పార్టీని నిలబెట్టుకునేందుకే పొత్తు

ABN , First Publish Date - 2022-10-03T09:31:56+05:30 IST

రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకునేందుకే మును గోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

పార్టీని నిలబెట్టుకునేందుకే పొత్తు

  • బీజేపీని అడ్డుకునేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు..
  • జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి సాగుతాం
  • ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకునేందుకే మును గోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్‌ పట్ల తమకు వ్యతిరేకత లేకపోయినా.. బీజేపీని సమర్థంగా అడ్డుకునే శక్తులకు సహకారం అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌తోనే కలిసి సాగుతామన్నారు. కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌ వైపు వచ్చే అవకా శం ఉందన్నారు. దేశానికి ఇప్పటికీ కమ్యూనిస్టుల అవసరం ఉందని, ప్రజలను చైతన్య వంతులను చేసే దిశగా తమ పనిని తాము చేసుకుంటూ పోతామని తెలిపారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో కూనంనేని తన అభిప్రాయాలను పంచుకున్నారు..


కమ్యూనిస్టు పార్టీలు బలపడవు.. ఓట్లు రావు ఎందుకు?

కూనంనేని: దేశానికి ఇప్పటికీ కమ్యూనిస్టులు అవసరం. ప్రజాస్వామ్యం ప్రస్తుతం.. కార్పొరేట్‌ స్వామ్యం, ఎన్నికల స్వామ్యం ధనస్వామ్యం అయిపోయింది. ఇప్పుడు గాంధీ దిగివచ్చినా గెలిచే పరిస్థితి లేదు. ఎన్నికలే ప్రామాణికం కాదన్నది మా ఉద్దేశం. మళ్లీ అందరూ కమ్యూనిస్టుల వైపు ఆలోచన చేసే పరిస్థితి వస్తోంది. కమ్యూనిస్టు భావజాలం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. సింగరేణి, ఆర్టీసీ, బ్యాంకుల ఉద్యోగ సంఘాలు సహా అన్ని కార్మిక సంఘాలు మావే. వారు ప్రభుత్వం మెడలు వంచగలుగుతున్నారు. 


మీకు పరిపాలనకు అర్హత లేదని ఆ సంఘాల వారు భావిస్తున్నారా?

వారిని రాజకీయంగా చైతన్యవంతులను చేయడంలో మేం విఫలమయ్యాం. బాగా బలంగా ఉన్నచోట మాత్రం వారంతా మా వెంటే ఉంటున్నారు. దేశంలో దామాషా ప్రాతినిధ్య విధానం లేకపోవడం కూడా మాకు చట్టసభల్లో సీట్లు లేకపోవడానికి కారణమవుతోంది. ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని మేం చూపించలేని చోట్ల వారు కేజ్రీవాల్‌ లాంటి వారిని ఎంచుకుంటున్నారు. 


సీపీఐ, సీపీఎం ఒకరినొకరు చంపేసుకున్నారు. పొత్తులో ఓట్ల బదిలీ సరిగా జరగకుండా వెన్నుపోట్లు పొడుచుకున్నారు కదా!

నిజమే. ప్రత్యేకించి 1999 ఎన్నికల్లో అదే జరిగింది. అప్పటినుంచి కోలుకోలేకపోతున్నాం. అయి నా.. జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తర్వాత రెండో స్థానంలో మేమే నిలిచాం. ఇప్పటికీ రెండు పార్టీలకూ లక్ష చొప్పున ఓట్లు ఉన్నాయి. 


ఎనిమిదేళ్లు మిమ్మల్ని పట్టించుకోని కేసీఆర్‌.. ఇప్పుడు పిలవగానే వెళ్లారెందుకు..? కాంగ్రెస్‌తో ఎందుకు కలవలేదు? 

మా అవసరం మాకుంది. దేశ అవసరం దేశానికుంది. బీజేపీని ఎదగనిస్తే కబళిస్తుంది. మునుగోడులో మేం కేసీఆర్‌ మాయలో పడలేదు. మా పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కలిసి పని చేద్దామంటున్నారు కాబట్టి నమ్ముతున్నాం. మాకు మరో మార్గంలేదు. బీజేపీని వ్యతిరేకించే శక్తులను, వ్యక్తులను తగ్గించే పని చేయొద్దని నిర్ణయించుకున్నాం. మునుగోడు ఎన్నిక తర్వాత అంశాల వారీగా మాత్ర మే కేసీఆర్‌తో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ సారథ్యంలోని కూటమితోనే ఉంటాం. కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌ వైపే వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌ మునిగిపోతోందన్నది మా అంచనా. జాతీయ స్థాయిలో ఒక రకంగా, రాష్ట్రాల్లో మరో రకంగా మా విధానం ఉంటుంది. రాష్ట్రాల్లో పార్టీని నిలబెట్టుకోవడమన్నదే దీని వెనుక ఉద్దేశం. కాంగ్రెస్‌ పట్ల మాకు వ్యతిరేకత లేదు.  


బీజేపీ రెండు సీట్ల నుంచి ఎదగలేదా? కాలానికి అనుగుణంగా వారు మారారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఎందుకు మారలేదు?

మేం కూడా ఎదుగుతాం. ఎవరి నమ్మకాలనూ మేం వ్యతిరేకించం. 


మీరు ఎంతగా సెక్యులరిస్టులమని చెప్పుకొన్నా.. ఒక్క ముస్లిమైనా మీకు ఓటేస్తాడా? దేవుడిని నమ్మనివాళ్లను ఓన్‌ చేసుకుంటారా? 

మాకు ఇప్పుడు ఆ సమస్యే లేదు. జనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతున్నాం. దేవుడిని వ్యతిరేకించాలని చెప్పడం లేదు. మూఢ నమ్మకాలను మాత్రమే వద్దంటున్నాం. 


కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పార్టీ. కొందరు వ్యక్తులు భ్రష్టు పట్టించారు. మన్మోహన్‌ సింగ్‌ చెడు పనులు చేయలేదు కదా?

మన్మోహన్‌ గొప్ప ప్రధాని. ఆయనకు, మోదీకి ఏ విషయంలోనూ పోలిక లేదు. ఏదేమైనా అతిపెద్ద ఏకైక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్సే. 


ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కన్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదరిగా మిమ్మల్ని నియమిస్తే బాగుంటుందేమో?

ఆంధ్రలో ప్రస్తుతం పోరాట స్వభావం ఉన్నవారు అవసరమే. అక్కడ ఇప్పుడంతా రౌడీయిజం నడుస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాలి. విజయవాడ లాంటి చోట్ల రౌడీయిజాన్ని అణచివేసిన చరిత్ర కమ్యూనిస్టులది. ఏపీలో, అసెంబ్లీలో నాయకుల భాషను, చంద్రబాబులాంటివారిని అంటున్న మాటలు వింటుంటే బాధ కలుగుతుంది. టీడీపీ వారు ఎందుకు ఊరుకుంటున్నారన్నది అర్థం కావడం లేదు. 


టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. మీరు చేసే పనుల వల్ల బీజేపీ ఎదుగుతుంది కదా?

మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలిస్తే మాత్రం అది కచ్చితంగా కమ్యూనిస్టుల వల్లే అవుతుంది.

పొత్తు కుదిరినప్పుడు కేసీఆర్‌ మీ పార్టీకి ఫండ్‌ ఇచ్చారట నిజమేనా?

అదేం లేదు. ఇంత ఉంటే అంత చెబుతారు. 


సుదీర్ఘ కాలం తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కమ్యూనిస్టులకు అలవాటైనట్లుంది. పార్టీ ఎందుకు చీలిపోయుంది..?

భావజాల వైరుధ్యాలు కొంత, నాయకుల పట్ల అభిమానంతో కొంత చీలికకు కారణమయ్యాయి. రెండూ కలవాలంటే ప్రజల్లో, కార్యకర్తల్లో మార్పు రావాలి. త్వరలోనే కలిసిపోతాయన్న నమ్మకం ఉంది. కానీ, ఎవరు కలవాలని కోరుకుంటే.. వారు తగ్గినట్లేనన్న అభిప్రాయం వస్తోంది. 


తెలంగాణలో బలంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి కదా?

1983లో కలిసి పోటీ చేసి ఎక్కువ స్థానాలు గెలిచాం. తర్వాత పొత్తుల కారణంగా రైతాంగం టీడీపీ వైపు మొగ్గుతూ వచ్చింది. అయితే పొత్తుల వల్ల చాలాసార్లు ఎక్కువ సీట్లు గెలిచాం. అందులోనూ టీడీపీతో పొత్తుంటే గెలిచాం. 

Updated Date - 2022-10-03T09:31:56+05:30 IST