1865 నుంచి 1999 వరకు రిజిస్ట్రేషన్‌ రికార్డులన్నీ డిజిటల్‌

ABN , First Publish Date - 2022-09-17T06:45:50+05:30 IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పాత రికార్డులన్నీ డిజిటల్‌ కానున్నాయి. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా వారం రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది.

1865 నుంచి 1999 వరకు రిజిస్ట్రేషన్‌ రికార్డులన్నీ డిజిటల్‌
డిజిటలైజేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ గుప్తా

ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సాగుతున్న ప్రక్రియ 

19కి పూర్తి చేయాలని ఆదేశం 

అయినా, మరో రెండు నెలలు పట్టే అవకాశం


చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 16: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పాత రికార్డులన్నీ డిజిటల్‌ కానున్నాయి. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా వారం రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. దీనికోసం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు 8 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కంప్యూటర్లు, స్కానర్లను అధికారులు సమకూర్చారు. వీటికి ప్రైవేటు ఏజెన్సీ ద్వారా రికార్డుల డిజిటలైజేషన్‌ పనులు జరుగుతున్నాయి. ఈనెల 19 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. అయితే జిల్లాలో 1865 నుంచి 1999వ సంవత్సరం వరకు రికార్డులను స్కాన్‌ చేసి డిజిటలైజేషన్‌ చేయాల్సిరావడంతో మరో రెండు నెలల తర్వాతే పూర్తి కావచ్చని అధికారులు అంటున్నారు. 

ప్రస్తుతం 1999వ సంవత్సరం నుంచి జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వివరాలు మాత్రమే ప్రజలకు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. అంతకు ముందు జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలన్నీ వాల్యూమ్‌ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉన్నాయి. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో చాలావరకు పాడైపోతున్నాయి. భూములకు సంబంధించిన విలువైన సమాచారం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. అప్పట్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలు కావాలంటే స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి రికార్డులను బూజు దులిపి.. అందులోని సమాచారాన్ని చేతిరాత రూపంలో ఇవ్వాల్సిన స్థితి నెలకొంది. దీనికి రోజుల తరబడి సమయం పడుతుంది. ఈ ఇబ్బందులు లేకుండా భూరికార్డులతో పాటు అన్ని రిజిస్ట్రేషన్ల వివరాలు కంప్యూటరీకరణ చేస్తే భవిష్యత్‌లో ఎలాంటి సమాచారమైనా తక్కువ సమయంలోనే పొందేందుకు అవకాశం ఏర్పడుతోంది. 

బ్రిటీష్‌ కాలం నాటి రికార్డులు కూడా

1865లో నార్త్‌ ఆర్కాడు జిల్లాగా ఉన్నప్పటి నుంచి చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పనిచేస్తోంది. అప్పట్లో సబ్‌రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు తిరుపతి, పుత్తూరులో ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యం కోసం 1995 మే 1 నుంచి చిత్తూరు, శ్రీ బాలాజి రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఏర్పడి 25 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. బ్రిటీష్‌ పాలకుల భూమికి సంబంధించిన సర్వేలు నిర్వహించి రికార్డులు తయారుచేశారు. వాటితో పాటు రిజిస్ట్రేషన్ల రికార్డులు సైతం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉన్నాయి. వీటిని ప్రస్తుతం కంప్యూటరీకరిస్తున్నారు. వీటితో పాటు ఏడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ కంప్యూటరీకరణ జరుగుతోంది. 1999కి ముందుకు సంబంధించిన వాల్యూమ్‌లు చిత్తూరులో 3335, పుంగనూరులో 2859, పలమనేరులో 1937, కుప్పంలో 1172, నగరిలో 670, కార్వేటినగరంలో 645, బంగారుపాళ్యంలో 333 ఉన్నాయి. ఒక్కో వాల్యూమ్‌లో 500 పేజీలు ఉంటాయి. ఈ మేర జిల్లాలో 10,951 వాల్యూమ్‌లలో సుమారు 55 లక్షల పేజీలు ఉన్నాయి. వీటి కంప్యూటరీకరణకు నిమిషానికి 10-15 పేజీలు మాత్రమే స్కానింగ్‌ చేయగలుగుతున్నారు. చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 800 వాల్యూమ్‌లు మాత్రమే స్కానింగ్‌ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఈ మేర డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయడానికి కనీసం రెండుమూడు నెలలైనా పడుతుందని అంటున్నారు. 

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

రికార్డు రూముల్లో ఉన్న పాతరికార్డు పత్రాలను కదిపిన సమయంలో పేపర్లు సున్నితంగా ఉండి చిరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే అత్యంత జాగ్రత్తగా పత్రాలను సిబ్బంది స్కానింగ్‌ చేస్తున్నారు. దీంతో జాప్యం జరుగుతోంది. ఈనెల 19 నాటికి డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం చెప్పింది. 

- కె.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్‌, చిత్తూరు

Updated Date - 2022-09-17T06:45:50+05:30 IST