దుర్గమ్మా.. అమరావతిని కాపాడమ్మా..

ABN , First Publish Date - 2021-10-17T06:15:35+05:30 IST

దుర్గమ్మా.. అమరావతిని కాపాడమ్మా అంటూ రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు వేడుకున్నారు.

దుర్గమ్మా.. అమరావతిని కాపాడమ్మా..
ధర్నా శిబిరంలో లలిత సహస్రనామం పఠిస్తున్న మహిళలు

 రైతు ధర్నా శిబిరాల్లో దసరా పూజలు 

669వ రోజుకు రైతుల ఆందోళనలు


తుళ్లూరు, అక్టోబరు 16: దుర్గమ్మా.. అమరావతిని కాపాడమ్మా అంటూ రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు వేడుకున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రాజధాని రైతు ధర్నా శిబిరాల్లో రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నారు. మందడం, అనంతవరం శిబిరాల్లో దేవీ నవరాత్రుల పూజలు జరిగాయి. అదేవిధంగా శుక్రవారం విజయదశమి  సందర్భంగా అన్నీ శిబిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం అమ్మవారికి గ్రామోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా  ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఏడాది క్రితం అమ్మవారి సన్నిధికి బయలుదేరిన మహిళలపై లాఠీచార్జి చేశారని గుర్తు చేశారు. అమ్మవారి దయతో, న్యాయదేవత రైతులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి తాము భూములిచ్చామన్నారు. ఇందులో రైతుల వ్యక్తిగత ప్రయోజనం లేదన్నారు. మూడు పంటలు పండే భూమిని రాజధాని కోసం వదులుకున్నామని, కాని ప్రభుత్వం మారగానే రైతులను నడిరోడ్డుమీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 669 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే కనీసం చర్చలకు కూడా పిలవలేదన్నారు. ఓటు వేసి గెలిపించినందుకు తగిన బుద్ధి వచ్చిందన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రగతితో ముడిపడి ఉందని తెలిపారు. ఇప్పటికైనా అమరావతి రాజధాని అభివృద్ధిని కొనసాగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమ్మ వారికి హారతులు సమర్పించారు. 

Updated Date - 2021-10-17T06:15:35+05:30 IST