అన్ని దారులూ పల్లెలకే

ABN , First Publish Date - 2021-01-13T06:36:40+05:30 IST

సంక్రాంతి ప్రయాణాలతో విజయవాడ నగరం కిటకిటలాడిపోయింది.

అన్ని దారులూ పల్లెలకే
పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

రికార్డు స్థాయిలో సంక్రాంతి ప్రయాణాలు 

ఉత్తరాంధ్ర జిల్లాలకు 150 బస్సులు 

రాయలసీమకు 30 ప్రత్యేక బస్సులు 

జిల్లాలోనూ అంతర్గత ప్రయాణాలు 

హైదరాబాద్‌ నుంచి క్యాబ్‌లు, ట్యాక్సీల్లో రాక 

ఇతర రాష్ట్రాల నుంచి విమానాలలో రాక 

నూరు శాతం ఆక్యుపెన్సీతో నడిచిన విమానాలు 


సంక్రాంతి ప్రయాణాలతో విజయవాడ నగరం కిటకిటలాడిపోయింది. పీఎన్‌బీఎస్‌, రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్టులతో పాటు స్థానికంగా ఆటోలు, కార్లు, క్యాబ్‌లు, ట్యాక్సీలు రద్దీగా మారాయి. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు పండగ రాకపోకలు ఎక్కువగా జరగ్గా... నాలుగు రోజుల కంటే భిన్నంగా హైదరాబాద్‌ నుంచి కూడా మంగళవారం రాకపోకలు పెరిగాయి. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌ పరిధిలో రికార్డు స్థాయిలో స్పెషల్స్‌ నడిపారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

సంక్రాంతి ప్రయాణాలు మొదలవడంతో ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను పెంచింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర సెక్టార్‌కు సాయంత్రానికి 100 స్పెషల్‌ బస్సులు బయలుదేరాయి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు అప్పటికప్పుడు మరో 50 బస్సులను సిద్ధం చేసి రిజర్వేషన్‌లో ఉంచారు. గంటలోపే ఆ బస్సులకు కూడా రిజర్వేషన్‌ అయిపోవడం విశేషం. అర్ధరాత్రి వరకు ప్రయాణాలు కొనసాగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా మరో 50 బస్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు.  రాయలసీమ సెక్టార్‌కు కూడా బస్సులు అధిక సంఖ్యలోనే నడిచాయి. తిరుపతి వెళ్లే ప్రయాణికులు అధికంగా ఉండటంతో ఆ రూట్‌లో అదనపు స్పెషల్‌ బస్సులను నడిపారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. అటు నుంచి 50 ప్రత్యేక బస్సుల్లో సొంతూళ్లకు తరలి వచ్చారు. 


విమానాలకూ ఫుల్‌ డిమాండ్‌  

విమానాలకూ పండగ తాకిడి పెరిగింది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ఢిల్లీల నుంచి పండగ ప్రయాణాలు పెద్ద ఎత్తున సాగాయి. ఆయా రూట్లలో నడిచే విమానాలన్నీ దాదాపు నూరుశాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చే వారు బస్సులు, రైళ్ల కంటే కూడా విమానాల పట్లనే మొగ్గు చూపారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని విమానాల్లో రక్షణ ఎక్కువగా ఉంటుందన్న భావనతో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరగడం గమనార్హం. కడప నుంచి కూడా మంగళవారం అధిక సంఖ్యలో విమాన ప్రయాణాలు సాగాయి.


తెలంగాణ నుంచి క్యాబ్స్‌, ట్యాక్సీల్లో.. 

 తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్లు, టాక్సీల్లో ప్రయాణికులు తరలివచ్చారు. విజయవాడ మీదుగా రాజమండ్రి, అమలాపురం, కాకినాడ ప్రాంతాలకు తరలివెళ్లే కార్లు కూడా ఎక్కువ సంఖ్యలో జాతీయ రహదారుల మీద కనిపించాయి. 


షాపింగ్‌ సందడి 

పండగ షాపింగ్‌ చేసేవారితో విజయవాడ నగరం సందడిగా మారింది. చుట్టపక్కల గ్రామాల నుంచి మంగళవారం నగరానికి ప్రయాణాలు పెరిగాయి. వస్ర్తాలు, బంగారం, మిఠాయి దుకాణాలు కిటకిటలాటాయి. బీసెంట్‌ రోడ్డు ఇసుక వేస్తే రాలనంత రద్దీగా మారింది. దీంతో ఎంజీ రోడ్డు, కారల్‌మార్క్స్‌ రోడ్డుల్లో సైతం వాహనాలు బారులుతీరాయి. 


అక్కడి టోల్‌గేట్లు వెలవెల... ఇక్కడ కళ కళ 

జిల్లా సరిహద్దుల్లోని టోల్‌ ప్లాజాల దగ్గర ఈ సంక్రాంతికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రతి సంక్రాంతికీ కీసర, చిల్లకల్లు టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు భారీ సంఖ్యలో బారులుతీరేవి. ఈసారి హైదరాబాద్‌ నుంచి రాకపోకలు ఆశించిన దాని కంటే తక్కువుగా ఉండడంతో ఈ టోల్‌ ప్లాజాల దగ్గర రద్దీ అంతగా లేదు. ఈ టోల్‌ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ వ్యవస్థ బాగా పనిచేయడమే ఇందుకు కారణం. సంక్రాంతి ప్రయాణం అంతా ఉత్తరాంధ్ర వైపే ఉండటంతో.. పొట్టిపాడు, కలపర్రు టోల్‌ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ ఉన్నా, విపరీతమైన రద్దీ నెలకొంది. 

Updated Date - 2021-01-13T06:36:40+05:30 IST