
ఇప్పుడే మర్చిపోయిన వాక్యంలా నావ సముద్రంలో
ఎక్కడో అదాటుగా మునిగిపోతే ఎలా?
మర్చిపోను, మర్చిపోలేను
ఈ నక్షత్ర స్థగిత ఆకాశాన్ని ఒంటరినై
గుర్తుకి తెచ్చుకోలేను నిశీ నిషాద
నిర్మోహత్వాన్నీ వాయులీనాన్నీ
చించి పారేసిన కాగితాన్నీ, దాని ఆనవాళ్ళ జాబితానీ
నీవుగా నిషేధించిన
ఆనాటి జ్ఞాపకాలనీ, దీప కాంతుల
వావివరుసలనీ....
నా ఓడలో లేదూ పడవలో ప్రయాణాలు చేపలకి ఏమి ఎరుక
నగ్నంగా నడిచొచ్చే నవ్య అలల సమూహాలకి ఏది చివరి జ్ఞాపిక
అమ్మ ఒడిలో నా బాల్యం ఏ శూన్య కాంతుల సరీలీనం గాలి గోపురంలో
ఏదో వాకిట మౌనినై మధ్యస్తంగా బూడిద పూసుకున్నాను ఇన్నాళ్లు తటస్థంగా
గవాక్షంలోని పగిలిన పాత మరకల్లో, అద్దాలు నాటిన గరిక పోచల్లో
తమోలింగ స్పర్శతో రాత్రుళ్ళని గడ్డ కట్టించాను
ఆలస్యంగా అయినా నాకో పాద రక్ష దొరికింది
జీవితాంతం ఏదో పాడె భ్రమల్లో బంధీగా దొరికాను, చివరికిలా మిగిలాను
అందుకే నా మనో నాటికల్లో పాత్రనై
సమాధికి దారి చూపించాను, కాఫీ క్లబ్బుల్లో
ఆగీ కాగే మంటల్లో కపాల దర్శనం గంగా నదిగా శమించను బిర్యానీ పాకెట్‌తో
నేను ఒకడినై అనేకులుగా నడుస్తున్నాను
క్రియనీ, విశేషణాన్నీ వక్షోజంలో తడుముతున్నాను... అంబులెన్స్‌లో
నిశిరాత్రి చచ్చిపోతే ఫర్లేదు నీకు మరో సంక్షోభం అద్దెకిస్తాను
ఎవర్రా నా కాళ్ళని సమాధిలో
నా మొండేన్ని అమెజాన్‌లో విక్రయం చేస్తున్నది
నన్ను నా మధుపాత్రలో ఓ తేనెటీగగా దారి తొలవనివ్వండి
హాయిహాయిగా అక్షరాలని గుడ్లుపెట్టనీయండి! సాగరం ఒడ్డున భయ్యా
సాగరం ఒడ్డున... ఇవి ఎవరూ పొదగని గుడ్లు... పడవలన్నీ పాత తెరచాపలే...!
సాగర్ శ్రీరామ కవచం
9885473934