రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన

ABN , First Publish Date - 2020-07-05T11:11:45+05:30 IST

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన కొనసాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్‌

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన

అమరావతిని రాజధానిగా కొనసాగించాలి

టీడీపీ నేతలు సోమిశెట్టి, నాగేశ్వరరావు యాదవ్‌


కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 4: రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన కొనసాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్‌ ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వారు విలేఖరులతో మాట్లాడారు. ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఆందోళన 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలిపారు. ఈ ఉద్యమంలో 54 మంది రైతులు, రైతు కూలీలు, 11 మంది మహిళలు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి నివాళి అర్పించారు.


రాష్ట్రం విభజన తరువాత 2014లో నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, అన్ని పార్టీల ప్రతినిధులతో చర్చించి గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు. మేధావుల సూచనల మేరకు భూసేకరణ చేపట్టారని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలను ఇచ్చారని తెలిపారు. అది సరిపోదని, మరికొంత భూమిని సేకరించి మంచి రాజధానిని అక్కడే ఏర్పాటు చేయాలని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ శాసనసభలో ప్రస్తావించారని అన్నారు.


అమరావతి నిర్మాణం పూర్తి అయితే చంద్రబాబు పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న అక్కసుతో రాజధానిని మారుస్తున్నారని, ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు.  16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ ప్రజలను మోసగించడంలో దిట్ట అని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, లేదంటే కర్నూలును పరిపాలన రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని వైఎస్సార్‌ రాష్ట్రంగా, వైఎస్‌ జగన్‌ రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నారని సోమిశెట్టి ఆరోపించారు. బీసీ నాయకులను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారని, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర తదితరులపై కేసులే దీనికి నిదర్శనమని అన్నారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రకాంత్‌, నారాయణరెడ్డి, జేమ్స్‌, నాగేంద్ర కుమార్‌, రాజు యాదవ్‌, పేరపోగు రాజు, మహేష్‌ గౌడు, అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T11:11:45+05:30 IST