విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-09-24T06:14:06+05:30 IST

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎంపీ మాగుంట

 కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

తర్లుపాడు, సెప్టెంబరు 23 : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు జవహర్‌ నవోదయ విద్యాలయం-2లో 35వ ప్రాంతీయ స్థాయి క్రికెట్‌ సెలక్షన్‌ మీట్‌ 2022-23ను నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముగ్గురూ కొద్దిసేపు క్రికెట్‌ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. హైదరాబాద్‌ రీజియన్‌లోని కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్ఛేరి రాష్ట్రాల్లోని 8 క్లస్టర్ల నుంచి 332 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా జ్యోతిని ప్రజ్వలన చేసి జాతీయజెండాను, క్రీడా జెండాను కలెక్టర్‌, ఎంపీలు ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్రీడలతో పోరాటతత్వం పెరుగుతుందన్నారు. ఈ స్ఫూర్తిని నిజ జీవితంలోనూ కొనసాగించాలన్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలకు కూడా అంతే అవసరమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, తర్లుపాడు ఎంపీపీ ఎస్‌.భూలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ బాలమురళీకృష్ణ, నవోదయ ప్రిన్సిపాల్‌ బీఈజీ ప్రసన్నకుమార్‌, వైస్‌ప్రిన్సిపాల్‌ రవికుమార్‌, తహసీల్దార్‌ కృష్ణారెడ్డి, ఎంపీడీవో ఎస్‌.నరసింహులు, పీఈటీ ప్రభుదాసు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-24T06:14:06+05:30 IST