అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2022-05-25T07:35:34+05:30 IST

అనుమతులు, పర్యావరణ సమస్యలతో వారికి పనిలేదు. స్థానిక నాయకులు, అధికారుల అండదండలు ఉంటే చాలు ఏదైనా చేసేయచ్చు అనే ఉద్దేశ్యంలో ఉంటున్నారు కొంతమంది అక్రమార్కులు. పైగా తమను అడిగేవారే లేరని పచ్చని పంటలు పండే పొలాలను నిబంధనలకు విరుద్ధంగాచేపల చెరువులుగా మార్చేస్తున్నారు.

అంతా మా ఇష్టం!
జె.తిమ్మాపురంలో చేపల చెరువుల తవ్వకాలు

జె.తిమ్మాపురంలో ఇష్టారాజ్యంగా చేపల చెరువుల తవ్వకాలు

 భవిష్యత్తులో పంట పొలాలు కనుమరుగయ్యే ప్రమాదం

 అధికారుల మధ్య సమన్వయలోపం  

 జిల్లా కమిటీ అనుమతి రాకుండానే పనుల కొనసాగింపు 

పెద్దాపురం, మే 24: అనుమతులు, పర్యావరణ సమస్యలతో వారికి పనిలేదు. స్థానిక నాయకులు, అధికారుల అండదండలు ఉంటే చాలు ఏదైనా చేసేయచ్చు అనే ఉద్దేశ్యంలో ఉంటున్నారు కొంతమంది అక్రమార్కులు. పైగా తమను అడిగేవారే లేరని పచ్చని పంటలు పండే పొలాలను నిబంధనలకు విరుద్ధంగాచేపల చెరువులుగా మార్చేస్తున్నారు. పెద్దాపురం మండల పరిధిలోని జె.తిమ్మాపురం గ్రామంలో సుమారు 10 ఎకరాల పైబడి చేపల చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. పట్టించుకోవాల్సిన సంబంధిత శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో అక్రమార్కులు పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకోకుండానే తవ్వకాలను ప్రారంభించేశారు. కేవలం మండల కమిటీ అనుమతి తీసుకుని పనులు మొదలుపెట్టారు. జిల్లా స్థాయి కమిటీ అనుమతి పొంది, ఆ తర్వాత చేపల చెరువుల తవ్వకాలకు కలెక్టర్‌ నుంచి  అనుమతి పొందాల్సి ఉంది. ఆ తర్వాతే పనులు ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.

పంట భూముల్లో విస్తరిస్తున్న సాగు...

తవ్వకాలు సాగించేందుకు మత్స్య, రెవెన్యూ, వ్యవసాయ, భూగర్భ జలవనరులు, విద్యుత్‌, పంచాయతీ, ఇరిగేషన్‌ శాఖలకు చెందిన అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అది ఎక్కడా అమలు జరగట్లేదు. పూర్తిస్థాయిలో అనుమతి తీసుకోకుండానే అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వకాలను సాగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదు.. చేపల పెంపంకం కోసం మూడు పంటలు పండే భూములను చేపల చెరువులు, రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో పరిసర ప్రాంత భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. నిజానికి పంట భూములు పండేందుకు అనుకూలంగా లేనప్పుడే అనుమతులు మంజూరు చేయాలి. కానీ అటువంటి నిబంధనలు అక్కడ పట్టించుకునే నాథుడే లేడు. పంటలు పండే భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తున్నా అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైగా తవ్వకందారులకు వత్తాసు పలుకుతున్నారు. చెరువు తవ్వకాలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ భూముల్లో ఏరకం చెరువు తవ్వకాలకు ఉపయోగిస్తున్నారో విచారించకుండానే అధికారులు అనుమతి మంజూరు చేసేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. చేపల చెరువులకు అనుమతి తీసుకుని రొయ్యలు సాగుచేసే అవకాశం కూడా ఉంది. దీంతో సిరులు పండే భూములు నిర్వీర్యమవడమే కాకుండా చౌడు నేలలుగా మారే ప్రమాదం ఉంది. వీటికి తోడు వాతావరణ కాలుష్యం సైతం పెరిగిపోతోంది.

అధికారులు ఏం చేస్తున్నట్టు...!

చేపల చెరువులను అనుమతుల లేకుండా తవ్వకాలు సాగిస్తుంటే సంబంధిత శాఖలకు చెందిన అధికారులు ఏంచేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. చెరువుల తవ్వకాలు సాగించేందుకు తవ్వకందారులు అనుమతుల కోసం మొక్కుబడిగా దరఖాస్తు చేసి అనుమతి మంజూరు కాకుండానే చెరువుల తవ్వకాలు చేపడుతుంటే సంబంధిత శాఖల అధికారులు మౌనం వహించడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించే వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని అక్రమ చెరువులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జె.తిమ్మాపురంలో చేపల చెరువుల తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు మత్స్య శాఖ అధికారుల దృష్టిికి తీసుకువెళ్లినా అన్న అనుమతులు ఉన్నాయని సెలవియ్యడంతో పాటు, ప్రజల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్తున్నారు. మత్స్య శాఖలోచాలా కాలంగా పనిచేస్తున్న ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చేపల చెరువుల వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు

చేపల చెరువుల తవ్వకాలపై మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. చేపల చెరువులు తవ్వుతున్న విషయమే మాకు తెలియదు. కేవలం మండల స్థాయి కమిటీ అనుమతి మాత్రమే వచ్చింది. జిల్లా స్థాయి కమిటీ నిర్వహించి అనుమతి తీసుకోవాల్సి ఉంది. జిల్లా స్థాయి కమిటీ అనుమతి వచ్చిన తర్వాత మత్రమే పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తే చర్యలు తీసుకుంటాం.

కె.ప్రకాశరావు, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి, పెద్దాపురం


Updated Date - 2022-05-25T07:35:34+05:30 IST