సర్వశుభకరుడు... సుబ్రహ్మణ్యుడు

Dec 3 2021 @ 01:55AM

(9న సుబ్రహ్మణ్య షష్ఠి)

గవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ‘మాసానాం మార్గశీర్షోహం’ అంటూ మార్గశిర మాసాన్ని మహనీయమైనదిగా, మోక్షదాయకంగా పేర్కొన్నాడు. అటువంటి పుణ్యప్రదమైన ఈ మాసంలో శ్రీసుబ్రహ్మణ్య షష్ఠి శుభ పర్వదినం మహోత్కృష్టమైనది. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడిగా కుమారస్వామి జన్మించిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ రోజునే తారకాసురుణ్ణి ఆయన వధించి, సకల లోకాలనూ రక్షించాడనీ, శ్రీ వల్లీ, దేవసేనలతో స్వామి కళ్యాణం జరిగిందనీ పురాణాలు వెల్లడిస్తున్నాయి.


కార్తికేయ సదయితా ఏక షష్ఠీ మహా తిథిః

దేవసేనాధిపత్యం హి ప్రాప్యమస్యాం మహాత్మనాః అని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఆరు ముఖాలతో, సూర్య తేజస్సుతో, శివ-శక్తి సమ్మేళన మూర్తిగా ఆవిర్భవించిన కార్తికేయుడు సకల లోకాలకూ సైన్యాధిపతిగా... దేవేంద్రుని చేతుల మీదుగా ఈ రోజు అభిషిక్తుడయ్యాడు ఆదికవి వాల్మీకి విరచితమైన శ్రీమద్రామాయణంలోని బాలకాండలో... శ్రీరాముడికి కుమార సంభవ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు వివరిస్తాడు. ఈ సందర్భంగా కుమారస్వామి మహిమను తెలియజేస్తూ...


  • ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా!
  • కుమారసంభవశ్చైవ ధన్యం పుణ్యస్తథైవ చ!!
  • భక్తశ్చయః కార్తికేయే కాకుత్స్థ భువిమానవాః
  • ఆయుష్మాన్‌ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్‌...


‘‘శ్రీరామచంద్రా! లోక కళ్యాణమై జరిగిన కుమారస్వామి జన్మగాథ ఎంతో పుణ్యప్రదమైనది. ఆ స్వామిని నిర్మల భక్తితో ఆరాధించేవారు సంపూర్ణ ఆయుష్మంతులై, పుత్ర పౌత్రాదులతో, సకల సౌభాగ్యాలతో వర్థిల్లి, మోక్షం పొందుతున్నారు’’ అని చెబుతాడు.


ఎన్నో పేర్లు... ఎన్నెన్నో విశేషాలు

సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో నామాలున్నాయి. గంగానదీ తీరంలో, శరవణ (రెల్లు) పొదలో జన్మించినవాడు కాబట్టి ‘గాంగేయుడ’నీ, ‘శరవణభవుడ’నీ పేర్లు వచ్చాయి. ఆరు ముఖాలు ఉన్నవాడు కాబట్టి ‘షణ్ముఖుడు’, ‘షడాననుడు’, ‘షడ్వకు్త్రడు’, . కృత్తికలు పాలిచ్చి పెంచినవాడు కనుక ‘కార్తికేయుడు’ అంటారు. ఆయన వాహనం నెమలి. ధ్వజం మీద కోడి ఉంటుంది. కాబట్టి ‘శిఖివాహనుడు’గా, ‘కుక్కుటధ్వజుడు’గా పేరుపొందాడు. శివుడు ప్రసాదించిన ‘వేల్‌’ (శూలం), ‘శక్తి’ ఆయుధధరుడు కనుక ‘వేలాయుధుడ’నీ, ‘శక్తిధరుడ’నీ ప్రసిద్ధి చెందాడు. నెమలి నిగ్రహశక్తికీ, కుక్కుటం చైతన్యానికీ, జ్ఞానోదయానికీ ప్రతీకలని పండితులు చెబుతారు. ‘సుబ్రహ్మణ్యుడు’ అంటే ‘ఉత్తమమైన బ్రహ్మజ్ఞానం కలిగినవాడు’ అని అర్థం. ఘోర తపస్సు చేసి, దివ్యజ్ఞాన సిద్ధిని పొంది.... ఒకానొక సందర్భంలో బ్రహ్మకే జ్ఞానోపదేశం చేసినవాడు కాబట్టి ఆయనను సుబ్రహ్మణ్యేశ్వరునిగా దేవతలు కీర్తించారు. తన దివ్యమైన శూలాయుధంతో తారకాసురుణ్ణి సంహరించి, ముల్లోకాలనూ రక్షించి ‘తారకారి’ అయ్యాడు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి సర్ప లేదా నాగ రూపంలో ఆరాధించడం సనాతన సంప్రదాయం. ఆరు ముఖాలు కలిగిన ఆయన మనిషిలోని షట్చక్రాలకు ప్రతీక అనీ, ఆరుతలల సర్పం మనలోని వెన్ను పూస అనీ, దాని తోకభాగం మూలాధార చక్రమనీ, అందులోని కుండలినీ శక్తి నిశ్చల ధ్యానం ద్వారా మేలుకొని, శిరస్సులోని సహస్రారంలో- పరంజ్యోతిలో లీనమయ్యేలా చేస్తుందనీ, తద్వారా మోక్ష పరమార్థమైన పరమేశ్వర సాక్షాత్కార భాగ్యం కలిగిస్తుందనీ సాధకులు చెబుతారు. ఆ దివ్య కుండలినీ శక్తినే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పేర్కొంటారు. ‘ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప మహాశక్తిధరం భజే’ అని సుబ్రహ్మణ్యస్వామిని భక్తులు కీర్తిస్తారు. ఆ మూడు శక్తులూ కలిసిన మహాశక్తి ఆయుధధారిని సకలదోషహరుడిగా, సర్వశుభకరుడిగా ఆరాధిస్తారు. 


  • సుబ్రహ్మణ్య షష్ఠినే ‘స్కంద షష్ఠి’, ‘కుమార సంభవ షష్ఠి’ అని కూడా అంటారు. 
  • షడ్వక్త్రం, శిఖివాహనం, త్రినయనం, చిత్రాంబరాలంకృతం
  • శక్తిం, వజ్రమసిం, త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్‌
  • పాశం కుక్కుటమంకుశం చవరదం, హస్తైర్దధానం సదా

ధ్యాయేదీప్సిత సిద్ధిదం, శివసుతం, స్కందం సురారాధితమ్‌... అని ఆ స్వామిని త్రికరణశుద్ధిగా స్తుతించి, ఆరాధిస్తే సత్సంతాన ప్రాప్తి, శీఘ్ర వివాహం, సర్ప, దుష్టగ్రహదోష పరిహారం, ఆయురారోగ్య సౌభాగ్య ప్రాప్తి, బుద్ధి, జ్ఞాన వికాసాలు, మోక్షం కలుగుతాయని నమ్మిక.

కళ్యాణశ్రీ జంథ్యాల వేంకటరామశాస్త్రి


పుణ్యప్రదమైన మార్గశిర మాసంలో శ్రీసుబ్రహ్మణ్య షష్ఠి శుభ పర్వదినం మహోత్కృష్టమైనది. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడిగా కుమారస్వామి జన్మించిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ రోజునే తారకాసురుణ్ణి ఆయన వధించి, సకల లోకాలనూ రక్షించాడనీ, శ్రీ వల్లీ, దేవసేనలతో స్వామి కళ్యాణం జరిగిందనీ పురాణాలు వెల్లడిస్తున్నాయి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.