ltrScrptTheme3

ముందున్నదంతా కరెంటు కోతల కాలమే!

Oct 20 2021 @ 02:32AM

నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ సజావుగా సాగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలలో విద్యుత్‌రంగం కీలకమైనదని గుర్తించిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు. విభజన సమయంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే విద్యుత్‌రంగంలో పురోగతి సాధించడం ఆవశ్యకం అనే లక్ష్యంతో ఆయన రెండవ తరం విద్యుత్ సంస్కరణలను ప్రారంభించారు. నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఆ సంస్కరణలకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని చీకట్లోకి నెడుతోంది.


2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం మానేసి, టీడీపీ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, వాటి అమలు బాధ్యత తమ ప్రభుత్వానికి లేదని విచిత్ర వాదనను జగన్ తెరపైకి తెచ్చారు. విద్యుత్ పీపీఏలలో అవినీతి జరిగిందన్నారు. థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.4.20కి లభిస్తుంటే రూ.4.84లకు ఒప్పందం చేసుకోవడం ఏమిటని అసెంబ్లీ సాక్షిగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా, రివర్స్ టెండరింగ్ పేరుతో యూనిట్ రూ.2.58కు ఇవ్వాలన్న ఆంక్ష ఫలితంగా ఆయా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నుంచి వైదొలగడానికి రాష్ట్రానికి అనుమతి ఇవ్వాలని 25 జూలై 2019న జగన్ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. దీనికి సమాధానంగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్.కె. సింగ్ తిరిగి లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పాతికేళ్లకు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి లాభమే కానీ నష్టం లేదని, ఒప్పందం ప్రకారం రూ.4.84కే పాతికేళ్లపాటు విద్యుత్ లభిస్తుందని, కానీ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి ప్రస్తుతం యూనిట్ రూ.4.20కి లభిస్తున్నా ప్రతి పదేళ్లకు రెట్టింపు చెల్లించాలని ఆయన తెలిపారు. పీపీఏలను ఉల్లంఘిస్తే అంతర్జాతీయంగా మన దేశ విశ్వసనీయత దెబ్బతింటుందని హితవు పలికారు.


విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇవ్వాల్సిన రాయితీలు, బకాయిలను కూడా నిలిపివేసిన ప్రభుత్వ ధోరణి వల్ల పునరుత్పాదక విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తిని సగానికి తగ్గించేశాయి. అదే సమయంలో బయట చౌకగా విద్యుత్ లభిస్తోందని ముందు చూపు లేకుండా థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించేసారు. ఇప్పుడు బొగ్గు లభ్యత లేదని యూనిట్ రూ.20 పెట్టి కొనాల్సి వస్తోందని వాపోతే ప్రయోజనం ఏమిటి? వాస్తవానికి సింగరేణి, కోల్ ఇండియా, మహానది కోల్‌ఫీల్డ్స్ వారికి రాష్ట్రం గతంలో ఉన్న బకాయిలు చెల్లించకపోవడం వల్లనే వారు బొగ్గు సరఫరా చేయడం లేదు తప్ప బొగ్గు కొరత లేదని స్పష్టం అయ్యింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 24 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఎప్పుడూ ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుని విద్యుత్ ఉత్పాదన సజావుగా జరిగేటట్లు చూసేవారు. కానీ ప్రస్తుతం ఉన్న నిల్వలు కేవలం 2.4 లక్షల టన్నులు మాత్రమే. ఒక ప్రణాళిక లేకుండా కేవలం చంద్రబాబును దోషిగా నిలబెట్టాలనే లక్ష్యంతో విజ్ఞత మరచి థర్మల్ విద్యుత్‌ను చూపి పీపీఏల మీద దుష్ప్రచారం చేశారు. తరువాత బొగ్గు కొరత చూపి థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని చంపేశారు. 2019 లో విద్యుత్ మిగులు రాష్ట్రం ఇప్పుడు విద్యుత్ కోతల ముంగిట నిలచింది. రాష్ట్రంలో రోజుకు దాదాపు 190 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ అవసరమైతే ఉత్పత్తి 145 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉన్నది. ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో అధిక ధర చెల్లించి రూ.930కోట్ల విలువైన విద్యుత్‌ కొనుగోళ్లు చేసారంటేనే పరిస్థితి తీవ్రత అర్థం అవుతుంది. అధికారంలోకి వస్తే ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచనన్న ఎన్నికల హామీని తుంగలో తొక్కి ఇప్పటికి ఆరుసార్లు చార్జీలు పెంచి రూ.12311 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.24491 కోట్ల ఋణభారాన్ని ప్రజలపై మోపారు. జగన్ బంధువుల విద్యుత్ తయారీ సంస్థల లబ్ధి కోసమే కృత్రిమ కొరత సృష్టించారని, ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలులో క్విడ్ ప్రోకో ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. 

శివరామ ప్రసాద్ లింగమనేని

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.