Fake birth certificate: కుమారుడి కేసులో అజాంఖాన్‌కు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-07-25T22:46:46+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ నేత అజాంఖాన్‌కు ఆయన కుమారుడి నకిలీ జనన ధ్రువీకరణ పత్రం కేసులో..

Fake birth certificate: కుమారుడి కేసులో అజాంఖాన్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ నేత అజాంఖాన్‌ (Azam Khan)కు ఆయన కుమారుడి నకిలీ జనన ధ్రువీకరణ పత్రం (Fake birth certificate) కేసులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ బర్త్ సర్టిఫికెట్ విషయంలో దాఖలైన చార్జిషీటును కొట్టివేసేందుకు అలహాబాద్‌ హైకోర్టు నిరాకరించడాన్ని సుప్రీంకోర్టులో అజాంఖాన్ సవాలు చేశారు. కాగా, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, విక్రమ్ నాథ్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌ సోమవారంనాడు స్పష్టం చేసింది.


రెండు వేర్వేరు చోట్ల నుంచి తప్పుడు మార్గాల ద్వారా రెండు నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు పొందారనే క్రిమినల్ కేసును అజాంఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా అజాంఖాన్‌ ఎదుర్కొంటున్నారు. బీజేపీ నేత ఆకాష్ సక్సేనా 2019 జనవరి 3న గంజ్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అబ్దుల్లా అజాంఖాన్ లక్నో నుంచి ఒకటి, రాంపూర్ నుంచి మరొకటి నకిలీ బర్త్‌సర్టిఫికెట్ పొందేందుకు ఆజాంఖాన్, ఆయన భార్య సహకరించారని ఆకాష్ సక్సేనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-25T22:46:46+05:30 IST