వివాదాల సుడిలో..

ABN , First Publish Date - 2021-11-11T06:19:21+05:30 IST

జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయం వివాదాల సుడిలో కూరుకుపోతోంది.

వివాదాల సుడిలో..

సివిల్‌ సప్లయిస్‌ డీఎం కార్యాలయం చుట్టూ అవినీతి ఆరోపణలు

కార్యాలయంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ 

క్షేత్రస్థాయిలో అక్రమాలపై లోపించిన నిఘా 

జిల్లావ్యాప్తంగా ఎంఎల్‌ఎస్‌ గోడౌన్లలో అంతులేని అవినీతి 

అవినీతిపరుల విషయంలో మెతక వైఖరి ఎందుకో!


జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయం వివాదాల సుడిలో కూరుకుపోతోంది. మొన్న ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్లలో పేదల బియ్యం మాయం కావటం, ఆ వెనువెంటనే మిల్లర్లు డీఎం సంతకాన్ని ఫోర్జరీ చేయడం ఇందుకు నిదర్శనం. ఈ వ్యవహారంలో సివిల్‌ సప్లయిస్‌ అధికారుల బలహీనతలను మిల్లర్లు క్యాష్‌ చేసుకుంటున్నారా? మిల్లర్లతో అధికారులు లాలూచీ పడ్డారా? అనే నిజం నిలకడ మీద తెలియాల్సిందే. మరోపక్క జిల్లావ్యాప్తంగా పేదల బియ్యం అక్రమ నిల్వలు వెలుగు చూస్తుండడం, కొందరు ఉన్నతాధికారుల మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండడం జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయ ప్రతిష్ఠను మసక బార్చుతోంది.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయం విజయవాడ లెనిన్‌ సెంటర్‌ సమీపంలో ఉంటుంది. కార్యాలయంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. సంస్థ మేనేజర్‌ ఆ కెమెరాల ద్వారా సిబ్బంది కదలికలను గమనిస్తుంటారు. కార్యాలయంలో నిఘాపై ఇంత శ్రద్ధపెట్టిన అధికారిణి క్షేత్రస్థాయిలో ఈ అవసరాన్ని ఎందుకు మరిచారు? ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌, గోడౌన్లకు, అక్కడి నుంచి రేషన్‌ దుకాణాలకు బియ్యం తరలించడంలో ఇంత నిఘా ఎందుకు ఉండడం లేదనే సందేహం తలెత్తుతుంది. మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్లలో జోరుగా అక్రమాలు జరుగుతున్నాయి. వేలకొద్దీ బియ్యం బస్తాలు మాయం అవుతున్నా, వాటిపై నిఘా లేదు. అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడిన తరువాత కూడా ఆ దిశగా ఆలోచించకపోగా, వెలుగు చూసిన అక్రమాలను రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయటంతో డీఎం కార్యాలయ పనితీరుపై ఆరోపణలు వస్తున్నాయి. అంతర్గత తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూస్తే వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పత్రికల్లో వార్తలు వచ్చేవరకు విచారణ దిశగా కదలకపోవడాన్ని ఏమనాలి? కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అక్రమాలు వెలుగు చూసినా మౌనంగా ఉన్న ఉన్నతాధికారులు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో సాక్ష్యాలను బయటపెట్టిన వారం తర్వాత కానీ ఈ అక్రమాన్ని అంగీకరించలేదు. ఆఫీసులో సీసీ కెమెరాలు బిగించి పర్యవేక్షించే ఉన్నతాధికారిణి.. ఇలాంటి వ్యవహారాల పట్ల ఉదాసీనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. 


వరుస ఆరోపణలు 

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ స్కామ్‌ను విచారణ పేరుతో సాగదీస్తూ వస్తున్నారు. పైగా ఈ వ్యవహారంలో కేసును మరుగున పరిచేందుకు, తక్కువ శిక్ష విధించేందుకు ఓ అధికారిణి రూ.40 లక్షల బేరాన్ని పెట్టిన విషయం వెలుగు చూసింది. లంచం డిమాండ్‌ చేయకుంటే ఎప్పుడో కేసును ఫైల్‌ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకునేవారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసేవారు కాదు. ఈ వ్యవహారం సమసిపోక ముందే.. నకిలీ బ్యాంకు గ్యారంటీల కుంభకోణం వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో కూడా ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు నెలకొంటున్నాయి. నకిలీ బ్యాంకు గ్యారంటీలు రాలేదని చెబుతున్నారు. నకిలీ బ్యాంకు గ్యారంటీ ఇవ్వని వారు.. ఫోర్జరీ చేస్తారా? బ్యాంకు గ్యారంటీ రిలీజ్‌ ఆర్డర్‌ కోసం డీఎం సంతకాన్ని ఫోర్జరీ చేసేంత అవసరం ఉంటుందా? ఒరిజినల్‌ బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చినపుడు, నకిలీ రిలీజ్‌ ఆర్డర్‌ ఎలా ఇస్తారు?.. ఈ అన్ని వ్యవహారాల్లోనూ జిల్లా సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది.


విజిలెన్స్‌ పాత్రపై సందేహాలు

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూసినా, ఆ ఇన్‌చార్జ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే డీఎం కార్యాలయ అధికారులతో క్షేత్రస్థాయి సిబ్బంది మిలాఖత్‌ అయ్యారన్న ఆరోపణలు నిజమేననిపిస్తోంది. కైకలూరు గోడౌన్‌లో భారీ కుంభకోణం వెలుగు చూస్తే, దానిని తక్కువగా చూపించేందుకు ప్రయత్నించడం, అందుకోసం విజిలెన్స్‌ను మళ్లీ రంగంలోకి దించి, మాయమైన సరకును తక్కువగా చూపించే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ ఆ ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. విజిలెన్స్‌ ప్రతి నెలా మూడు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను తనిఖీ చేయాలి. చేస్తుందో లేదో ఉన్నతాధికారులకే తెలియాలి. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఇంతకు ముందు ఎప్పుడు తనిఖీలు చేశారో తెలిస్తే, అసలు విషయం బయటకు వస్తుంది. చాలా గోడౌన్లలో నిర్ణీత సమయంలో విజిలెన్స్‌ తనిఖీలు జరపటం లేదు. ఈ కారణంగానే అవినీతి వ్యవహారాల్లో విజిలెన్స్‌ పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-11-11T06:19:21+05:30 IST