Amaravati Farmers: వెయ్యి రోజులుగా సంతోషం కరువు

ABN , First Publish Date - 2022-09-11T01:00:12+05:30 IST

సంతోషం, సంబరాలు, పండుగలు కోల్పోయి వెయ్యి రోజులైనట్లు రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు వాపోయారు

Amaravati Farmers: వెయ్యి రోజులుగా సంతోషం కరువు

తుళ్లూరు: సంతోషం, సంబరాలు, పండుగలు కోల్పోయి వెయ్యి రోజులైనట్లు రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు వాపోయారు. జీవనాధారమైన భూములు రాజధానికి ఇచ్చామన్నారు. అయితే  వైసీపీ ప్రభుత్వం  తీసుకున్న  మూడు రాజధానుల నిర్ణయంతో నడి రోడ్డుపైకి వచ్చామన్నారు. గత ప్రభుత్వం పదివేల కోట్లతో అభివృద్ధి పనులు  చేపటితే ఈ ప్రభుత్వం తట్ట మట్టి కూడా వేయలేదన్నారు. రెండో విడత పాదయాత్రతో ప్రజలను చైతన్య పరుస్తామన్నారు.  ఈ ప్రభుత్వాన్ని గద్దె దించటమే ధ్యేయమంటున్నారు. వెయ్యిరోజుల నుంచి పడిన కష్టాలు, అవమానాలు గురించి  రైతు జేఏసీ నేతలు ఆవేదన వెలిబుచ్చారు.  


న్యాయం అడిగితే అక్రమ కేసులు

న్యాయం అడిగితే పట్టించుకోకపోగా అక్రమ కేసులు పెడుతున్నారు. మూడురాజధానులు వద్దు అమరావతిని అభివృద్ధి చేయండి అంటే సమాధానం లేదు. భూములు ఇచ్చిన రైతులను పట్టించుకోవడం లేదు. అందుకే రోడ్డు ఎక్కాము. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. మరో మహా పాదయాత్రతో  రాష్ట్ర ప్రజలందరికీ రాజధాని రైతులకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహం గురించి వివరించి వారి మద్దతు కోరతాం. 

                                                                                                                                                                                                                                     జొన్నలగడ్డ కిరణ్‌కుమార్‌, రైతు జేఏసీ నేత


దళితుల రాజధానిని వక్రీకరిస్తున్నారు

ఎస్సీ నియోజకర్గంలో రాజధాని అమరావతి ఏర్పడితే  వేరే సామాజికవర్గానిదని ప్రచారం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. వెయ్యి రోజుల నుంచి  అడుగడుగునా  వేధింపులు ఏదో ఒక రూపంలో జరుగుతున్నాయి. ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. 

                                                                                                                                                                                                                                           గడ్డం మార్టిన్‌, దళిత జేఏసీ కన్వీనర్‌ 


రైతులపై లాఠీచార్జీ 

మూడు రాజధానులు వద్దని , అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పొంగళ్ళు తీసుకెళ్తుంటే అడ్డుకున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే అభ్యంతరం ఏమిటని అడిగినందుకు  పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఎంతోమంది మహిళలు,  రైతులు గాయపడ్డారు. భూములిచ్చిన రైతులను సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏవిధంగా హింసిస్తుందో ప్రజలకు పాద యాత్ర ద్వారా వివరిస్తాం.

                                                                                                                                                                                                                                   కాటా అప్పారావు, రైతు జేఏసీ నాయకులు

Updated Date - 2022-09-11T01:00:12+05:30 IST