Amaravati: రేపు మహాపాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-12T00:58:59+05:30 IST

నవ్యాంధ్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతి (Amaravati) రైతులు చేపట్టిన 630 కిలోమీటర్ల మహాపాదయాత్ర సోమవారం

Amaravati: రేపు మహాపాదయాత్ర ప్రారంభం

గుంటూరు: నవ్యాంధ్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతి (Amaravati) రైతులు చేపట్టిన 630 కిలోమీటర్ల మహాపాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ భూములిచ్చిన రైతులు, రాజధాని అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు చేపట్టిన ఉద్యమానికి వెయ్యిరోజులకు చేరుకున్న నేపథ్యలో అమరావతివాసులు ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అమరావతిలోని వెంకటపాలెం గ్రామం నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ సాగే 630 కిలోమీటర్ల ఈ మహా పాదయాత్ర సోమవారం ఉదయం లాంఛనంగా పార్రంభమవుతుంది. వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ఉదయం 5 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమరావతి రైతులు శాస్త్రోక్తంగా పాదయాత్రను ప్రారంభించనున్నారు. 


600 మందితో యాత్ర

కిందటేడాది నవంబరు 1న చేపట్టిన ’న్యాయస్థానం టూ దేవస్థానం’ పాదయాత్ర కూడా వెలగపూడిలోని హైకోర్టు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకూ 400 కిలోమీటర్ల మేర సాగింది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, అధికారపార్టీ నాయకగణం ఎన్ని ఆటంకాలు కలిగించినా రైతులు పట్టుదలతో ఆ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా చేపట్టిన పాదయాత్ర గత పాదయాత్ర కంటే సుదీర్ఘమైనది. సంక్లిష్టమైనది కూడా అయినప్పటికీ 600 మంది పాదయాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు కూడా. వీరంతా 60 రోజుపాటు 630 కిలోమీటర్ల మేర పాదయాత్ర ముగిసేవరకూ పాదయాత్రలో కొనసాగుతారు. కాగా పాదయాత్రకు ప్రభుత్వం, పోలీసు శాఖ కిందటి సారి మాదిరిగానే ఈసారి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంది. 

Updated Date - 2022-09-12T00:58:59+05:30 IST