వైద్య విద్యకు అన్ని వసతులు ఏర్పాటు: మంత్రి హరీశ్‌రావు

ABN , First Publish Date - 2022-09-26T04:55:24+05:30 IST

వైద్య విద్య కోసం సిద్దిపేటలో అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

వైద్య విద్యకు అన్ని వసతులు ఏర్పాటు: మంత్రి హరీశ్‌రావు
ఉపాధ్యాయులను సన్మానిస్తున్న హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 25: వైద్య విద్య కోసం సిద్దిపేటలో అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని మదీనా ఫంక్షన్‌హాల్‌లో అబ్దుల్‌ రబ్‌ ఆరీఫ్‌ మెడికల్‌ కౌన్సిలింగ్‌ ఎక్స్‌పర్ట్‌ ఆధ్వర్యంలో నీట్‌ విద్యార్థులకు జరిగిన ఎక్స్‌పర్ట్‌ గైడెన్స్‌ క్యాంపునకు హాజరై మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం బీఫార్మసీ కళాశాల ప్రారంభం కాబోతున్నదని, సోమవారం బీఫార్మసీ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయని, 70 ఏళ్లలో 800 సీట్లు ఉండేవనీ, కానీ తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లలో 2,840 సీట్లు వచ్చాయన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం పీజీ కోర్సుల్లో 48 సీట్లు వచ్చాయని తెలిపారు. అలాగే సిద్దిపేటలోని హనుమాన్‌నగర్‌లో, ప్రశాంత్‌నగర్‌లలో వార్డులోని మహిళలకు మంత్రి హరీశ్‌రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో చిన్నకోడూరు మండలంలోని పది గ్రామాలకు కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం రూ.కోటి 24 లక్షల చెక్కును అందజేశారు. 

పది, ఇంటర్‌ ఫలితాల్లో మీ కృషి అభినందనీయం

సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 25: పది, ఇంటర్‌ మొదటిస్థానంలో ఉపాధ్యాయులుగా చేసిన మీ కృషి అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని పబ్లిక్‌ సర్వెంట్స్‌ హోమ్‌లో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పదో తరగతిలో జిల్లా తొలిస్థానం పొందడం ఉపాధ్యాయులకు గర్వకారణమన్నారు. ఇంటర్మీడియట్‌లో సైతం మంచి ర్యాంకు సాధించడం పట్ల శుభాకాంక్షలు చెప్పారు. 

టీఆర్‌ఎస్‌ హయాంలోనే గ్రామాలాభివృద్ధి 

జగదేవ్‌పూర్‌, సెప్టెంబరు 25: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని ఇప్పగూడెం నుంచి అంగడికిష్టాపూర్‌ వరకు బీటీరోడ్డు రెన్యూవల్‌ రూ.కోటి 36 లక్షలు, ఇప్పగూడెం నుంచి పాములపర్తి వరకు, ఇప్పలగూడెం నుంచి పాతూరు వరకు డబుల్‌ బీటీరోడ్డుకు రూ.2 కోట్ల 93 లక్షలు, మర్కుక్‌ నుంచి నారాయణపూర్‌ వరకు రూ.2 కోట్ల 34 లక్షల బీటీరోడ్డు పనులు, మండలంలోని శివారు వెంకటాపూర్‌ గ్రామాభివృద్ధికి రూ.10. కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మర్కుక్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం, రూ.20 లక్షలతో నిర్మించిన ముదిరాజ్‌ భవనం, రూ.20 లక్షలతో గంగపుత్ర భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T04:55:24+05:30 IST