ఆ పిల్లాడు చూయింగ్ గమ్‌ నమిలి, జేబులో దాచుకున్నాడు.. దానిని చూశాక వచ్చిన ఐడియాతో.. ప్రపంచానికే పాఠం నేర్పుతున్నాడు!

ABN , First Publish Date - 2021-12-08T16:22:23+05:30 IST

ప్రపంచంలోని పలు పట్టణాలలో బయోకెమికల్‌తో..

ఆ పిల్లాడు చూయింగ్ గమ్‌ నమిలి, జేబులో దాచుకున్నాడు.. దానిని చూశాక వచ్చిన ఐడియాతో.. ప్రపంచానికే పాఠం నేర్పుతున్నాడు!

ప్రపంచంలోని పలు పట్టణాలలో బయోకెమికల్‌తో పాటు ప్రతినిత్యం పేరుకుపోతున్న చెత్త పెద్ద సమస్యగా పరిణమించింది. దీనికి రీసైక్లింగ్ ఒక్కటే సమాధానంగా కనిపిస్తోంది. అయితే ఈ రీసైక్లింగ్ ప్రక్రియను తాత్కాలికంగా కాకుండా, దీర్ఘకాలంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి రీసైక్లింగ్ ప్రక్రియకు ఉదాహరణగా నిలిచారు. సోషల్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్వెంటర్ డాక్టర్ బినిష్ దేశాయి. ఈయన స్థాపించిన కంపెనీ పర్యావరణ స్నేహపూర్వక పీపీఈ కిట్లు, మాస్కులు, ఇటుకలు మొదలైనవి రూపొందించి వార్తల్లో నిలిచింది. ఆయన తన 16 ఏళ్ల వయసులో ఒక వేస్ట్ మేనేజిమెంట్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ రోజు 28 ఏళ్ల వయసులో ఆయనను ప్రపంచమంతా గుర్తించింది. ఈ నేపధ్యంలో ఆయన భారత్‌లో రీసైక్లింగ్ మ్యాన్‌గా పేరుగాంచారు. ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక 2018లో అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్ జాబితాలో డాక్టర్ దేశాయి పేరును చేర్చింది. ఇదేవిధంగా ఆయన పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు.


 ఇటీవల డాక్టర్ బినిష్ దేశాయి మీడియాతో ముచ్చటించారు.  తాను చదువుకుంటున్న రోజుల్లో 11 ఏళ్ల వయసులో ఒకరోజు తాను చూయింగ్ గమ్‌ను కాగితంలో చుట్టి, జేబులో పెట్టుకుని, మరచిపోయానన్నారు. రెండు రోజుల తరువాత చూస్తే, ఆ చూయింగ్ గమ్ గట్టిగా రాయి మాదిరిగా తయారయ్యిందన్నారు. దీనిని చూశాక తనకు అడ్వాన్స్ ఇటుక 1.0 తయారు చేసే ఆలోచన వచ్చిందన్నారు. ఈ దిశగా పరిశోధనలు చేస్తూ 2010లో ఇకో ఎలెక్టిక్ టెక్నాలజీస్ ప్రారంభించానన్నాను. తరువాత పీ బ్లాక్ ఇటుకలు తయారు చేసేందుకు పేపరు మిల్లుల నుంచి లభించే వేస్టేజీని వినియోగించానన్నారు. గడచిన ఏడాది నుంచి తమ కంపెనీ 2.0 ఇటుకలను తయారు చేయడం ప్రారంభించిందన్నారు. ఇదేవిధంగా వ్యర్థ కాగితాలతో రీసైక్లింగ్ పీపీఈ కిట్లు, మాస్కులు తయారు చేశామన్నారు. వీటిని శానిటైజ్ కూడా చేశామన్నారు. ఈ ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు కూడా వచ్చిందన్నారు. గుజరాత్‌కు చెందిన బినిష్ దేశాయి అభిప్రాయంలో ఈ ప్రపంచంలో నిరుపయోగమైనదేదీ లేదు. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన విధానం తెలియాలి. ఈ పనులు చేపట్టే విషయంలో దేశాయికి మొదట్లో ఇంటిలోనివారి నుంచి ఎటువంటి మద్దతు దొరకలేదు. దీంతో బినిష్ దేశాయి తన పాకెట్ మనీని ఉపయోగించి, ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాలు చేస్తూనే ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇప్పటి వరకూ ఆయన 104 రకాల ఇండస్ట్రియల్ వేస్టేజీని గుర్తించారు. వీటి రీసైక్లింగ్‌తో 193కు పైగా పర్యావరణ అనుకూల రోడ్డు నిర్మాణాలను చేపట్టారు. ఈ నేపధ్యంలోనే దేశాయి స్వచ్ఛభారత్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దేశాయి ఆధ్వర్యంలో తయారైన ఇటుకలు దేశంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లోని 150కి పైగా నిర్మాణాలకు వినియోగించారు. దేశాయి ఇప్పటి వరకూ 2003 మెట్రిక్ టన్నులకుపైగా చెత్తను రీసైకిలింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సహాయంతో ఇళ్లను నిర్మించేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు.



Updated Date - 2021-12-08T16:22:23+05:30 IST