అమరావతి భూములను అమ్మేస్తారా?

ABN , First Publish Date - 2022-06-27T05:24:41+05:30 IST

అమరావతి భూములు అభివృద్ధి చేయకుండా అమ్మకాలు చేస్తామనటం దారుణం అని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి భూములను అమ్మేస్తారా?
బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న తుళ్ళూరు శిబిరంలో మహిళలు

922వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు 

తుళ్లూరు, జూన్‌ 26: అమరావతి భూములు అభివృద్ధి చేయకుండా అమ్మకాలు చేస్తామనటం దారుణం అని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి రైతులు ఇచ్చిన భూములను అమ్మేసి,  వచ్చిన నిధులను అమరావతి అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. తట్ట మట్టివేయని ప్రభుత్వం భూములు అమ్మి అభివృద్ధి చేస్తామని చెప్పటం వెనక మరో కుట్ర ఉందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారం 922వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మూడేళ్లుగా అభివృద్ధి చేయని ప్రభుత్వం ఇప్పుడు రాజధానిలో ఎకరం రూ.10 కోట్ల చొప్పున అమ్మి రాజధాని అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పటం చాలా విచిత్రంగా ఉందన్నారు. అమరావతిని అభివృద్ది చేస్తుంటే ఇంకా ఎక్కువ ధర  పలుకుతుందన్నారు. రైతుల జీవనాధారమైన భూములు ఎలా పడితే అలా అమ్మటానికి ప్రభుత్వానికి హక్కు లేదని స్పష్టం చేశారు. దొడ్డి దారిన జీవోలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు తీర్పును అమలు చేసి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆదోళనలు కొనసాగాయి. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. 


Updated Date - 2022-06-27T05:24:41+05:30 IST