రాష్ట్రం మెచ్చిన రాజధాని అమరావతి

ABN , First Publish Date - 2022-09-23T05:39:05+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలం దరూ మెచ్చిన రాజధాని అమరావతి అని, నాడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతునిచ్చి ఆమోదించాయని అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు అన్నారు.

రాష్ట్రం మెచ్చిన రాజధాని అమరావతి
వెంకటపాలెం రైతు ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

1010వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్షలు 

తుళ్లూరు, సెప్టెంబరు 22: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలం దరూ మెచ్చిన రాజధాని అమరావతి అని, నాడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతునిచ్చి ఆమోదించాయని అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు అన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌,హైకోర్టు తీర్పును అమలు చేయాలని రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం గురువారం నాటికి 1010వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ ఐదు కోట్ల మంది రాజధాని అమరావతిని కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయాల కోసం రాజధానులు మార్చుకుంటూ పోతే రాష్ట్ర ప్రగతి శూన్యమవుతుందన్నారు. ఇప్పుడు సీఎం జగన్‌రెడ్డి  చేస్తున్న పని అదేనన్నారు. మూడు రాజధానుల పేరుతో ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారన్నారు. అమరావతి ఆదాయ వనరు అని ప్రజలంతా నెత్తి నోరు బాదుకుంటున్నా కేవలం తన స్వార్ధ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమరావతిని నిర్వీర్యం చేసేందుకు పూనుకుంటున్నాడని, భూములిచ్చిన రైతులను అవమానించి నడిరోడ్డు మీద నిలబెట్టారన్నారు.  ఎవరైనా ఆంధ్రపదేశ్‌ రాజధాని ఎక్కడ అని అడిగితే సమాదానం చెప్పలేని స్థితిలో ఆయన పాలన ఉందని ఎద్దేవా చేశారు. ఆరు ఏళ్ళుగా అమరావతి రాజధానిగా రాష్ట్ర పాలన జరుగుతుంటే మధ్యలో మూడు ముక్కల ఆట మొదలు పెట్టి అటు ఇటు ఎటూ కాకుండా చేసే చర్యలను జగన్‌రెడ్డి అవలం భిస్తున్నాడని అన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేసి రాజధాని అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. బిల్డ్‌ అమరావతి  సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ  నినాదాలు చేస్తూ దీపాలు వెలగించి అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు. 


Updated Date - 2022-09-23T05:39:05+05:30 IST