మనుషులందరూ ఆధ్యాత్మికులే

ABN , First Publish Date - 2022-09-16T05:30:00+05:30 IST

మన దైనందిక జీవనంలో వచ్చే సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలను చూపించటం అంత సులభమైన పని కాదు. అతి కొద్ది మందికి మాత్రమే- సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలను చూపించగలిగే ఓర్పు, నేర్పు...

మనుషులందరూ ఆధ్యాత్మికులే

మన దైనందిక జీవనంలో వచ్చే సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలను చూపించటం అంత సులభమైన పని కాదు. అతి కొద్ది మందికి మాత్రమే- సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలను చూపించగలిగే ఓర్పు, నేర్పు ఉంటాయు. అలాంటి వారిలో ఒకరు  ప్రముఖ ప్రవచనకర్త బి.కె. శివానీ. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్తల్లో ఒకరు. హిందీ, ఇంగ్లీష్‌ ఛానల్స్‌,  సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న శివానీ ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ..


విద్యార్థి దశ నుంచే పిల్లల జీవితంలో సత్ప్రవర్తన ఒక భాగం అవ్వాలి. అలాగని ఇది బాల్యదశ కు మాత్రమే పరిమితమైనది కాదు. ఆధ్యాత్మికత  పురోగమనానికి వయసు ఏమాత్రం అడ్డంకి కాదు. ఏ వయసు వారికైనా ఆధ్యాత్మిక పురోగమనం అవసరమే.


ఈ తరం యువత ప్రతిదీ తర్కబద్ధంగా ఆలోచించడంతో పాటు... 

తక్షణ ఫలితాలు కోరుకుంటోంది. వారిని ఆధ్యాత్మికత వైపు ఆకర్షించడం ఎలా?

తమ అసలైన వ్యక్తిత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకోవడమే ఆధ్యాత్మికత. ఒక్క క్షణమైనా తమ అసలైన వ్యక్తిత్వాన్ని ఉనికిలోకి తెచ్చుకోగలిగితే... వారు ఆధ్యాత్మిక పథంలో ఉన్నట్టే. అసూయలాంటి అసురీ గుణాలు ఒక్క క్షణం మనసులో కదలాడినా... ఆధ్యాత్మికంగా లేనట్టే. సరళంగా చెప్పాలంటే మంచి సంస్కారాలు, మానసిక పరిపక్వతలే ఆధ్యాత్మికత. నేటి జీవితంలో ప్రతి ఒక్కరికీ కావాల్సింది ఇదే. మీరు బాలలు అయినా, కీలక బాధ్యతలు నిర్వరిస్తున్న ఉద్యోగులు అయినా మంచి సంస్కారాలతో కర్తవ్య నిర్వహణ చేయడమే ఆధ్యాత్మికత. మంచి సంస్కారాలు అలవడినప్పుడే మనిషి మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆ స్థితిని అందుకున్నప్పుడు మాత్రమే మనం ఏ రంగంలో అయినా విజయం సాధించగలం. మనుషులందరూ ఆధ్యాత్మికులే.


కానీ అది వారి అనుభవంలోకి రావడంలేదు. అందుకే ఏదో ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తూ, దానికి తగ ్గ వేషధారణ చేసుకుంటూ... దాన్నే ఆధ్యాత్మికతగా భ్రమపడుతున్నారు. ప్రజల్లో మానసిక సమస్యలు బాగా పెరిగాయి. ఇప్పుడు దాని నివారణపైనే ప్రపంచం తక్షణం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మానసిక రుగ్మతలను ఎలా తగ్గించాలో, నివారించాలో చెప్పడానికి మనకు వైద్యులు, విజ్ఞానశాస్త్రం ఉన్నాయి. కానీ బాల్యం నుంచి దృఢమైన వ్యక్తిత్వం అలవడితే మానసిక సమస్యలు బాధించవు. గ్రామీణ ప్రాంతాల్లో  బాలలు శారీరకంగా, పట్టణ ప్రాంతాల బాలలు మానసికంగా రాటుదేలాల్సిన అవసరం ఉంది. తల్లితండ్రులు, విద్యావ్యవస్థ ఈ బాధ్యత తీసుకోవాలి. పిల్లలు స్కూల్లో సాధించిన విజయాలకు తగిన గుర్తింపు దక్కుతోంది కానీ వారి సత్ప్రవర్తన మాత్రం ఎక్కడా లెక్కలోకి రాదు. అందుకే ప్రతి విద్యార్థి దృష్టి ఏదోలా సక్సెస్‌ అవ్వడంపైనే ఉంది తప్ప మంచి గుణాలను పెంపొందించుకోవడం మీద లేదు. గుర్తింపు, ప్రశంసలకు సంస్కారం కూడా ఒక కొలమానం అయితే అప్పుడు ప్రతి విద్యార్థి దానిమీద దృష్టి సారిస్తాడు. ఆ గుణాలను పెంపొందించుకుంటాడు. ఈ దిశగా బాల్యంలోనే బీజాలు పడాలి. 


1980-2000 మధ్య పెరిగిన తరం ఆధ్యాత్మికంగా అగమ్యమైన స్థితిలో పడింది కదా...

80ల్లో మనం చాలా సాధారణ జీవితం గడిపాం. ఉదయం పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్లం. ఇక అంతే... మళ్లీ పని వ్యవహారమే ఉండేది కాదు. పెందలాడే తిని, త్వరగా నిద్రపోయే వాళ్లం. ప్రతిదీ సహజంగా, ఆరోగ్యకరమైన శైలిలో ఉండేది. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేకపోయింది. 90 దశకం చివరికల్లా కంప్యూటర్లు, టీవీలు, ఫోన్‌ ల రాకతో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనుషులకు వాటితో గడపడానికే సమయం సరిపోవడం లేదు. ఇక తమకోసం ఎక్కడ సమయం కేటాయిస్తారు? ఆలస్యంగా ఇంటికి రావడం, ఫోన్‌, ల్యాప్‌టా్‌పలు ముందు వేసుకొని మళ్లీ పనిలో మునిగిపోవడం... అర్థరాత్రి మెలకువ వస్తే, ఫోన్‌ చెక్‌ చేసుకుంటున్నారు. ‘ఆదివారం’ అనే కాన్సెప్టే లేదు. మనిషి మెదడుకు విశ్రాంతి లేకుండా పోయింది. 365 రోజులూ మనిషి పనితో కుస్తీ పడుతున్నాడు. ఫోన్‌, ల్యాప్‌టా్‌పతో గడపడం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తోంది. దీనివల్ల శరీరం, మనస్సు... రెండూ దెబ్బతింటున్నాయి. టెక్నాలజీ మన జీవితాలకు ఎలాంటి హాని చేయడం లేదు. కానీ దాన్ని మనం వాడుతున్న విధానం సరైనది కాదు. ఎలక్ర్టానిక్‌ వస్తువులు మన జీవితాలు మరింత సౌకర్యవంతం అవ్వడానికి తయారుచేశారు. వాటి వాడకం మన నియంత్రణలో ఉండాలి. ఇంటికి వచ్చాక గాడ్జెట్లను పక్కనపెట్టాలి.


ఈ సమస్యను అధిగమించడం ఎలా?

గత 20 ఏళ్లుగా మనం చేస్తోన్న పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే ఇదంతా జీవనశైలి మాత్రమే. మనం ఉదయం లేవగానే, నిద్రపోయే ముందు... మనం చేసే పనుల ప్రభావం మనపైన ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ‘ఏం చేస్తున్నాం’ అనేది  చాలా ముఖ్యం. మనం సాధారణమైన జీవనశైలిని అనుసరించాలి. పొద్దున్నే లేచి యోగా, ఆధ్యాత్మిక గ్రంఽథాల పఠనం లాంటి అభ్యాసాలు చేస్తే వురింత శక్తి లభిస్తుంది. మీరు రాత్రి ఏడు గంటలకు ఇంటికి వచ్చారనుకుందాం. ఎనిమిదిన్నర కల్లా పనులు పూర్తి చేసుకోవాలి. నిద్రకు రెండు గంటల ముందు వార్తలు, సీరియల్స్‌ చూడకూడదు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక్క నెగిటివ్‌ పదం కూడా మెదడులోకి పోకూడదు. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యం. గ్యాడ్జెట్లు చూస్తూ తినడం శరీరానికి, మనస్సుకు మంచిది కాదు. శ్రద్ధతో ఆహారం భుజించాలి. జీవితం మీద గొప్ప అవగాహన ఉన్న చివరితరం మనదే అనుకుంటాను. అందుకే మన పద్ధతులను మార్చుకోవాలి. ఎలా జీవించాలో పిల్లలు కూడా తెలుసుకునేలా మన ఆచరణలో చూపించాలి. 


ఆధ్యాత్మిక సాధనలో భిన్న పంథాలు, విభిన్న మార్గాలు, రకరకాల ప్రబోధాలతో కొత్త తరం కొంత గందరగోళానికి గురవుతోంది. దీన్ని ఎలా విశ్లేషిస్తారు?

ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం సంస్కారవంతుల లక్షణం. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు తప్పక పాటించాల్సిన నైతిక ధర్మం. ఇతరులతో మనకు పొసగకపోవచ్చు. ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలు మనకు నచ్చడం లేదంటే దానితో మనం వ్యక్తిగత ంగా విభేదిస్తున్నామని అర్థం. వారితో మనకు వైరుద్ధ్యాలు ఉన్నా, మనం ఏకీభవించలేకపోతున్నా అలాంటి సందర్భాల్లో మనం హుందాగా వ్యవహరించాలి. అసలు నా వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం ఏముంది? అది ఒకరిపైన నాకున్న దృష్టికోణం మాత్రమే. అదొక అభిప్రాయం మాత్రమే. నిజమో, కాదో కూడా తెలియని దాని గురించి మనం బయటకు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఒకవేళ మన అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చినా సుతిమెత్తగా చె ప్పాలి తప్ప పరుషంగా మాట్లాడ కూడదు. మన మాటతీరు అవతలి వ్యక్తిని కించపరిచేలా ఉండకూడదు.


‘నేను నిజం అనుకుంటున్నది ఇదీ’ అని ఎదుటి వ్యక్తికి తెలియజెబుతున్నామా? లేదా వాళ్లను తక్కువ చేసేందుకు విమర్శలు గుప్పిస్తున్నామా? అనే స్పష్టత మనకు ఉండాలి. మన అభిప్రాయానికి, విమర్శకు మధ్య ఓ సన్నని విభజన రేఖ ఉంది. దాన్ని మీరకూడదు. ప్రజలకు ఉపయోగం ఉందనిపిస్తేనే మనం ఏదైనా చెప్పాలి. అప్పుడు కూడా ఎలాంటి వక్రీకరణలు చేయకుండా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే అలాంటప్పుడే మన అహం బయటకు వస్తుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్న పూర్వక సంస్కారాలు కావాలి. మన అంతిమ లక్ష్యం అహంకారం లేని స్థితిని పొందడం. దాని కోసం జరుగుతున్న ప్రయాణం కొనసాగుతోంది. మన కర్మ మరెన్నో కర్మలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం మరింత బాధ్యతగా ఉండాలి. 


ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన  ఏమిటి?

ప్రతి రోజూ ఎంతోమందిని కలసి మాట్లాడుతుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుందో మీడియా మనకు చూపిస్తోంది. కానీ ప్రతి ఇంట్లో ఏం జరుగుతోందో, ప్రజల మనస్సులో ఏముందో మీడియాకు కూడా తెలీదు. ఎదుటి వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు వారి బాధను నాతో పంచుకొంటున్నప్పుడు... అలా వింటూ కూర్చోను. వాళ్ల బాధను అనుభూతి చెందుతాను. ఆ సమయంలో దివ్యమైన జ్ఞాపకాలతో... సరైన వైబ్రేషన్స్‌ను ఎదుటి వ్యక్తికి ప్రసారం చేయాలి. వాళ్లు మాట్లాడుతున్నప్పుడు మేము ధ్యాన స్థితిలో ఉండాలి. అప్పుడే వారు ‘ఎనర్జీ’ని స్వీకరించగలరు. మొదట్లో కొన్నాళ్లు వాళ్లు చెప్పేదంతా వింటుంటే నా ఎనర్జీ తగ్గిపోయేది. వారు చెప్పే విషయాలను చాలా ఎక్కువగా అనుభూతి చెందడమే కారణమని అర్థం చేసుకున్నాను. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వారి వైబ్రేషన్స్‌ను స్వీకరిస్తున్నాను. ఆ తరువాత వినడం కన్నా నా ఎనర్జీని ప్రసారం చేయడ ంపైనే దృష్టి పెట్టాను. ఒక్కసారి ఆ వ్యక్తితో మాట్లాడడం ముగిశాక... అది అంతటితో పూర్తవుతోంది. తర్వాత అది నాపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.


సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-09-16T05:30:00+05:30 IST