ఆలూరు సాంబా 200 ఎకరాలను కబ్జా చేశాడు

ABN , First Publish Date - 2022-06-26T06:30:31+05:30 IST

శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబ శివారెడ్డి 200 ఎకరాల భూమిని కబ్జాచేశాడని, నిరూపించేందుకు తాము సిద్ధమని దళిత సంఘాల నాయకులు అన్నారు.

ఆలూరు సాంబా 200 ఎకరాలను కబ్జా చేశాడు
పాదయాత్రకు వెళ్తున్న దళిత సంఘాల నాయకులు..

నిరూపించేందుకు సిద్ధం

దళిత సంఘాల సవాల్‌

చలో బుక్కరాయసముద్రం భగ్నం

అనంతపురం సెంట్రల్‌, జూన 25: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబ శివారెడ్డి 200 ఎకరాల భూమిని కబ్జాచేశాడని, నిరూపించేందుకు తాము సిద్ధమని దళిత సంఘాల నాయకులు అన్నారు. అంబేడ్కర్‌ భవన నిర్మాణానికి కేటాయించిన భూమి పరిరక్షణ పేరిట ‘హలో మాదిగ.. చలో బుక్కరాయసముద్రం’ పేరిట వారు శనివారం పాదయాత్ర చేపట్టారు. నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి తరలివెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సప్తగిరి సర్కిల్‌లో అరెస్ట్‌ చేసి స్టేషనకు తరలించారు. అంతకుముందు మాదిగ మహాశక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న ఆంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ, ఎస్సీ సామాజిక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మావతి, భూముల ఆక్రమణలు, కబ్జాలపై ప్రశ్నిస్తున్న వారిపై కేసులు బనాయించారని ఆరోపించారు. వీఆర్వోలు గోపాల్‌రెడ్డి, శివారెడ్డిని అడ్డుపెట్టుకుని 200 ఎకరాలు కబ్జా చేసింది నిజంకాదా? అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఇసుక, మట్టి రీచల పేరిట సాంబశివారెడ్డి దోపిడీ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఆరుగురు రెడ్డి సామాజికవర్గీయులను ఇనచార్జిలుగా నియమించారని, మాదిగలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. దళితులైన 20 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను, 18 మంది యానిమేట్లను తొలగించారని అన్నారు. 2005లో ఎస్‌ఆర్‌టీ కళాశాలలో రూ.5 వేలకు ఉద్యోగిగా చేరిన సాంబశివారెడ్డి, నియోజకవర్గంలో నేడు 500 ఎకరాల ఆసామి ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఆయన ఆగడాలను అడ్డుకుంటున్నారన్న కక్షతోనే తనపైన, తన కుటుంబ సభ్యులపైన ‘గుంటూరు డ్రైవర్‌ హత్య తరహా’ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బుక్కరాయసముద్రం మండలం సర్వే నెంబర్లు 539(2), 540(2)లో 71 సెంట్ల భూమిని అంబేడ్కర్‌ భవనానికి కేటాయించాలని ఆరు నెలలుగా పోరాటాలు చేస్తున్నామని అన్నారు. దీనిపై పాదయాత్ర చేస్తుంటే, అరెస్టు చేసి నిర్బంధించడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నారాయణస్వామి, జైభీమ్‌ సేన నాయకుడు బీకేఎస్‌ ఆనంద్‌, ఎమ్మార్పీఎస్‌ శింగనమల నియోజవర్గ ఇనచార్జి వెంకటాపురం చంద్ర, నాయకులు ఆకులేడు ఓబులేస్‌, నాగార్జున, దాసానగాపల్లి కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:30:31+05:30 IST