సత్కార్యాలు కొనసాగిద్దాం

ABN , First Publish Date - 2021-05-21T05:30:00+05:30 IST

రంజాన్‌ మాసం వీడ్కోలు తీసుకొని వారం గడిచిపోయింది. సత్కార్యాలు చేసి, రంజాన్‌ మాసానికి వీడ్కోలు చెప్పిన వారు ఎంతో అదృష్టవంతులు. ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొనే అవకాశం...

సత్కార్యాలు కొనసాగిద్దాం

రంజాన్‌ మాసం వీడ్కోలు తీసుకొని వారం గడిచిపోయింది. సత్కార్యాలు చేసి, రంజాన్‌ మాసానికి వీడ్కోలు చెప్పిన వారు ఎంతో అదృష్టవంతులు. ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొనే అవకాశం ఇచ్చిన దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. దైవాదేశాలను తృణీకరించినవారు తాము చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పుకొని, ఇకపై అలా చెయ్యబోమని అల్లాహ్‌కు విన్నవించుకోవాలి. మనుషుల్లో దైవభీతి, దైవభక్తి, సదాచారం, మానవీయ విలువలను జనింపజేయాలనే ఉద్దేశంతో ఉపవాసాలను విధిగా అల్లాహ్‌ నిర్ణయించాడు. నిర్ణీత సమయానికి మేలుకోవడం, తెల్లవారకముందే ఆహారం తీసుకోవడం, సూర్యాస్తమయం వరకూ నీళ్ళయినా ముట్టుకోకుండా ఉండడం, రోజూ అయిదు పూటల నమాజ్‌ చేయడం, ఆ తరువాత ఉపవాసాన్ని విరమించడం... ఇవన్నీ క్రమశిక్షణతో, బాధ్యతతో కూడిన జీవనమార్గానికి ఒరవడి దిద్దుతాయి. 


ఒకసారి మహాప్రవక్త మహమ్మద్‌ ఒక మసీదులో మెంబరు మెట్లు ఎక్కుతూ మూడు సార్లు ‘ఆమీన్‌’ అని అన్నారు. దీనికి కారణం ఏమిటని శిష్యులు అడిగారు. దైవదూత జిబ్రాయిల్‌ తన వద్దకు వచ్చాడనీ, ముగ్గురు వ్యక్తులను శపించాడనీ, దానికి సమాధానంగా తాను ‘ఆమీన్‌’ అన్నాననీ చెప్పారు. ఆ ముగ్గురిలో ఒకడు... తన జీవితంలో రంజాన్‌ మాసంలో ఉపవాసాలు తదితర ఆరాధనలు చేసి కూడా పాపాలకు మన్నింపు పొందలేకపోయినవాడు. 

అల్లాహ్‌ను పాప క్షమాపణ (తౌబా) కోరడం నిరంతరం సాగే ప్రక్రియ. దీనివల్ల అల్లాహ్‌తో సంబంధ పటిష్ఠమవుతుంది. మనసుకు శాంతి లభిస్తుంది. ప్రళయకాలం నాటికి ఎవరి కర్మల చిట్టాలో ఎక్కువ క్షమాపణ ఉంటుందో వారు అదృష్టవంతులని మహా ప్రవక్త తెలిపారు. రంజాన్‌ మాసంలోనే కాకుండా, ఇతర మాసాలలో కూడా అల్లాహ్‌ను ఎక్కువ క్షమాపణ కోరుకోవాలని హితవు పలిపారు. రంజాన్‌ మాసంలో మాత్రమే ‘కలిమా’ చదివితే సరిపోదు. నిత్యం పారాయణ చేయాలి. మంచివారితో ఉంటూ, మంచి పనులు చేయాలి. రంజాన్‌ మాసంలో క్రమశిక్షణ, దయ, సానుభూతి, సహాయం, సహనం... ఇవన్నీ కలగలిసిన వాతవరణాన్ని చూస్తాం. మిగిలిన నెలలలో కూడా ఈ సత్ప్రవర్తననూ, సత్కార్యాలనూ కొనసాగించాలి. 

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST