ఆ పేజీలన్నీ ప్రజాకోర్టులో వినిపించిన వాదనలే!

Jul 26 2021 @ 00:57AM

‘‘శతాబ్దాల కిందట ఒక రావి గౌతముణ్ణి ప్రభావితుణ్ణి చేసింది. ఈ శతాబ్దంలో ఒక రావి తెలుగువారిని ప్రభావితం చేసి ప్రబుద్ధుల్ని చేస్తుంది,’’ అని శ్రీశ్రీ రావిశాస్త్రికి ప్రశంసా పత్రాన్నిచ్చారు. కథ, నవల, నాటకం ప్రక్రియ ఏదైనా రావిశాస్త్రి కలం దాన్ని ఒక సజీవ శిల్పంగా మనోజ్ఞంగా మలచి, పాటకుణ్ణి మంత్రముగ్ధుణ్ణి గావించింది. ‘‘రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయము చెయ్యకూడదని నేను భావిస్తాను,’’ అన్నారు రావిశాస్త్రిగా ప్రసిద్ధి గాంచిన రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఈ సాహిత్య దృక్పథం ఆయన రచనలన్నింటా ప్రతిఫలిస్తుంది. ‘20వ శతాబ్దపు కథకులు’ అనే రేడియో కార్యక్రమంలో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి రావిశాస్త్రి గురించి చెప్తూ ఆయన కథల లక్ష్యం సామాజిక న్యాయవాదం అన్నారు. అది పీడితుల, తాడితుల, పేదల తరఫున న్యాయవాదం అని ఆయన రచనలు నిరూపిస్తాయి. 1922 జూలై 30న జన్మించి కథకుల కథకుడు రావిశాస్త్రిగా ప్రసిద్ధి గాంచిన రాచకొండ విశ్వనాథశాస్త్రి శత జయంతి సంవత్సర ప్రారంభం ఘనంగా జరుపుకునే తరుణమిది.


రావిశాస్త్రిగారి కథలు, నవలలు చదువుతుంటే స్ఫురించేదేమిటంటే- సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలి. జీవిత చిత్రణ వాస్తవికంగా ఉండాలి. ఈ రెండు సూత్రాల సమన్వయం రావిశాస్త్రి రచనా సర్వస్వం. సామాజిక సంవేదనలను సునిశితం చేసిన సహదృయ సాహితీమూర్తి రావిశాస్త్రి. సమాజంలోని చీకటి కోణాలపై వెలుగు కిరణాలను ప్రసరించిన రావిశాస్త్రి రచనలలో సమాజం నడిచే తీరుపై తనలోని అసహనాన్ని ప్రకటించే తీరు కనిపిస్తుంది. సమాజంలో తాడితులు, పీడితులు, నిరుపేదలు, నిర్భాగ్యులు, స్త్రీలు, అన్ని విధాల వెనుకబడ్డవారు సముద్ధరించబడాలనే భావం ఆయన రచనలలో లోతుగా పాదుకొంది. విశ్వంగా ఇంట్లోనూ, ఆర్వీయస్‌గా కోర్టులోనూ, చాత్రిబాబుగా క్లయింట్స్‌తోనూ, రావిశాస్త్రిగా పాఠకలోకంలోనూ పిలువబడ్డారు. కోర్టులో పెట్టుకున్న అర్జీ, చేసిన వాదన జడ్జిని కదిలించకపోతే, కోర్టు లొసుగులు బాగా ఎరుగున్న రావిశాస్త్రి ప్రజల కోర్టులో తన వాదన వినిపించారు. అదే ఆయన సాహిత్యం. ఆయన రచనలలో నాటకీయ శిల్పం చోటు చేసుకోవడానికి గల కారణం కూడా అదే. 


రావిశాస్త్రికి తాను ఎవరివైపు నిలబడాలో, రచనల ద్వారా తాను ఆశించే ప్రయోజనం ఏమిటో స్పష్టంగా తెలుసు. సంఘంలో జరుగుతున్న అన్యాయాలకు బలవుతున్నది ‘‘అలగా జన’’మేనని, డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవారు నిజంగా తప్పుచేసి తప్పించుకోగలగుతన్నారని అర్థం చేసుకున్నారు. నాటి ‘వినోదిని’ పత్రికలో 1938లో ‘దేవుడే చేసాడు’ పేరుతో అచ్చయిన మొదటి కథతో ప్రారంభమైన ఆయన రచనా వ్యాసంగం 1993లో చివరి నవల ‘ఇల్లు’ వరకు సాగింది. 


‘‘ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు గాక దొరకదు. తనకు అన్యాయం జరిగితే ఎదుర్కొందికి పేదవాడికి అవకాశం లేదు కాక లేదు. ఈ పరిస్థితి మారాలని నాకుంది,’’ అని తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తరువాత రావిశాస్త్రి రచనలలో చాలా మార్పు వచ్చింది. మన తోనే ఉంటూ, మనం రోజూ చూస్తున్న వారి జీవితాలలో ఎంత విషాదం ఉందో, పేదరికం వారి మధ్య మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన సారా కథలు చూపించాయి.  


తెలుగులో మొదటిసారి ఆత్మన్యూనతా మనస్తత్వాన్ని చిత్రించిన నవల అనదగ్గ ‘అల్పజీవి’ నుంచి  చివరి నవల ‘ఇల్లు’ వరకు రావిశాస్త్రి తన ప్రతి నవలను ఒక విలక్షణమైన, అపురూపమైన కళాఖండంగా రూపొందించారు. జీవితం ఒక నిరంతర పరిణామశీల ప్రవాహం. దానిని పరిశీలిస్తూ వచ్చిన రావిశాస్త్రికి జీవితమైనా, మనుషుల మధ్య వైరుధ్యాలతోనూ ఘర్షణలతోనూ సమన్వయంతోనూ సాగే జీవనయానమైనా ఎక్కడో ఒక చోట ఆగేవి కావనీ, ముగిసేవి కావనీ తెలుసును. అందువలనే ‘రత్తాలు-రాంబాబు’, ‘రాజు-మహిషి’ వంటి నవలలు వాటిలో లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం ఇంకా వెతకవలసిన అవసరం ఉన్న దశలో అసంపూర్ణ రచనలుగా మిగిలాయి. వాస్తవ జీవితం గురించి, మనుషుల మధ్య సంబధాలను నడిపించే శక్తుల గురించి అవగాహన కలిగించే వరకు నవలలో కథాంశాన్ని వికసింపజేయడమే రావిశాస్త్రి రచనా శిల్ప రహస్యం.


నాయకుడు, ప్రతినాయకుడు ఒకడుగా కలగలసి పతనమైపోయిన ప్రధానపాత్ర ‘మూడు కథల బంగారం’ నవలలోని మొదటి కథలో అమాయకుడైన బంగారు బాబుగా, రెండో కథలో నేరస్థుడు బంగారిగాడుగా, మూడో కథలో పెద్దమనిషిగా చలామణి అవుతున్న బంగారయ్యగా దర్శనమిస్తాడు. ఒక నికృష్ట పరిస్థితిలో ఒక మనిషి బంగారం (డబ్బు) సంపాదించనిదే ఈ లోకంలో మనగలగడం కష్టమని అనుభవపూర్వకంగా తెలుసుకొని, దాన్ని సంపాదించడానికి తప్పుడు తోవలు పట్టి, ఎంత దిగజారి అధర్మపరుడు అవుతాడో నాటకీయ పరిణామాలతో చూపుతుంది ఈ నవల. ‘‘ఇల్లు వుండటానికి గూడు కొందరికైతే, ఇల్లు కొందరికి సంపాదించవలసిన ఆస్తి,’’ అని చెప్తూ, దాన్ని సంపాదించే క్రమంలో చోటు చేసుకునే కుట్రలు, కుతంత్రాలను సూచించారు రావిశాస్త్రి తన చివరి నవల ‘ఇల్లు’లో. ఆస్తి సంపాదన అనే లక్ష్యానికి స్వార్థ చింతన తోడైన సందర్భంలో అది సాధించడానికి ఎటువంటి అన్యాయమైనా, ఘోరమైనా చేయడానికి సిద్ధమైన దుర్మార్గపు మనస్తత్వం గల వారి వ్యక్తిత్వాన్ని  ఎత్తి చూపుతుంది ఈ నవల. ఈ నవల తాళింపులో కొంత రొమాన్స్‌, కొంత విప్లవం కూడా జోడించారు. 


‘రత్తాలు-రాంబాబు,’ నవలలోని సింహాచలం, జోగులు; ‘మూడు కథల బంగారం’ నవలలోని బంగారిగాడు, ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’ నవలలోని ప్రభుదాసు, పోలీసు వ్యవస్థకు ప్రతిరూపంలా గంగరాజు హెడ్డు, సానికొంపల సారథి నరసమ్మ... ఇవన్నీ మరపురాని పాత్రలు. దొంగనోట్ల వ్యాపారంలో మోసపూరిత జీవితాలు చిత్రించిన ‘మూడు కథల బంగారం’ నవల, నరక కూపం లాంటి వేశ్యావృత్తిని చిత్రించిన ‘రత్తాలు-రాంబాబు’ నవల సమకాలీన సామాజిక వాస్తవికతకు నిలువుటద్దం పట్టాయి. సామాజిక వాస్తవం ఎప్పుడూ సమాజంలోని అట్టడుగు వర్గం (లంపెన్‌ ప్రొలిటేరియేట్‌)తోనే ముడిపడి ఉంటుందనే ఎరుక రావిశాస్త్రి రచనలలోని అంతస్సూత్రం. 

(జూలై 30వ తేదీతో రావిశాస్త్రి శతజయంతి సంవత్సరం ప్రారంభం)

మంగు శివరామ ప్రసాద్‌

91107 88060

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.