జమ్ము నుంచి Amarnath Yatra నిలిపివేత.. ప్రతికూల వాతావరణమే కారణం

ABN , First Publish Date - 2022-07-10T22:51:05+05:30 IST

కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహ సమీపంలో వరదలు సంభవించిన 2 రోజుల తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జమ్ము నుంచి Amarnath Yatra  నిలిపివేత.. ప్రతికూల వాతావరణమే కారణం

జమ్ము : కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌(Amarnath) గుహ సమీపంలో వరదలు సంభవించిన 2 రోజుల తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము(Jammu) నుంచి అమర్‌నాథ్ యాత్ర(Amarnth Yatra)ను నిలిపివేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని ఆదివారం వెల్లడించింది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌లకు జమ్ము నుంచి కొత్త బ్యాచ్‌లను అనుమతించబోమని ఓ అధికారి స్పష్టం చేశారు. కాశ్మీర్‌లోని 2 బేస్ క్యాంపులకూ జమ్ము నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్టు అధికారి స్పష్టం చేశారు. తీవ్ర ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణమని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కుంభవృష్టి సంభవించింది. మెరుపు వరదల్లో కొట్టుకుపోయి ఏకంగా 16 మంది కన్నుమూశారు. దాదాపు 40 మంది ఆచూకీ లభ్యంకాలేదు. అప్పటి నుంచి అక్కడ ప్రతికూల వాతావరణం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 


దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉన్న ‘నువాన్-పహల్గం’, మధ్య కాశ్మీర్‌ బల్టాల్‌లోని ‘గండెర్బల్’ అనే జంట బేస్ క్యాంప్‌ల నుంచి జూన్ 30 అమర్‌నాథ్ యాత్రం ప్రారంభమైంది. ఇప్పటివరకు 1 లక్షకుపైగా భక్తులు ఆలయ దర్శనం చేసుకున్నారు. కాగా జూన్ 29 నుంచి 69,535 మంది యాత్రికులు 10 బ్యాచ్‌లుగా జమ్ములోని భగ్వతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరారు. మొదటి బ్యాచ్ యాత్రికులను లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి పంపించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11న అమర్‌నాథ్ యాత్ర ముగియాల్సి ఉంది.


ఏపీ, తెలంగాణ హెల్ప్‌లైన్‌ అమర్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలుగు వారి సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశాయి. ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ భవన్‌ అధికారులు వేర్వేరుగా హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు. చిక్కుకున్న యాత్రికులు 011-23380556, 011-23380558 నెంబర్లను సంప్రదించాలని తెలంగాణ భవన్‌ అధికారులు తెలిపారు. ఇక 011-23384016, 011-23387089 నెంబర్లకు ఫోన్‌ చేయాలని ఏపీ భవన్‌ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్‌ యాత్రికుల విషయంలో సీఎంవో అధికారులతో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడారు. యాత్రికులతో సమన్వయం చేసేందుకు ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాంశు కౌశిక్‌ శ్రీనగర్‌కు వెళ్లారు. 

Updated Date - 2022-07-10T22:51:05+05:30 IST