మండలి మాదిరే అమరావతిపై ప్రకటన చేయండి

ABN , First Publish Date - 2021-11-25T06:39:21+05:30 IST

మండలి మాదిరే అమరావతిపై ప్రకటన చేయండి

మండలి మాదిరే అమరావతిపై ప్రకటన చేయండి

అమరావతి బహుజన జేఏసీ డిమాండ్‌

విజయవాడ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : శాసనమండలిని రద్దు చేయాలని తీర్మానం చేసి తాజాగా ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు చేసిన మాదిరిగానే అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయాలని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య, బహుజన సీనియర్‌ నాయకుడు సర్వేపల్లి సుదర్శనరావు, ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫార్‌ఖ్‌ షుబ్లీలు డిమాండ్‌ చేశారు. ఆటోనగర్‌లో ఉన్న అమరావతి జేఏసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్టు ప్రకటన చేసిన వెంటనే అమరావతి ప్రాంత రైతులతో పాటు ఆ ప్రాంత ప్రజలు కరచాలనాలు చేసుకుని స్వీట్లు పంచుకున్నారన్నారు. అంతలోనే మార్పు, చేర్పులతో మరో నూతన బిల్లును ప్రవేశపెడతామని చెప్పడంతో నిరుత్సాహానికి లోనయ్యారని చెప్పారు. అమరావతిలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయని, అది ఒక సామాజిక వర్గానికి పరిమితమైనది కాదని, రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుందని తెలిపారు. అమరావతి కోసం 700 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమన్నారు. ఢిల్లీలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీనే వెనక్కి తగ్గి రైతులకు క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

Updated Date - 2021-11-25T06:39:21+05:30 IST