అల్లూరి ఆరాధ్యుడు

ABN , First Publish Date - 2022-07-05T08:20:26+05:30 IST

అల్లూరి ఆరాధ్యుడు

అల్లూరి ఆరాధ్యుడు

ఆయన త్యాగం తెలుగుజాతికి స్ఫూర్తిదాయకం

అందుకే మన్యం జిల్లాకు అల్లూరి పేరు: సీఎం జగన్‌

ఎందరో త్యాగాలు చేసినా కొందరికే గుర్తింపు

వారి స్మరణకే అమృత మహోత్సవాలు: కిషన్‌రెడ్డి

అల్లూరి విగ్రహావిష్కరణ ఓ అద్భుతం: చిరంజీవి


భీమవరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : ‘‘తెలుగుజాతికి అల్లూరి సీతారామరాజు ఆరాధ్యుడు. అందుకే జిల్లాల పునర్విభజనలో మన్యం జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాం’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం జరిగిన అల్లూరి జయంత్యుత్సవాల సభకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహించి మాట్లాడారు. ‘‘దేశాన్ని మరొక దేశం.. ఒక మనిషిని మరో మనిషి.. ఒక జాతిని మరో జాతి దోపిడీ చేసే సమాజాన్ని నిర్మూలించాలని జాతినేతలు కలలు కన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ బాట పట్టారు. మార్గాలు వేరైనా అందరి లక్ష్యం ఒక్కటే. అటువంటి యోధులలో అల్లూరి ఒకరు. అడవిలో అగ్గి పుట్టించిన యోధుడు. ఇటువంటి మహనీయులను స్మరించుకోవడానికే ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్స’వాలను నిర్వహిస్తున్నాం. మన పూర్వీకులు వారి రక్తాన్ని ధారబోసి స్వాతంత్ర్యాన్ని మనకు ఇచ్చారు. అమృతాన్ని అందించారు. అల్లూరి త్యాగం తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం’ అని జగన్‌ పేర్కిన్నారు.


అల్లూరి పోరాట యోధుడు: కిషన్‌రెడ్డి

అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా మన్యం ప్రాంతంలో ముందుగా చెప్పి పోలీ్‌సస్టేషన్‌లపై దాడులు చేసిన మహా యోధుడు అల్లూరి. లేఖ రాసి, సమయం చెప్పి మరీ దాడులు చేసిన ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం. ఎందరో త్యాగమూర్తులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ, కొందరినే మనం తెలుసుకున్నాం. అటువంటి గొప్ప వ్యక్తులను భావితరానికి, నవతరానికి, యువతరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ ఉత్సవాలు నిర్వహిస్తోంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.  


అల్లూరికి ప్రపంచ కీర్తి..

‘‘అల్లూరి తెలుగుజాతి గర్వించే యోధుడు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ ఒక అద్భుతం. ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహ ఆవిష్కరణ చేయడంతో ఆ మహాయోధుడికి ప్రపంచ కీర్తి లభించింది’’ 

చిరంజీవి


విప్లవజ్యోతి అల్లూరి..

‘‘బ్రిటీష్‌ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అల్లూరి పేరు వింటే నరం ఉప్పొంగని వారు ఉండరు’’ 

 నానిరాజు, క్షత్రియ నేత

Updated Date - 2022-07-05T08:20:26+05:30 IST