
ఎన్డీయే వర్గాలు తెలిపినట్టు ఆంగ్ల టీవీలో కథనం
న్యూఢిల్లీ, జూలై 2: ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను నిలబెట్టనున్నట్టు ఆ కూటమి వర్గాలు తెలిపాయని ఓ ఆంగ్ల టీవీ చానల్ శనివారం సంచలన కథనాన్ని ప్రచురించింది. గతేడాది ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన పీఎల్‌సీ(పంజాబ్ లోక్ కాంగ్రెస్) పార్టీని స్థాపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్(ధిండ్సా) పార్టీలతో కూటమి కట్టిన పీఎల్‌సీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాగా, పీఎల్‌సీని బీజేపీలో విలీనం చేయనున్నట్టు తెలిసిందని ఆ టీవీ చానల్ పేర్కొంది. లండన్‌లో వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అమరీందర్ వచ్చేవారం స్వదేశానికి తిరిగి వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ప్రధాని మోదీ సైతం ఆయనకు ఫోన్ చేసి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని వివరించింది. కాగా, అమరీందర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు ‘కన్ఫర్మేషన్’ ఇంతవరకు అందలేదని ఆయనకు సన్నిహితుడైన అనుచరుడు ఒకరు తెలిపారు. అయితే, ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారంటూ అమరీందర్‌తోపాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సహా అనేకమంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయని, అభ్యర్థి ఎవరనేది బీజేపీ నాయకత్వం, పార్లమెంటరీ బోర్డు ఖరారు చేస్తాయని బీజేపీ నేత ఒకరు తెలిపారు.