అన్ని భాషలూ పూజనీయం

ABN , First Publish Date - 2022-05-21T08:08:27+05:30 IST

‘‘దేశంలోని అన్ని భాషలు పూజనీయం. అన్ని భాషలను భారతీయ ఆత్మగా బీజేపీ పరిగణిస్తుంది.

అన్ని భాషలూ పూజనీయం

భాషా ప్రాతిపదికన వివాదాలు రేకెత్తిస్తున్నారు

పార్టీ ఆఫీసు బేరర్ల భేటీలో ప్రధాని మోదీ

జైపూర్‌, మే 20: ‘‘దేశంలోని అన్ని భాషలు పూజనీయం. అన్ని భాషలను భారతీయ ఆత్మగా బీజేపీ పరిగణిస్తుంది. భాషా ప్రాతిపదికన వివాదాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ ప్రజలను బీజేపీ నేతలు అప్రమత్తం చేయాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో జరిగిన బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశాన్ని ఉద్దేశించి మోదీ  వర్చువల్‌గా ప్రసంగించారు. దేశ సంస్కృతి, భాషా వైవిధ్యం జాతికి గర్వకారణమన్నారు. జాతీయ విద్యావిధానం ప్రణాళికలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అన్ని ప్రాంతీయ భాషల పట్ల తమ నిబద్ధత చాటుకున్నామని తెలిపారు. ఇటీవల భాషా ప్రాతిపదికన కొత్త వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. వీటిపై ఎప్పటికప్పుడు దేశ ప్రజలను అప్రమత్తం చేయాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను విస్మరించి, హిందీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పలు ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా దక్షిణాది నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా హిందీ జాతీయ భాష అని ఇటీవల బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.


ఎనిమిదేళ్లుగా సుపరిపాలన 

దేశ ప్రజలకు సుపరిపాలన అందించడానికి, సామాజిక న్యాయం చేయడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అంకితమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014 తర్వాత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం ఏర్పడిందన్నారు. ముఖ్యమైన అంశాలపై నుంచి దేశం దృష్టిని మళ్లించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వారి మాయలో పడొద్దని బీజేపీ శ్రేణులకు సూచించారు. దేశ ప్రయోజనాలపై దృష్టిసారించి ముందుకు సాగాలన్నారు. కొన్ని పార్టీలు వాటి స్వార్థ ప్రయోజనాల కోసం కులం, ప్రాంతం పేరుతో ప్రజలను విడదీస్తూ, ఉద్రిక్తతలు సృష్టించేందుకు చూస్తున్నాయని ఆరోపించారు. వాటి కుటిల ప్రయత్నాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ దేశాన్ని ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌’ దిశగా నడిపించాల్సిన ఆవశ్యకత బీజేపీకి ఉందన్నారు. ఈ ప్రయాణంలో మాటలు జారొద్దని బీజేపీ శ్రేణులకు సూచించారు. ‘‘పేదల సంక్షేమానికి, సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ‘ఆజాదీ కా అమృత్‌ ఉత్సవ్‌’గా కేంద్రం పాటిస్తోంది. దేశం వచ్చే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అలాగే బీజేపీ కూడా రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ నెలలో ఎన్డీయే ప్రభుత్వ పాలన ఎనిమిదేళ్లు పూర్తవుతుంది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. సన్నకారు రైతులు, కూలీలు, మధ్య తరగతి ప్రజల అంచనాలను నెరవేర్చాం. దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందుతోంది. సామాజిక భద్రత కల్పించాం. అమ్మలు, కుమార్తెలు, అక్కాచెల్లెళ్ల సాధికారతకు అంకితమయ్యాం. ప్రపంచం గొప్ప అంచనాలతో మన దేశాన్ని చూస్తోంది. అలాగే మన దేశంలో ప్రజలకు బీజేపీపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలతో పార్టీని చూస్తున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు మన బాధ్యతను పెంచాయి. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా బీజేపీ నేతలు కృషి చేయాలి’’ అని మోదీ అన్నారు.

Updated Date - 2022-05-21T08:08:27+05:30 IST