దిగ్విజయంగా..

ABN , First Publish Date - 2022-09-26T05:45:03+05:30 IST

జిల్లాలో ప్రవేశించిన రోజు మొదలు, సరిహద్దులు దాటే వరకూ వెంటే నడిచారు.

దిగ్విజయంగా..

జిల్లాలో ముగిసిన రైతుల పాదయాత్ర

  ఏలూరు జిల్లాలోకి ప్రవేశం

   వీడ్కోలు పలికిన కృష్ణా జిల్లా రైతులు

   14వ రోజు 17 కిలోమీటర్లు సాగిన యాత్ర

  జిల్లాలో106 కిలోమీటర్ల మేర నడక

ఆరు రోజులు.. 106 కిలోమీటర్లు.. ఎన్నో ఆంక్షలు.. మరెన్నో అడ్డుగోడలు.. అన్నింటినీ దాటుకుని, ఆటంకాలను ఎదుర్కొని, కృష్ణాజిల్లా దాటి అలుపెరగక సాగుతూనే ఉంది అమరావతి రైతుల మహా పాదయాత్ర. అమరావతి బాగు కోసం సాగుతున్న ఈ పోరులో కాలు కదిపిన కర్షకులకు మేమున్నామంటూ జిల్లా రైతులు అండగా నిలిచారు. ఆత్మీయులు ఇంటికొచ్చినంత ఆనందాన్ని పంచారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టారు. తడారిన గొంతులకు దాహం తీర్చారు. పూల వర్షం కురిపించారు. పండ్లు పంపిణీ చేశారు. ఊరూవాడ, పట్టణాలు, నగరాలు అన్నిచోట్లా పండుగ వాతావరణాన్ని సృష్టించారు. జిల్లాలో ప్రవేశించిన రోజు మొదలు, సరిహద్దులు దాటే వరకూ వెంటే నడిచారు. రైతులు, మహిళలు, పిల్లలు, యువతీ యువకులు జయజయ ధ్వానాలతో యాత్రకు ఎదురేగగా, పెద్దలు ‘సంకల్ప సిద్ధిరస్తు’ అంటూ ఆశీర్వదించి పంపారు.

మచిలీపట్నం/గుడివాడ/నందివాడ, సెప్టెంబరు 25 : అమరావతి రైతుల మహాపాదయాత్ర కు ఆదివారం నందివాడ మండల రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. మహాపాదయాత్రకు సహకరించొద్దని మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఆంక్షలు పెట్టినా రైతులు, మహిళలు లెక్క చేయలేదు. ఇళ్ల నుంచి బయటకొచ్చి జయజయధ్వానాలతో సంఘీభావం తెలిపారు. దీంతో జొన్నపాడు-ఇలపర్రు రహదారి నిండిపోయింది. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. టియర్‌  గ్యాస్‌, రబ్బరు బుల్లెట్లు వాడే వాహనాన్ని యాత్ర వెంట తిప్పుతూనే ఉన్నారు. నందివాడ గ్రామం వద్ద పాదయాత్ర జరుగుతున్న రహదారిపై టిప్పర్‌ నిలిచిపోయింది. అధికార పార్టీ నాయకులే ఇసుక లోడుతో ఉన్న టిప్పర్‌ను రహదారికి అడ్డుగా పెట్టారనే ప్రచారం జరిగింది. టిప్పర్‌ కమాన్‌ కట్టలు విరిగిన విషయం గమనించిన పోలీసులు ఇసుకను ఖాళీ చేయించి రోడ్డు పక్కన పెట్టించారు.

మహాపాదయాత్ర సాగిందిలా..

గుడివాడ శివారులోని వీకేఆర్‌, వీఎన్‌బీ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ఆదివారం ఉదయం 8.30 గ ంటలకు అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. 14వ రోజు యాత్ర టెలిఫోన్‌ నగర్‌, జొన్నపాడు, నందివాడ, తుమ్మలపల్లి, వెంకట రాఘవాపురం, పెదవిరివాడ, కుదరవల్లి గ్రామాల మీదుగా ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొణికి గ్రామం వరకు 17 కిలోమీటర్ల మేర సాగింది. మహాపాదయాత్రకు అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని బాబ్జీ రూ.5 లక్షలు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు రూ.లక్ష, హైదరాబాదుకు చెందిన జి.వెంకటేశ్వరరావు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. 

జిల్లాలో ముగిసిన యాత్ర

కృష్ణాజిల్లా రైతులు ఆదివారం మహాపాదయాత్రకు వీడ్కోలు పలికారు. ఆరు రోజులుగా అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన,  గుడివాడ నియోజకవర్గాల్లో 106 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిగింది. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, జయమంగళ వెంకటరమణ, రావి వెంకటేశ్వరరావు, కొనకళ్ల బుల్లయ్య, గుడివాడ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య (బాబ్జీ), బందరు పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ తదితరులు యాత్ర వెంట సాగారు. గుడివాడ ఐఎంఏ సభ్యులు సంఘీభావం తెలిపారు. వెన్ననపూడి సెంటరులో పాదయాత్ర చేస్తున్న రైతులపై ఓ కానిస్టేబుల్‌ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో జేఏసీ నాయకులు ఎ.శివారెడ్డి, గద్దె తిరుపతిరావు వారించారు.


Updated Date - 2022-09-26T05:45:03+05:30 IST