డేటాను నవీకరించడానికి అదనపు కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించనున్నారు. సీఎం ఆదేశాలపై బుధవారం లేదా గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

Updated Date - 2020-09-23T08:21:16+05:30 IST