Viral Video: నేనిచ్చే ఆర్డర్ల గురించి నా భర్తకు తెలియకూడదు.. అని డోర్‌మ్యాట్‌పై రాసిన భార్య.. ఆ అమెజాన్ డెలివరీ ఏజెంట్ దాన్ని చూసి..
ABN , First Publish Date - 2021-10-27T02:41:09+05:30 IST
కస్టమర్ సర్వీస్.. ఈ పదాలు వింటే చాలు కొందరికి ఒళ్లు మండిపోతుంది. ఎన్ని సార్లు వారికి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోగా.. సమయం వ్యర్థం అవుతుంది అంటూ అనేక మంది వాపోవడం మనం చూసే ఉంటాం. కానీ..
ఇంటర్నెటె డెస్క్: కస్టమర్ సర్వీస్.. ఈ పదాలు వింటే చాలు కొందరికి ఒళ్లు మండిపోతుంది. ఎన్ని సార్లు వారికి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోగా.. సమయం వ్యర్థం అవుతుంది అంటూ అనేక మంది వాపోవడం మనం చూసే ఉంటాం. కంపెనీలు అసలు ఇటువంటి కస్టమర్ సర్వీసును ఎందుకు కొనసాగిస్తుంటాయో అని మరికొందరు విమర్శిస్తుంటారు. కానీ.. ఓ అమెజాన్ డెలివరీ ఏజెంట్ మాత్రం కస్టమర్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. చెప్పింది చెప్పినట్టుగా చేసి.. కస్టమర్ సర్వీస్ పదానికి ప్రతిరూపంగా నిలిచింది. అందరి చేతా శభాష్ అనిపించుకుంది. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ కస్టమర్ యూట్యూబ్‌లో షేర్ చేస్తే అది విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆ డెలివరీ ఏజెంట్‌ను పొగడ్తలలో ముంచెత్తుతున్నారు.
అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రం టల్సా ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇటీవల అమెజాన్‌లో ఓ వస్తువును కొనుగోలు చేసింది. అయితే.. డెలివరీ ఏజెంట్లు సాధారణంగా వస్తువులను కస్టమర్ ఇళ్ల గుమ్మాల ముందు వదిలేసి వెళ్లిపోతారు. దీంతో..డెలివరీ ఏజెంట్ కోసం ఆమె ఓ సరదా సూచన చేసింది. ‘ఈ ప్యాకేజీ విషయం నా భర్తకు తెలియకూడదు’ అని డోర్ మ్యాట్‌పై స్పష్టంగా రాసింది. దీన్ని చూసిన ఏజెంట్.. ఆ సూచనను తూచా తప్పకుండా పాటించింది. ఆ ప్యాకేజీ కస్టమర్ భర్తకు కనిపించకుండా ఉండేందుకు పక్కనే ఉన్న పొదల్లో దాచి పెట్టి వెళ్లిపోయింది.
ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నిత్యం బిజీగా ఉండే ఓ డెలివరీ ఏజెంట్ ఇలా చెప్పింది చెప్పినట్టు చేయడం చూసిన కస్టమర్ ఆశ్చర్యపోయింది. తాను చేసిన సూచనను కరెక్టుగా అర్ధం చేసుకుందంటూ ఆ సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. డెలివరీ ఏజెంట్‌ను తెగ పొగిడేసిన నెటిజన్లు ఆమెకు కచ్చితంగా జీతం పెంచాలని అభిప్రాయపడ్డారు. మరి కొందరు యథాప్రకారం ఛలోక్తులు కూడా విసిరారు. ‘నేను ఇలాగే డోర్ మ్యాట్‌పై రాసా..కానీ ఆ డెలివరీ ఏజెంట్ ఏమో ప్యాకేజీని డోర్‌మ్యాట్ కింద దాచి పెట్టివెళ్లిపోయాడు’ అంటూ ఓ నెటిజన్ తన ఫన్నీ అనుభవాన్ని పంచుకుంది.