కొవిడ్‌ మృతులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-22T06:18:05+05:30 IST

కొవిడ్‌ కారణంగా చనిపోయిన ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల పరిహారం అందించడంతోపాటు, వ్యవసాయ పంటలను రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కోనుగోలుచేయాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

కొవిడ్‌ మృతులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆనంద్‌బాబు, శ్రావణ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ తదితరులు

కలెక్టర్‌కు అఖిల పక్షాల నాయకుల వినతి

గుంటూరు(తూర్పు), జూన్‌ 21: కొవిడ్‌ కారణంగా చనిపోయిన ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల పరిహారం అందించడంతోపాటు, వ్యవసాయ పంటలను రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కోనుగోలుచేయాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో  టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) ఆధ్వర్యంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ కరోనా ప్రతి కుటుంబంలో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కొవిడ్‌ మరణాల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని విమర్శించారు. తక్షణమే వాస్తవ సంఖ్యలను ప్రకటించి కొవిడ్‌తో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్‌చేశారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేదకుటుంబానికి తక్షణ సాయం కింద రూ.10 వేలు ప్రకటించాలన్నారు. టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల మాదిరి కొవిడ్‌ బాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ విఫలమైందని విమర్శించారు. కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌, మరణాలు ఇలా అన్నింటిపైనా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొవిడ్‌ తీవ్రత కొనసాగుతున్నంతకాలం ప్రతి పేదకుటుంబానికి నెలకు రూ.7వేల500 అందించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ అకాల వర్షాలతో కుదేలైౖన వ్యవసాయరంగం కరోనాకారణంగా మరింత దెబ్బతిందన్నారు. ఈ క్రమంలో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలుచేసి పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నసీర్‌ అహ్మద్‌, కోవెలమూడి రవీంద్ర, మానుకొండ శివప్రసాదు, కనపర్తి శ్రీనివాసరావు, చిట్టాబత్తుని చిట్టిబాబు, అన్నాబత్తుని జయలక్ష్మి, పిల్లి మాణిక్యలరావు, వేములపల్లి శ్రీరాంప్రసాదు, ఈరంటి వర ప్రసాదుబాబు, రావిపాటి సాయికృష్ణ, సీపీఐ నాయకులు కోటా మాల్యాద్రి, కాంగ్రెస్‌ నాయకలు కొరివి వినయ్‌కుమార్‌, అడవి అంజనేయులు. సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-22T06:18:05+05:30 IST