Allahabad HC: FIRపై అలహాబాద్ కోర్టు కీలక వ్యాఖ్యలు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆ పదాలు కనిపించేసరికి..

ABN , First Publish Date - 2022-06-17T02:21:28+05:30 IST

అలహాబాద్ హైకోర్టు FIRపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో వాడే భాష పద్ధతిగా ఉండాలని, ఫిర్యాదు చేసిన మహిళ తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించేందుకు..

Allahabad HC: FIRపై అలహాబాద్ కోర్టు కీలక వ్యాఖ్యలు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆ పదాలు కనిపించేసరికి..

అలహాబాద్ హైకోర్టు FIRపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో వాడే భాష పద్ధతిగా ఉండాలని, ఫిర్యాదు చేసిన మహిళ తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించేందుకు అలాంటి జుగుప్సాకరమైన మాటలను, సంకేత చిత్రాలను గానీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. క్రిమినల్ కేసుల్లో ఎఫ్ఐఆర్/ఫిర్యాదు ఎంతో కీలకమైనదని, సరైన వ్యక్తీకరణ బాధితురాలు ఆరోపించిన, ఎదుర్కొన్న దురాగతాలను ప్రభావవంతంగా తెలియజేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎఫ్‌ఐఆర్ అంటే అశ్లీల సాహిత్య వర్ణనకు వేదిక కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలు కోర్టు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందంటే.. 2018 అక్టోబర్‌లో శివంగి భన్సాల్ అనే మహిళ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా పిల్ఖుహా పోలీస్ స్టేషన్‌లో తన భర్తతో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.



ఆమె తన ఫిర్యాదులో మామ, మరిదిపై సంచలన ఆరోపణలు చేసింది. తన మామ ముఖేష్ భన్సాల్ తనను లైంగికంగా అనుభవించాలని చూశాడని, తన మరిది కూడా బలవంతం చేయాలని చూశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన భర్తపై కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త బలవంతంగా తనతో అసహజ శృంగారానికి పాల్పడేవాడని శివంగి భన్సాల్ ఫిర్యాదులో పేర్కొంది. గర్భం తీయించుకోవాలని తనను అత్త, భర్త సోదరి బలవంతం చేశారని.. ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులంతా కలిసి శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారని, అదనపు కట్నం కోసం పదేపదే వేధించారని ఫిర్యాదులో ఆమె పేర్కొంది.



ఈ ఆరోపణలపై కోర్టు స్పందిస్తూ.. ‘‘మన సంప్రదాయ భారతీయ కుటుంబంలో, ఓ అవివాహిత కుమారునితో కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంలో, ఓ మామ తన కోడలిని లైంగికంగా కోరిక తీర్చమని అడిగినట్లు ఆరోపణలు రావడం జీర్ణించుకోలేనిది, ఇది అసంభవం, అదేవిధంగా ఓ బావమరిది తన వదినను లైంగిక వాంఛ తీర్చమని అడిగినట్లు వచ్చిన ఆరోపణలు కూడా జీర్ణించుకోలేనివి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కూలింగ్ పీరియడ్’ (ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రెండు నెలల కాలం) సమయంలో కుటుంబ సంక్షేమ కమిటీకి విషయం చేరవేయాలని, ఈ దాంపత్య కలహాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారని కోర్టు సూచించింది. కూలింగ్ పీరియడ్‌లో అరెస్ట్ చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. 498A సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం వల్ల వివాహ వ్యవస్థ యొక్క విలువలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణలో భాగంగా ఎఫ్‌ఐఆర్‌ గురించి, ఎఫ్‌ఐఆర్‌లో సదరు మహిళ వాడిన భాష గురించి కోర్టు చేసిన వ్యాఖ్యలపై కొందరు ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-17T02:21:28+05:30 IST