‘అంకు’రించకముందే సమాధి!

ABN , First Publish Date - 2020-12-03T06:27:50+05:30 IST

అమరావతి సత్వర, సర్వతోముఖాభివృద్ధికి చోదకశక్తిగా నిలుస్తుందని ఆశించిన స్టార్టప్‌ ఏరియాకు శాశ్వతంగా సమాధి కట్టే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది.

‘అంకు’రించకముందే సమాధి!

అమరావతి స్టార్టప్‌ ఏరియా రద్దు 

ఒప్పందపత్రాలకు ప్రభుత్వ ఆమోదం

ఏడీపీ లిక్విడేషన్‌ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అమరావతి సత్వర, సర్వతోముఖాభివృద్ధికి చోదకశక్తిగా నిలుస్తుందని ఆశించిన స్టార్టప్‌ ఏరియాకు శాశ్వతంగా సమాధి కట్టే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. స్టార్టప్‌ ఏరియా స్థాపన కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, సింగపూర్‌ కంపెనీల మధ్య కుదిరిన ‘కాడా (కన్సెషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌)’- షేర్‌హోల్టర్ల అగ్రిమెంట్‌ (ఎస్‌హెచ్‌ఏ) రద్దు ముసాయిదా (డ్రాఫ్ట్‌ టెర్మినేషన్‌) అగ్రిమెంట్లకు ఆమోదం తెలియజేస్తూ పురపాలక ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు బుఽధవారం ఆదేశాలిచ్చారు. వాటి ప్రాతిపదికన.. స్టార్టప్‌ ఏరియా (అంకుర ప్రాంతం) అభివృద్ధికి స్థాపించిన ఏడీపీ (అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను లిక్విడేషన్‌ చేయాల్సిందిగా ఏఎంఆర్డీయే (గతంలో ఏపీసీఆర్డీయే) మెట్రోపాలిటన్‌ కమిషనర్‌తోపాటు ఏడీసీఎల్‌ సీఎండీని, ఏడీపీ బోర్డు మెంబర్లను ఆదేశించారు. దీంతో, ఎంతో ఉజ్వలంగా వెలిగి, తెలుగువారికి తరగని పెన్నిధిలా భాసిస్తుందనుకున్న అమరావతి స్టార్టప్‌ ఏరియా అతి త్వరలోనే కాలగర్భంలోకి జారిపోనుంది!

రాజధానిలోని లింగాయపాలెంకు సమీపంలో, కృష్ణానదీ తీరాన 1691 ఎకరాల్లో ఈ స్టార్టప్‌ ఏరియాకు గతేడాది జనవరిలో శ్రీకారం చుట్టారు. అమరావతితోపాటు రాష్ట్ర సత్వరాభివృద్ధి కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సంకల్పించి, సుప్రసిద్ధ సింగపూర్‌ సంస్థలతో కూడిన కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా దీనికోసం సంకల్పించింది. వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు, కంపెనీలు, కార్యాలయాలకు నెలవుగా ఈ స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేయాలనుకొన్నారు. దానివల్ల వివిధ పన్నుల రూపేణా రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుందని చంద్రబాబుప్రభుత్వం ఆకాంక్షించింది. దీని ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభమైన కొద్ది కాలానికే సార్వత్రిక ఎన్నికలు జరగడం, వాటిల్లో గెలిచి వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కడంతో అమరావతి స్టార్టప్‌ ఏరియాకు గ్రహణం పట్టింది. ఒక వ్యూహం ప్రకారం ఈ ప్రాజెక్టుకు జగన్‌ సర్కారు పొగ పెడుతూ వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి బాధ్యతల నుంచి ‘స్వచ్ఛందం’గా వైదొలగుతామని సింగపూర్‌ కన్సార్షియం ప్రకటించి, నిష్క్రమించింది. ఆ తర్వాత చట్టబద్ధంగా ఈ ప్రాజెక్ట్‌ కోసం ఏర్పాటు చేసిన ఏడీపీని కూడా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వచ్చింది. తాజా ఆదేశాలతో  అమరావతి అంకుర ప్రాంత ప్రాజెక్ట్‌ను పూర్తిగా చరిత్రపుటల్లో కలిపేసింది! 

Updated Date - 2020-12-03T06:27:50+05:30 IST