ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-12-23T16:51:28+05:30 IST

ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యార్థుల తరపున..

ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేయాలి

ఫలితాలపై చాలా అనుమానాలు ఉన్నాయి.. 

విద్యార్థులు మానసికంగా కుంగిపోయారు

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ 

ఇంటర్‌ బోర్డు ఎదుట నేడు దీక్ష


హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యార్థుల తరపున గురువారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు  ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట తాను దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల వెల్లడి తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో కనీస మార్కులు సాధించిన వారు కేవలం 3 శాతం మాత్రమే ఉండడం, ఫెయిలయిన వారిలో ఎక్కువ మందికి 5-10శాతం మార్కులూ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఫస్టియర్‌ ఫలితాల్లో కేవలం 49శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం అపోహలకు దారితీస్తోందని తెలిపారు. ఇలాంటి కారణాలతోనే 2019లో 23 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మొన్నటి ఫలితాలు చూసిన తర్వాత విద్యార్థులు మానసికంగా కుంగిపోయారని, కొందరు ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోందని తెలిపారు. 


ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, యూనివర్శిటీలు ఉన్న తెలంగాణలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్‌ అయిందని తీవ్రంగా విమర్శించారు. సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మరో సారి ఆలోచించి మంచి  నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘‘ఆందోళనలు చేస్తేనే నిర్ణయం తీసుకుంటామంటే ఎలా? విద్యాశాఖ మంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండె. కానీ ఆమె పట్టించుకోవడం లేదు. ఆన్‌లైన్‌ బోధన నేపథ్యంలో విద్యార్థులు సరిగ్గా చదవలేకపోతున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్‌ చేశారు. తర్వాత ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించి.. మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూశారు. దీంతో ‘ఫెయిల్‌’ అనే సమస్య ఉత్పన్నం కాలేదు. రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఇప్పటికైనా చక్కదిద్ది, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలి. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులందరినీ పాస్‌ మార్కులు కేటాయించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-12-23T16:51:28+05:30 IST