50 కోట్లతో అల్లూరి సర్క్యూట్‌

ABN , First Publish Date - 2022-08-16T10:38:39+05:30 IST

: ‘‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మబలిదానాలు చేశారు.

50 కోట్లతో అల్లూరి సర్క్యూట్‌

  • స్వాతంత్ర్యోద్యమంలో  తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
  • ప్రముఖ దేశభక్తుల ఆలోచనల నుంచి 
  • ఢిల్లీలో తెలుగు సంఘం ఆవిర్భావం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


న్యూఢిల్లీ, ఆగస్టు 15(ఆంధ్ర‌జ్యోతి): ‘‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మబలిదానాలు చేశారు. ఈ పోరాటంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం. ఈనెల 22న అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తున్నాం’’ అని కేంద్ర సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఆంధ్ర అసోసియేషన్‌కు గొప్ప చరిత్ర ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా, డాక్టర్‌ అనంతశయనం అయ్యంగార్‌, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ వరాహగిరి వెంకట గిరి, భోగరాజు పట్టాభిరామయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు వంటి ప్రముఖ దేశభక్తుల ఆలోచనల నుంచి 1935లో ఆంధ్ర అసోసియేషన్‌ పుట్టింది. తెలుగువారిగా మనందరికీ ఇది గర్వకారణం. దేశ రాజధానిలో తెలుగువారికంటూ ప్రత్యేకమైన సంఘాన్ని ఏర్పాటు చేసి తెలుగు భాషను, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంతోపాటు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆంధ్ర అసోసియేషన్‌ బాధ్యులు అభినందనీయులు. 


దేశ స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్ర చాలా ప్రత్యేకమైంది. అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎన్జీ రంగా, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, తుర్రేబాజ్‌ ఖాన్‌, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌, బూర్గుల రామకృష్ణా రావు, వావిలాల గోపాల కృష్ణయ్య, అభినవ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సర్దార్‌ గౌతు లచ్చన్నతోపాటుగా ఎంతోమంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారు. నాటి వీరుల త్యాగాల స్ఫూర్తితో నేటి తరం ముందుకెళ్లాల్సిన సమయమిది. పింగళి వెంకయ్యపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నజీర్‌ ఖాన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ మట్టా పశుపతి, సెక్రటరీ సిలార్‌ ఖాన్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T10:38:39+05:30 IST