I Pac Survey: ఒకే రకంగా మూడు సర్వేలు.. వైసీపీలో మరింత టెన్షన్..!

ABN , First Publish Date - 2022-07-28T00:09:51+05:30 IST

అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాటు పార్టీ, కార్యకర్తల గురించి పూర్తిగా మర్చిపోయిన వైసీపీ (Ycp) నేతలు ఇప్పుడు పార్టీపై దృష్టి సారించారు. గడప గడపకు..

I Pac Survey: ఒకే రకంగా మూడు సర్వేలు.. వైసీపీలో మరింత టెన్షన్..!

అమరావతి (Amaravathi): అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాటు పార్టీ, కార్యకర్తల గురించి పూర్తిగా మర్చిపోయిన వైసీపీ (Ycp) నేతలు ఇప్పుడు పార్టీపై దృష్టి సారించారు. గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapku Prabutvam) పేరిట అన్ని గ్రామాలకు వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టాలని సీఎం జగన్‌ (Cm Jagan) ఎమ్మెల్యేలకు ఆదేశించారు. కానీ.. చాలామంది ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సర్వేలతో.. జగన్‌ దావోస్‌ (Davos) నుంచి రాగానే ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్‌లతో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఆ తర్వాత వారం క్రితం మరో వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా.. 15 మంది ఎమ్మెల్యేలు మినహా గడప గడపకు కార్యక్రమాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదని వివరించారు. 50 మంది ఎమ్మెల్యేలు అసలు కార్యక్రమాన్నే ప్రారంభించలేదని, మిగతా ఎమ్మెల్యేలు అప్పుడప్పుడూ వెళ్లి వస్తున్నారని నియోజకవర్గాల పేర్లుతో సహా ప్రకటించారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. తన దగ్గర రెండు సర్వేలు ఉన్నాయని, ఎవరి పర్‌ఫామెన్స్‌ ఏంటో ఈ నివేదికల్లో ఉందని, వాటిని చూపిస్తూ ఎమ్మెల్యేలకు వివరించారు. 


జగన్‌కు ఐప్యాక్ సర్వే రిపోర్టు..

ఇదిలావుంటే... ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర ఉన్న ఒక సర్వే ఐప్యాక్‌ బృందం ఇచ్చింది కాగా.. మరొకటి క్రాస్‌ చెక్‌ చేసుకునేందుకు మరో సర్వే ఏజెన్సీకి అప్పగించారు. ఆ ఏజెన్సీ కూడా సేమ్‌ రిపోర్ట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. పైగా ఈ రెండు సర్వేలతో పాటు నిఘా వర్గాల నుంచి మరో సర్వేను కూడా తెప్పించుకొని సరిచూసుకున్నారు. రోజురోజుకు గ్రాఫ్‌ పడిపోవడంతోపాటు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని ఈ మూడు సర్వేలు తేల్చాయి. నగరాల నుంచి గ్రామాల వరకూ తీవ్ర వ్యతిరేకత ఉందని తేల్చాయి. మధ్యతరగతి, ఉన్నతవర్గాలతో పాటు రాజకీయ పరిజ్ఞానం, పది మందితో మాట్లాడే చొరవ, రాష్ట్ర అభివృద్ది, ఇతర అంశాలపై అవగాహన ఉన్న వారు, విద్యాధికులు, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మూడు సర్వేలూ స్పష్టం చేశాయి. చివరికి వైసీపీ(Ycp)కి చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకత్వం కూడా యాక్టివ్‌గా లేదని.. మరికొందరు అసలు పార్టీ వైపు కన్నెత్తి చూడటం లేదని సర్వేలు స్పష్టం చేయడం అధికార పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది.


కింది స్థాయి వరకూ వ్యతిరేకత సర్వేలు..

మరోవైపు... ఇసుక, మద్యం, అధ్వాన్న రహదారులు, కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వకపోవడంతో కిందిస్థాయి వరకూ వ్యతిరేకత ఉందని సర్వేలు వెల్లడి చేశాయి. ఇది చాలదన్నట్లు.. పార్టీలో కూడా కొంతమంది వ్యక్తుల దగ్గర అధికారం కేంద్రీకృతం కావడం, ఇది నియోజకవర్గాల వరకూ పాకినట్లు సర్వేలు తేల్చాయి. గతంలో పార్టీని ఆదరించిన అనేక వర్గాలు ఇప్పుడు పూర్తిగా దూరమయ్యాయని స్పష్టం చేశాయి. ఇక.. ఎమ్మెల్యేల పని తీరుపైనా సర్వేలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దాదాపుగా 60 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో వారి పాత్ర లేకపోవడం, అభివృద్ది కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడం కూడా వైసీపీకి మైనస్‌గా మారిందని ఐప్యాక్ టీమ్‌ ఇచ్చిన సర్వే తెలిపింది. ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ అందించింది. 



ఒకే రకంగా  మూడు సర్వేలు..

ఇక.. మూడు సర్వేలు ఒకే రకంగా ఉండడంతోనే సీఎం జగన్‌.. ఆరు నెలల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేనిపక్షంలో ఆ తరువాత తన మాటలు వేరుగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాదు.. మంత్రులు, రాష్ట్రస్థాయి నేతల్లోనూ కొందరి తీరు బాగోలేదని సర్వేలు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన జగన్‌ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. అటు.. సర్వేల్లో ఏముందో తెలుసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు.. కీలక నేతలను సంప్రదించినప్పటికీ.. వారు.. తమకూ తెలియదని చేతులెత్తేశారు. ఇక.. షాకింగ్‌ విషయం ఏమిటంటే.. ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితే కాదు.. సీఎం ఇమేజ్‌ కూడా తగ్గిపోతుందట. కొద్దిమంది సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో మినహా, మిగతా వారిలో జగన్‌కు అంతగా ఆదరణ లేదని తేల్చేయడం అధికార పార్టీని కలవరానికి గురి చేస్తోంది. అంతేకాదు.. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతుందని సర్వేలు స్పష్టం చేయడం వైసీపీలో మరింత టెన్షన్‌ రేపుతోందట.





Updated Date - 2022-07-28T00:09:51+05:30 IST