Amaravati Padayatra: రేపు అమరావతి మహా పాదయాత్రకు విరామం

ABN , First Publish Date - 2022-09-19T00:39:26+05:30 IST

రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన అమరావతి (Amaravati) రైతులకు అన్యాయం జరిగింది. వారికి అండగా ఉండి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుంటాం

Amaravati Padayatra: రేపు అమరావతి మహా పాదయాత్రకు విరామం

రేపల్లె: ‘‘రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన అమరావతి (Amaravati) రైతులకు అన్యాయం జరిగింది. వారికి అండగా ఉండి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుంటాం. అమరావతి రైతులారా...ఈ పోరాటంలో విజయం మీదే...లక్ష్యం చేరేవరకు మీకు మేము అండగా ఉంటాం’’ అని అమరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తున్న గ్రామాలలో వినిపిస్తున్న మాటలు. గుంటూరు, విజయవాడ (Guntur Vijayawada) నుంచి వచ్చిన వందలాది మంది ముస్లింలు మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అలాగే జైభీమ్‌ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన బహుజనులు రాజధాని రైతులకు బాసటగా నిలిచి అండగా ఉంటామన్నారు. సీపీఐ, బీజేపీ, జనసేన పక్షాలు వెంటరాగా వివిధ ప్రజా సంఘాల మద్దతు మధ్య ఏడో రోజైన ఆదివారం బాపట్ల జిల్లాలో మహాపాదయాత్ర కొనసాగింది. నగరం లోని ఎస్‌వీఆర్‌ఎం  కళాశాల నుంచి ప్రారంభమైన నడక గాలివారిపాలెం, బెల్లవారిపాలెం, ఏలేటిపాలెం, వెలమవారిపాలెం, చిలకావారిపాలెం, సజ్జావారిపాలెం మీదుగా రేపల్లె చేరుకోవడవంతో  ఏడోరోజు నడక ముగిసింది. జిల్లాలొకి మహాపాదయాత్ర ప్రవేశించి ఆదివారానికి నాలుగు రోజులవుతుంది. మహాపాదయాత్ర ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నందున సోమవారం నడకకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం ప్రారంభమవుతుంది. రేపల్లె నుంచి ఐదు కిలోమీటర్ల నడక తర్వాత పులిగడ్డ వారధి వద్ద కృష్ణాజిల్లా (Krishna District)లోకి మహాపాదయాత్ర ప్రవేశిస్తుంది. ఆదివారం నాటికి  జిల్లాలో దాదాపు 65 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.


సజ్జావారిపాలెం నుంచి రేపల్లె పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించే సమయంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాన రహదారి జనసంద్రమైంది. పట్టణంలో రాత్రికి రాత్రే వెలసిన మూడు రాజధానులే ముద్దు బ్యానర్లకు హాజరైన జనమే సమాధానమని రాజధాని రైతులు అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న నన్నపనేని రాజకుమారి మద్దతునిచ్చిన జనసందోహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర (Kollu Ravindra), ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, దేవినేని  ఉమామహేశ్వరరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు రైతులకు మద్దతు ప్రకటించారు. మహాపాదయాత్ర చేపడుతున్న రైతులకు సంఘీభావం తెలపడానికి వస్తున్న నిజాంపట్నం, రేపల్లె రూరల్‌ మండల ప్రజలను పోలీసులు అడ్డగిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అనగాని దృష్టికి తేవడంతో సీఐతో మాట్లాడి వెంటనే  సమస్య పరిష్కరించారు. కేవలం రోడ్డు డైవర్షన్‌ భాగంలోనే వేరే మార్గం గుండా వెళ్లమని చెప్పామని పోలీసులు ఎమ్మెల్యేకు తెలిపారు.

Updated Date - 2022-09-19T00:39:26+05:30 IST