ధరలన్నీ పెరిగాయి, మెస్‌ చార్జీలు తప్ప!

ABN , First Publish Date - 2021-12-02T05:49:30+05:30 IST

‘‘ సీఎం గారూ.. కందిపప్పు ధర డబుల్‌ అయింది. నూనెలు భగ్గుమంటున్నాయి. కూరగాయలు కొనేట్టు లేవు. పెట్రోలు బాదుడు సంగతి సరేసరి.. వంట దినుసులన్నీ ఇంత పెరిగిపోతే సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే పేద బిడ్డల తిండికి కేటాయించే సొమ్ములు మాత్రం పైసా పెంచకపోతే ఎట్లయ్యా? అర్థాకలితో పిల్లలు అలమటిస్తే అరిష్టమయ్యా.. మంచి మనసు జేసుకుని ఆలోచించు జగనయ్యా!’’ అంటూ వేడుకుంటున్నారు జిల్లాలోని 212 సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల తల్లిదండ్రులు.

ధరలన్నీ పెరిగాయి, మెస్‌ చార్జీలు తప్ప!

కథనం - చిత్తూరు: ‘‘ సీఎం గారూ.. కందిపప్పు ధర డబుల్‌ అయింది. నూనెలు భగ్గుమంటున్నాయి. కూరగాయలు కొనేట్టు లేవు. పెట్రోలు బాదుడు సంగతి సరేసరి.. వంట దినుసులన్నీ ఇంత పెరిగిపోతే సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే పేద బిడ్డల తిండికి కేటాయించే సొమ్ములు మాత్రం పైసా పెంచకపోతే ఎట్లయ్యా? అర్థాకలితో పిల్లలు అలమటిస్తే అరిష్టమయ్యా.. మంచి మనసు జేసుకుని ఆలోచించు జగనయ్యా!’’ అంటూ వేడుకుంటున్నారు జిల్లాలోని 212 సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల తల్లిదండ్రులు. 


సాంఘిక సంక్షేమశాఖ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాల్లో 12వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా మూతపడ్డ వసతి గృహాలు, నాలుగు నెలల కిందట తెరచుకున్నాయి. అయితే తిండి మాత్రం ప్రభుత్వ మెనూ ప్రకారం పెట్టడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులకి అంతకన్నా పెట్టే అవకాశమూ లేదు. నాలుగేళ్ల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వం పెంచిన మెస్‌ ఛార్జీలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో మూడవ తరగతి వరకు నెలకు(ఒక్కొక్కరికి) రూ.వెయ్యి, 5 నుంచి 10 వరకు రూ.1250, కళాశాల విద్యార్థులకు రూ.1400 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వారంలో మూడు రోజులు చికెన్‌ పెట్టాల్సి ఉండగా ఒక్క రోజు మాత్రమే పెడుతున్నారు. వారానికి ఆరు రోజులు కోడిగుడ్లు వడ్డించాల్సి ఉండగా రెండు మూడు రోజులకే పరిమితం చేశారు. ఇదేమి అన్యాయం అనడిగితే, ‘నెల నెలా బిల్లులు సక్రమంగా రాకపోవడంతో చికెన్‌, ఇతర సరుకుల దుకాణాల్లో అప్పులు ఇవ్వడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. దీంతో పేద విద్యార్థులు అర్థాకలి, పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు.


పెంచ ని కాస్మెటిక్‌ చార్జీలు


ఇక. విద్యార్థులకు హెయిర్‌ కటింగ్‌, సబ్బులు, బ్రష్‌, పేస్ట్‌, తలకు నూనె వంటి వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రతి నెలా కాస్మెటిక్‌ ఛార్జీలను ఇస్తుంది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ. 125, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నెలకు రూ.160 ఇస్తుంది. నాలుగేళ్లుగా ఇవీ పెంచలేదు.


ఈ మొత్తంతో ఏం కొని ఎంత వండి పెట్టాలి?


రకం ప్రభుత్వం       ప్రస్తుతం

      చెల్లిస్తున్న ధర(రూ.ల్లో) మార్కెట్‌ ధర(రూ.ల్లో)

-------------------------------------------------------

కందిపప్పు రూ.52 రూ.105

పామాయిల్‌ రూ.69 రూ.130

చింతపండు రూ.99 రూ.100

ఎండుమిర్చి రూ.120 రూ.170

రాగిమాల్ట్‌ రూ.30 రూ.40

బెల్లం రూ.40 రూ.50

చెక్కెర రూ.30 రూ.40

ఉప్పు రూ.10 రూ.15

ఉప్మారవ్వ రూ.27 రూ.45

పెసరపప్పు రూ.65 రూ.98

వేరుశెనగ రూ.70 రూ.110

చికెన్‌ రూ.120 రూ.200

కోడిగుడ్లు రూ.4         రూ.6

పాలు రూ.40 రూ.60

వంటగ్యాస్‌ రూ.650 రూ.950


Updated Date - 2021-12-02T05:49:30+05:30 IST