Amaravati Padayatra: అడుగడుగునా రాజధాని రైతులకు పూలతో స్వాగతం

ABN , First Publish Date - 2022-09-26T02:54:08+05:30 IST

రాజధానిగా అమరావతి (Amaravati)నే కొనసాగించాలంటూ రైతులు తమ మనోగతాన్ని చాటి చెప్పారు. అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం పలికిన నందివాడ

Amaravati Padayatra: అడుగడుగునా రాజధాని రైతులకు పూలతో స్వాగతం

గుడివాడ: రాజధానిగా అమరావతి (Amaravati)నే కొనసాగించాలంటూ రైతులు తమ మనోగతాన్ని చాటి చెప్పారు. అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం పలికిన నందివాడ మండలం రైతుల ‘మీకు మేము అండగా ఉన్నాం’అంటూ భరోసా ఇచ్చారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ శివారున ఉన్న వీకేఆర్‌, వీఎన్‌బీ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 14వ రోజు మహాపాదయాత్ర ప్రారంభమైంది. టెలీఫోన్‌ నగర్‌, జొన్నపాడు, నందివాడ, తుమ్మలపల్లి, వెంకటరాఘవాపురం, కుదరవల్లి, గ్రామాల మీదుగా ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొణికి గ్రామం వరకు 17 కిలోమీటర్లమేర పాదయాత్ర సాగింది. వీకేఆర్‌, వీఎన్‌బీ ఇంజనీరింగ్‌ కళాశాలవద్ద వెంకటేశ్వరస్వామికి, సూర్యరధానికి దిష్టి తీసి మహిళలు హారతులిచ్చారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి దేవినేని ఉమాలు యాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మహాపాదయాత్రలో పాల్గొని రైతులతో కలిసి నడిచారు.


జొన్నపాడు-ఇలపర్రు రహదారి వెంబడి అపూర్వ స్వాగతం

అమరావతి రాజధాని మహాపాదయాత్ర ఆదివారం జొన్నపాడు-ఇలపర్రు రహదారి వెంబడిసాగింది. జొన్నపాడు వద్ద అమరావతి రైతులకు స్థానిక రైతులు, మహిళలు భారీగా స్వాగతం పలికారు. సూర్యరధానికి హరతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టారు, మహాపాదయాత్రకు ఎమ్మెల్పీ బచ్చుల అర్జునుడు లక్ష రూపాయలు, హైదరాబాదుకు చెందిన జి.వెంకటేశ్వరరావు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. తుమ్మలపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు భోజన విరామం అనంతరం మహాపాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు ఇతర జిల్లాలకు చెందిన రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. గుడివాడ ఐఎంఏ ప్రతినిధులు మహాపాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రలో పాల్గొన్న రైతులు ఒకేరాష్ట్రం, ఒకే రాజధాని, అమరావతే ముద్దు, మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2022-09-26T02:54:08+05:30 IST