దారులన్నీ పెద్దగట్టువైపు

ABN , First Publish Date - 2021-03-02T06:53:12+05:30 IST

జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు భక్తజనం పోటెత్తింది. రెండో రోజు సోమవారం సుమారు ఐదు లక్షల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అంచనా.

దారులన్నీ పెద్దగట్టువైపు

ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా

పెద్దసంఖ్యలో జీవాలు బలి

నేడు చంద్రపట్నం

చివ్వెంల, మార్చి 1: జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు భక్తజనం పోటెత్తింది. రెండో రోజు సోమవారం సుమారు ఐదు లక్షల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అంచనా. ఆదివారం అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభం కాగా, సోమవారం మధ్యాహ్నానికి ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిశాయి. ఆదివారం అర్ధరాత్రి పెద్దగట్టుకు దేవరపెట్టె చేరుకున్న తర్వాత సోమవారం ఉదయం సమయంలో సౌడమ్మ, యలమంచమ్మ, ఆకు మంచమ్మ దేవతలకు బోనాలు సమర్పించారు. సాయం త్రం మద్దెలపోలు పోశారు. యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణ అలంకరణ చేశారు. అనంతరం స్వామివారి కొలుపు చెప్పారు. రాత్రి నుంచే వాహనాలు బారులుతీరాయి. జాతరకు వచ్చిన భక్తులు పెద్దసంఖ్యలో గొర్రె పోతులు, మేకపోతులను సౌడమ్మ, యలమంచమ్మ దేవతలకు బలి ఇచ్చారు. మహిళలు తలపై గంపలతో గుడి చుట్టూ నృత్యాలు చేస్తూ ప్రదక్షణలు చేశారు. గజ్జెల లా గులు ధరించిన యాదవులు క టారీ విన్యాసాలు చేస్తూ భేరీలు మోగిస్తూ ఓ లింగా...ఓ లింగా అంటూ నామస్మరణ చేస్తూ పరవశంతో ఊగిపోయారు. అనేకమంది భక్తులు కొండపైన తలనీలాలు సమర్పించారు. దు రాజ్‌పల్లి చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు, గుడారాలు వేసుకొని వంటలు వండుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులతో దురాజ్‌పల్లి, కాశీంపేట, కలెక్టరేట్‌ వరకు జనసందడి కనిపించింది. జాతరలో దుకాణాల వద్ద వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేశారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జాతరలో మూడో రోజు మంగళవారం చంద్రపట్నం వేస్తారు. ఉదయం యాచకులతో కలిసి రాజులు, పూజారులు గుడి ప్రాంగణంలో చంద్రపట్నం వేసి భైరవుడికి పోలుపోస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఆచారం ప్రకారం కేసారం నుంచి వచ్చిన బండ్లు తిరిగి వెళ్తాయి.

స్వామి వారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు

లింగమంతులస్వామిని మంత్రులు గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్‌, గాదరి కిషోర్‌, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య దర్శించుకుని, ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. వీరిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. కాంగ్రెస్‌ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒకేసారి స్వామి వారి దర్శనానికి రాగా, ఈ సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వారిని నిలువరించడం పోలీసులకు సాధ్యపడలేదు. దీంతో ఒత్తిడికి గురైన మంత్రులు పోలీస్‌, దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తుల పుణ్యస్నానాలు.. తాగునీటికి కటకట

గుట్టపైన ఏర్పాటుచేసిన షవర్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఇక్కడ ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, జాతరకు వచ్చిన భక్తులు తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. భక్తులేగాక పోలీసు, ఇతర శాఖల అధికారులు సైతం అల్లాడారు. ఇక జాతరకు వచ్చిన భక్తులు బోనాలు సమర్పించిన అనంతరం తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా, కొత్తగా నిర్మించిన కోనేటి మధ్యలో శివుడి విగ్రహం ఆకర్షణీయంగా నిలిచింది. 

ఏరులై పారిన మద్యం

జాతరలో మద్యం ఏరులై పారింది. జాతర సమీపంలో దురాజ్‌పల్లి, రాంకోటితండా, మున్యానాయక్‌తండా, ఖాశీంపేట, వల్లభాపురం గ్రామాలల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దురాజ్‌పల్లిలోని కిరాణా, కూల్‌డ్రింక్స్‌ దుకాణాలు, పలు హోటళ్లలో సైతం మద్యం విక్రయాలు  సాగాయి. అంతేకాక మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారు.

కానరాని జెట్టింగ్‌ యంత్రం

పెద్దగట్టు ఆలయం వద్ద గొర్రె, మేకపోతులను బలి ఇచ్చిన సందర్భంలో రక్తంతో పరిసరాలు అపరిశుభ్రం మారకుండా ఉండేందుకు రూ.45లక్షలతో  జెట్టింగ్‌ యంత్రం కొనుగోలు చేశారు. అయితే ఈ యంత్రం ఎక్కడా కనిపించలేదు.

జాతరలో ఎగ్జిబిషన్‌ లొల్లి

కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా రెండెకరాలు వినియోగించారని, అందుకు రూ.12.25లక్షలు చెల్లించాలని మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి నోటీసు ఇచ్చారు. దీంతో కొత్త వివాదం రాజుకుంది.



Updated Date - 2021-03-02T06:53:12+05:30 IST