అమరావతి పేరంటేనే ఉలికి పడతారెందుకు?

ABN , First Publish Date - 2021-10-14T08:19:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి చరిత్రలో కనిపించిన దోషమేమిటో, లోపమేమిటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ‘అమరావతి’ పేరు వింటేనే ఉలికిపాటు పడుతున్నారు...

అమరావతి పేరంటేనే ఉలికి పడతారెందుకు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి చరిత్రలో కనిపించిన దోషమేమిటో, లోపమేమిటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ‘అమరావతి’ పేరు వింటేనే ఉలికిపాటు పడుతున్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని నిందలు వేసి, ఆ రాజధాని ఒక సామాజికవర్గం మేలు కోసమే అని ప్రచారం చేసిన వాళ్లకు ‘అమరావతి’ నామధేయం కూడా గిట్టకపోవటంలో ఆశ్చర్యం లేదు. అమరావతిపై రాష్ట్ర పాలకులకు ఉన్న కసి చూస్తే వారి మీద జాలేస్తుంది. పదవ తరగతి పాఠ్యాంశంలో అమరావతి పాఠాన్ని తొలగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనసేమిటో ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయింది.


అమరావతిది అద్భుతమైన చరిత్ర. అక్కడ అన్ని మతాలు, సంస్కృతులు విలసిల్లాయి. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి. చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్‌, గ్రీకు రాయబారి మెగస్తనీసు వంటివారు అమరావతిని ‘ఆంధ్రనగరి’గా కీర్తించారు. అమరావతి శిల్ప కలల కాణాచి. ఆచార్య నాగార్జునుడు అక్కడ మహాప్రాకారం నిర్మించారు. ఆ ప్రాంతంలో దీపాలదిన్నె అని పిలిచే ఒక మట్టిదిబ్బ దగ్గర చెల్లాచెదురుగా ఎన్నో శిల్పాలు పడి ఉండడాన్ని గుర్తించారు. కాలగర్భంలో ఎంతో శిల్పసంపద కలిసిపోగా, కొన్ని కళారూపాలను బ్రిటిష్‌ మ్యూజియంలోని అసాహిషింబున్‌ గ్యాలరీలో, మరికొన్నిటిని నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఇంతటి ప్రాశస్త్యం గలిగిన పురానగర చరిత్ర పాఠ్యాంశాన్ని తొలగిస్తారా? మొత్తం 12 పాఠ్యాంశాలలో 2వ పాఠంగా ఉన్న అమరావతి వ్యాసం తీసేస్తే, దానిపై కక్ష తీరినట్లేనా? కొవిడ్‌ భారం తగ్గించేందుకే ఆ పాఠ్యాంశం తొలగించామని అంటున్నారు. అయితే నిజమేమిటో ప్రజలకు తెలియదా? తెలియదని అనుకోవడం అవివేకం మాత్రమే. దాదాపు రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాంత వైభవ చరిత్రను, కేవలం 12 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక రాజకీయ పార్టీ భూస్థాపితం చేయాలని అనుకుంటే తెలుగు బిడ్డలు సహిస్తారా? 

పోతుల బాలకోటయ్య

అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు

Updated Date - 2021-10-14T08:19:20+05:30 IST