అమరావతి నాశనానికి దొడ్డిదారి వెతుకున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-24T05:52:36+05:30 IST

రాష్ట్ర రాజధాని అమరావతిని నాశనం చేయటానికి ప్రభుత్వం దొడ్డిదారి వెతుకుతోందని రాజధానికి రైతులు పేర్కొన్నారు.

అమరావతి నాశనానికి దొడ్డిదారి వెతుకున్న ప్రభుత్వం
బిల్డ్‌ అమరావతి అంటూ తుళ్లూరు ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు


 ఉన్నత న్యాయస్థానం తీర్పును ధిక్కరిస్తున్నారు

 సీఆర్డీఏ చట్టం  సవరణకు బిల్లు పెట్టటం సిగ్గు చేటు

 1011 వ రోజుకు రైతుల ఆందోళనలు

తుళ్లూరు, సెప్టెంబరు 23: రాష్ట్ర రాజధాని అమరావతిని నాశనం చేయటానికి ప్రభుత్వం దొడ్డిదారి వెతుకుతోందని రాజధానికి రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ అమరావతి అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం నాటికి 1011వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ, విభజన చట్టం ప్రకారం, సీఆర్డీఏ చట్టం ప్రకారం అమరావతి రాజధానిని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. తీర్పు ప్రకారం అభివృద్ధి చేయకపోగా మాస్టర్‌ ప్లాన్‌ను నాశనం చేయటానికి సిద్దమైందన్నారు. అందుకే సీఆర్డీఏ చట్టాన్ని సవరించటానికి అసెంబ్లీలో  బిల్లు పెట్టిందన్నారు. హైకోర్టు తీర్పును ధిక్కరించిందన్నారు. అందుకు శిక్ష తప్పదన్నారు. ఎలాగైనా అమరావతి నాశనమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. అభివృద్ధి చేయకుండా అమరావతిలో పేదలకు భూములిస్తామని ఆశపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూములు లేవా.. అని ప్రశ్నించారు. కేవలం అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను నిర్వీర్యం చేయటమే లక్ష్యమన్నారు. ప్లాన్‌ నిర్వీర్యం అయతే అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉండదని కుట్ర పన్నారన్నారు. గుర్తింపు లేకపోతే అభివృద్ధి ఉండదన్నారు. అందుకే సీఆర్డీఏ చట్టం సవరణ పెట్టారన్నారు. మూడు రాజధానులు పాలకుల సొంత ప్రయోజనాల కోసమన్నారు. దాదాపు 30 వేల ఎకరాలు విశాఖలో అతి తక్కువ ధరకు సీఎం జగన్‌రెడ్డి అండ్‌ బ్యాచ్‌ కొనుగోలు చేసిందని ఆరోపంచారు. వాటి విలువ పెంచుకోవటానికే పరిపాలనా  రాజధాని అని పేరు పెట్టారని ఆరోపించారు. అందుకే అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మూడు ముక్కల ఆటతో కర్నూలు, విశాఖ వాసులకు  ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర నడిబొడ్డులోని అమరావతిని అభివృద్ధి చేస్తే, సీమాంధ్ర ఉత్తారాంధ్రను అభివృద్ధి చేయవచ్చన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. దీపాలు వెలిగించి బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. 


Updated Date - 2022-09-24T05:52:36+05:30 IST