Amaravati Padayatra: మహా పాదయాత్రకు జన’నీరాజనం’

ABN , First Publish Date - 2022-09-16T01:06:56+05:30 IST

దగాపడ్డ రాష్ట్రం కోసం భూ దానమిచ్చిన రైతులను దేవుళ్లతో సమానంగా చూసుకోవలసిన సర్కారు ఉగ్రవాదులుగా చిత్రీకరించటం దారుణం.

Amaravati Padayatra: మహా పాదయాత్రకు జన’నీరాజనం’

తెనాలి: ’దగాపడ్డ రాష్ట్రం కోసం భూ దానమిచ్చిన రైతులను దేవుళ్లతో సమానంగా చూసుకోవలసిన సర్కారు ఉగ్రవాదులుగా చిత్రీకరించటం దారుణం. ఒక్క అమరావతి (Amaravati) రైతులకే కాదు.. యావత్‌ తెలుగు ప్రజలందరికీ జరుగుతున్న అన్యాయమిది.. అందుకే మీ ఉద్యమానికి మేమూ అండగా నిలుస్తాం. మీరు చేస్తున్న పాదయాత్ర మీకోసం కాదు... మా కోసం, మా పిల్లల రేపటి భవిష్యత్‌ కోసం..’ అంటూ ఒక్కొక్కరిగా కదలివచ్చారు. జై అమరావతి అంటూ నినాదాలతో మారుమోగించారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని, అది అమరావతే నంటూ నినదించారు. మా అడుగూ మీకు తోడుగా ఉంటుందంటూ బ్రహ్మరథం పట్టారు. ఒక్కొక్కరుగా నేను సైతమన్నట్లు భారీగా తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నాలుగో రోజు గురువారం గుంటూరు జిల్లా (Guntur District) పెదరావూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర బాపట్ల జిల్లాలోకి అడుగుపెట్టింది. 17 కి.మీటర్లు సాగిన నడకకు రెండులైన్ల ప్రధాన రహదారి సరిపోలేదు. రెండు కి.మీటర్ల పొడవున ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. కేవలం చుట్టుపక్కల ప్రాంత ప్రజలే కాకుండా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పాదయాత్ర లేని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. వారి ప్రేమాభిమానాలను బంతిపూల రూపంలో వర్షంలా కురిపించారు. ఈ నాలుగు రోజుల్లో 80 కి.మీటర్లకుపైగా నడవటంతో చాలామంది రైతులు, మహిళల కాళ్లకు పుండ్లు పడినా లెక్కచేయకుండా ముందుకు సాగుతుండటంతో, వాటిని చూసి చలించిన జనం వారి పాదాల కింద పచ్చని తివాచి పరిచినట్టు పుష్పాల రేఖలను పరిచారు. 

Updated Date - 2022-09-16T01:06:56+05:30 IST